తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ రాజీనామా | Telangana Advocate general Prakash Reddy resigns | Sakshi
Sakshi News home page

తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ రాజీనామా

Published Tue, Mar 27 2018 1:30 AM | Last Updated on Tue, Mar 27 2018 9:28 AM

Telangana Advocate general Prakash Reddy resigns - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ద్వారా గవర్నర్‌కు పంపినట్లు తెలిసింది. అయితే ప్రకాశ్‌రెడ్డి రాజీనామా లేఖపై గవర్నర్‌ నిర్ణయం వెలువడాల్సి ఉంది. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణకు సంబంధించిన కేసు మంగళవారం విచారణకు రానున్న నేపథ్యంలో ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి బహిష్కరణ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో చోటుచేసుకున్న పరిణామాలే ప్రకాశ్‌రెడ్డి రాజీనామాకు దారి తీసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఈ నెల 12న అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన ఒరిజినల్‌ వీడియో ఫుటేజీలను సమర్పిస్తామంటూ హైకోర్టుకు ఏజీ హోదాలో ప్రకాశ్‌రెడ్డి హామీ ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా అలా ఎలా హామీ ఇస్తారని నిలదీయడంతో ఏజీ నొచ్చుకున్నట్లు సమాచారం. అంతేగాక ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేను రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభుత్వం ప్రకాశ్‌రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కేసు నుంచి తప్పుకోవాలని ఏజీకి స్పష్టం చేయడంతో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై గత రెండ్రోజులుగా తర్జనభర్జన పడ్డ ఏజీ.. తన సన్నిహితుల వద్ద రాజీనామాపై చర్చించారు. అనంతరం రాజీనామా చేయాలని నిర్ణయించుకుని, సోమవారం ఉదయం 11 గంటల సమయంలో లేఖను సీఎస్‌ ద్వారా గవర్నర్‌కు పంపారు. 

ఇదీ జరిగింది 
ఈ నెల 12న అసెంబ్లీలో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు నిరసన తెలియచేశాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి తన చేతిలో ఇయర్‌ ఫోన్‌ను విసిరేశారు. అది వెళ్లి వేదికపై ఉన్న మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు తగిలిందని, దీంతో ఆయన కంటికి గాయమైందంటూ వివాదం రేగింది. దీన్ని ఆధారం చేసుకొని నల్లగొండ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డితో పాటు అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను కూడా సభ నుంచి బహిష్కరించారు. నల్లగొండ, అలంపూర్‌ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం వర్తమానం పంపారు. ఈ నేపథ్యంలో ఆ ఇరువురు ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి దిగారు. తమ బహిష్కరణను సవాల్‌ చేయడంతో పాటు తమ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో ముందుకెళ్లకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని, అలాగే గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన మొత్తం ఒరిజినల్‌ వీడియో ఫుటేజీలను కోర్టు ముందుంచేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. 

మండలి చైర్మన్‌ ఉల్లాసంగానే గడిపారు 
కోమటిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు ఈ నెల 19న విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇయర్‌ ఫోన్‌ విసిరిన తర్వాత కూడా మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఉల్లాసంగా గడిపారని, వేదికపై ఉన్న స్పీకర్‌తో నవ్వుతూ మాట్లాడారని కోర్టుకు తెలిపారు. గవర్నర్‌ తన ప్రసంగాన్ని పూర్తి చేసి వెళ్లే సమయంలో ఆయనతోపాటు బయట వరకు వెళ్లి వీడ్కోలు పలికి వచ్చారని, ఆ తర్వాతే ఇయర్‌ ఫోన్‌ వల్ల కంటికి గాయమైందంటూ ఆరోపణలు మొదలుపెట్టారని తెలిపారు. తర్వాత ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇయర్‌ ఫోన్‌ విసిరి మండలి చైర్మన్‌ను గాయపరిచినందుకు కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరించ లేదని, గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా సభ ప్రతిష్ట దెబ్బ తినేలా వ్యవహరించినందుకే బహిష్కరించామని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి, నల్లగొండ, అలంపూర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో ఆరు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. ఇదే సమయంలో ఒరిజినల్‌ వీడియో ఫుటేజీలను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 

మీ ఆదేశాలు వద్దు.. నా హామీ చాలు 
ఈ సమయంలో ఏజీ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ.. వీడియో ఫుటేజీల సమర్పణ విషయంలో ఆదేశాలు అవసరం లేదని, ఫుటేజీని తప్పక సమర్పిస్తామని, ఇది తన హామీ అని చెప్పారు. ప్రకాశ్‌రెడ్డి ఇచ్చిన ఈ హామీని నమోదు చేసిన న్యాయమూర్తి ఫుటేజీల సమర్పణ నిమిత్తం విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఆ తర్వాత హాజరైన అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఫుటేజీలు తీసుకోవాలంటే సభ తీర్మానం అవసరమని, అందువల్ల ఫుటేజీల సమర్పణకు మరింత గడువు కావాలని కోర్టును కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు. ఆ రోజున వీడియో ఫుటేజీలు సమర్పించి తీరాలని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం వద్ద రెండ్రోజుల క్రితం ఓ సమావేశం జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వీడియో ఫుటేజీల సమర్పణ విషయంలో ఇచ్చిన హామీపై సీఎం ప్రస్తావించారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఇలా హామీ ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ఏజీని ప్రశ్నించినట్లు సమాచారం. ఫుటేజీలు సమర్పిస్తే వచ్చే ఇబ్బందులను సైతం సీఎం ఈ సందర్భంగా లేవనెత్తారు. అయితే ముఖ్యమంత్రి అభిప్రాయంతో ఏజీ ఏకీభవించలేదని తెలిసింది. 

సాల్వే నియామకంపై చెప్పని సర్కార్‌ 
తాను మాములు న్యాయవాదిగా ఆ హామీ ఇవ్వలేదని, రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌గా హామీ ఇచ్చినందున దానికి ఓ విలువ ఉంటుందని ప్రకాశ్‌రెడ్డి అన్నట్టు సమాచారం. తాను ఇచ్చిన హామీపై వెనక్కి వెళ్లడం సాధ్యం కాదని అన్నట్టు తెలిసింది. కానీ ఈ విషయంలో సీఎం అభిప్రాయం భిన్నంగా ఉండటంతో తన పదవికి రాజీనామా చేయాలని ప్రకాశ్‌రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో కోమటిరెడ్డి, సంపత్‌ల వ్యవహారంలో హైకోర్టులో జరుగుతున్న విచారణకు ఢిల్లీ నుంచి సుప్రీం సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేను రప్పించాలని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ప్రకాశ్‌రెడ్డికి ఎలాంటి సమాచారం అందలేదు. సాల్వే ద్వారా వాదనలు వినిపించాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ కేసు నుంచి తప్పుకోవాలని ప్రకాశ్‌రెడ్డికి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని అవమానంగా భావించిన ప్రకాశ్‌రెడ్డి ఏజీ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. గతేడాది జూలై 17న ప్రకాశ్‌రెడ్డి అడ్వొకేట్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 

నేడు కేసు విచారణ 
తమ బహిష్కరణపై కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరపనుంది. గవర్నర్‌ ప్రసంగం రోజున జరిగిన ఘటనలకు సంబంధించిన మొత్తం ఫుటేజీని తమ ముందుంచాలని హైకోర్టు గత వారం ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో న్యాయస్థానం తదుపరి ఏం ఆదేశాలు ఇవ్వబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోమటిరెడ్డి, సంపత్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ హాజరు కానున్నట్లు తెలిసింది. ప్రభుత్వం తరఫున హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement