ఎక్కడా లేని అభివృద్ధి ఇక్కడే జరుగుతోంది: మంత్రి లక్ష్మారెడ్డి
ఖమ్మం: దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆర్యోగ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఉద్యమ నేత మన ముఖ్యమంత్రి కావడం అదృష్టమని, ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి పని చేద్దామని అంగన్‌వాడీలకు సూచించారు. అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ కృతజ్ఞత సభలో మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
గౌరవప్రదమైన వేతనం కల్పించి తమ డిమాండ్లు పరిష్కరించిన సీఎం కేసీఆర్‌కు అంగన్‌వాడీలు ధన్యవాదాలు తెలిపారు. తమకు అండగా నిలిచిన గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు, మంత్రులు తుమ్మల, లక్ష్మారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్మీనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, స్థానిక నేతలు పాల్గొన్నారు.
మాతా శిశు నూతన వైద్యశాల ప్రారంభం
ఖమ్మం నగరంలో రూ.23.50కోట్లతో నిర్మించిన మాతాశిశు నూతన ఆసుపత్రిని మంత్రి డాక‍్టర్ లక్ష్మారెడ్డి, మంత్రి తుమ్మలతో కలిసి ప్రారంభించారు. 150 పడకలతో అత్యాధునిక వైద్యపరికరాలతో దీన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ప్రభుత్వ పెద్దాసుపత్రిలో నూతనంగా రూ.26లక్షలతో ఏర్పాటు చేసిన ఐసీయూను ప్రారంభించారు.