
సాక్షి, హైదరాబాద్ : శాసన సభ, శాసన మండలి శీతాకాల సమావేశాలు 50 రోజుల పాటు కొనసాగనున్నాయి. గురువారం అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సమక్షంలో జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాలపై సమగ్ర చర్చ జరిపేందుకు యాభై రోజులపాటు సభ జరపాలని, శుక్రవారం తొలిరోజు సభ ముగిసిన తర్వాత మరోసారి బీఏసీ సమావేశమై ఎజెండా ఖరారు చేయాలని నిర్ణయించారు. వారంలో అయిదు రోజులపాటు సభ జరిపి శని, ఆదివారాల్లో సెలవులు ఇవ్వాలని, అలాగే నవంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో మూడ్రోజులపాటు సభకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు.
స్పీకర్ మధుసూదనాచారి జ్వరంతో బాధపడుతుండడంతో డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో బీఏసీ భేటీ నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఇతర పక్షాల నేతల మధ్య వివిధ అంశాలపై చర్చ జరిగింది. కాంగ్రెస్, ఇతర పక్షాలన్నీ దాదాపు 20 అంశాలను చర్చకు ప్రతిపాదించగా.. వాటికితోడు మరికొన్ని అంశాలు జోడించినా తమకు అభ్యంతరం లేదని సీఎం ఈ సందర్భంగా అన్నారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రతి అంశాన్ని ఎజెండాలో చేర్చాలని డిప్యూటీ స్పీకర్‌కు సూచించారు. సమావేశాలను 20 రోజులు నిర్వహించాలని కొద్దిరోజుల కిందట పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరిన నేపథ్యంలో అన్ని అంశాలు చర్చించడానికి 50 రోజులపాటు సభ నడపాలని సీఎం ప్రతిపాదించారు.
ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం!
ప్రశ్నోత్తరాల నిర్వహణలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతిరోజు 10 ప్రశ్నలు తీసుకోవాలని, ఒక్కో ప్రశ్నకు 9 నిమిషాల సమయం కేటాయించి, 9వ నిమిషం తర్వాత కచ్చితంగా మరో ప్రశ్నకు వెళ్లిపోవాలని సూచించారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించాలని కోరారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత సభ్యులకు జీరో అవర్ కింద తమ ప్రాంత సమస్యలు చెప్పే అవకాశం కల్పించాలని, అనంతరం సభలోనే సభ్యులు ప్రభుత్వానికి పిటిషన్లు సమర్పించే పద్ధతి కొత్తగా ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. ప్రతీ బిల్లుపై కూలంకశంగా చర్చ జరగాలని, సభ్యులు చేసే సూచనలకు అనుగుణంగా బిల్లులో అవసరమైతే మార్పులు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
అత్యవసర సమస్యలను వాయిదా తీర్మానాల ద్వారా చర్చకు అనుమతించాలన్న ప్రతిపక్ష నేత జానారెడ్డి విజ్ఞప్తిని కూడా బీఏసీ ఆమోదించింది. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలను పరిశీలించేందుకు డిప్యూటీ స్పీకర్ అంగీకరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ గౌరవంగా, హుందాగా జరుగుతోందన్న సంకేతం యావత్ దేశానికి అందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నిర్వహణ తీరును తాను, జానారెడ్డి, ఇతర సీనియర్ సభ్యులు చూశామని, అప్పుడు చాలా తక్కువ రోజులు సభ నిర్వహించేవారని అన్నారు. అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావించడానికి సభ్యులకు అవకాశమే రాకపోయేదని, అధికారపక్షం నామమాత్రంగా సభ నిర్వహించేదని గుర్తు చేశారు.
మండలిలో నాటి ఒరవడి కొనసాగాలి
శాసన మండలిలో జరిగిన బీఏసీలోనూ దాదాపు పై అంశాలనే చర్చించారు. ఈ బీఏసీ భేటీలో సీఎం కేసీఆర్ తన పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. 70వ దశకంలో శాసనమండలి సమావేశాలం టే అందరికీ క్రేజ్ ఉండేదని, సభ్యుల ప్రశ్నలు, చర్చల సందర్భంగా వారు మాట్లాడే తీరు మంత్రులకు దడ పుట్టించేదన్నారు. కొందరు మంత్రులు మండలికి రావాలంటేనే భయపడే పరిస్థితి అప్పట్లో ఉండేదని, తాను ఎంఏ విద్యార్థిగా ఉన్నపుడు మండలి సమావేశాలు వీక్షించడానికి తరచుగా వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు.
అప్పటి ఎమ్మెల్సీలు యజ్ఞ నారాయణ, మాణిక్‌రావు, కె.కేశవరావు ప్రసంగాలు తనను ఆకట్టుకునేవని, మండలి ప్రస్తుత సమావేశాల్లో మునుపటి ఒరవడి కొనసాగాలని అభిలషించారు. అసెంబ్లీ, శాసన మండలిలో ఒకేరోజు ఒకే అంశంపై చర్చ జరగకూడదన్నారు. అసెంబ్లీలో ఒక అంశంపై చర్చ జరిగిన తర్వాత మండలిలో రెండ్రోజుల విరామం తర్వాత దానిపై చర్చ జరగాలని సూచించారు. ఇకపై మండలి సమావేశాలకు తాను తరచుగా హాజరవుతానని, మండలిలో విపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం అభినందనీయమని పేర్కొన్నారు.
అసెంబ్లీ ముట్టడి పిలుపు సరికాదు
అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం సరైంది కాదని జానారెడ్డితో సీఎం అన్నారు. ప్రాణాలు పోయినా అసెంబ్లీ ముట్టడి ఆగదని కాంగ్రెస్ నాయకులు ప్రకటించడాన్ని సీఎం తప్పుపట్టినట్లు సమాచారం. ఎవరి ప్రాణాలు ఎందుకు పోవాలన్న కేసీఆర్.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి సమస్యలను తెచ్చే వేదికగా అసెంబ్లీని ఉపయోగించుకోవాలని సూచించారు. సభలో కూడా ఏ సమస్యపై అయినా చర్చించడానికి సిద్ధమని, అదే సమయంలో గొడవ చేసి అరాచకం చేద్దామంటే తాము కఠినంగానే ఉంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment