తొలిరోజునే బీజేపీకి ఇరకాటం!
అసెంబ్లీలో పెద్దనోట్ల రద్దు అంశం చర్చకు రావడంపై అసంతృప్తి
అధికార టీఆర్‌ఎస్ తీరుపై కమలనాథుల గుర్రు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే బీజేపీ శాసనసభాపక్షం సభలో ఇరుకున పడే పరిస్థితి ఎదురుకానుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడంతో రాష్ట్రంలోని వివిధవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిం దే. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల మొదటిరోజునే ఈ అంశంపై చర్చకు అధి కారపక్షం ఆమోదం తెలపడంతో రాష్ట్ర బీజేపీ సంకటంలో పడింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అటు లోక్‌సభ, రాజ్యసభలను కుదిపేస్తుండగా, జాతీయస్థాయిలో విపక్షపార్టీల విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ ఎంతో శ్రమించాల్సి వస్తోంది. క్షేత్రస్థాయి లో సమస్యలు పరిష్కారం కాక.. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు దొరకక ప్రజల ఇబ్బందులు తీవ్రం కావడంతో కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తూ సమాధానాలు చెప్పుకోవడం బీజేపీ నాయకులకు కష్టంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వడమంటే బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల దాడికి అవకాశం ఇచ్చినట్లేననే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను సభలో ఎండగడతామని, కనీసం 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలంటూ బీజేఎల్పీ డిమాండ్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కానీ అందుకు పూర్తి భిన్నంగా సమావేశాల తొలిరోజునే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. బీజేపీ పట్ల అధికార టీఆర్‌ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. పెద్దనోట్ల రద్దుపై మోదీ తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుగా వ్యతిరేకించి, ఆ తర్వాత మంచి నిర్ణయమని ప్రకటించడం బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒకింత సంతోష పరిచింది. అటు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, నోట్ల రద్దు నిర్ణయం అమలు సరిగా లేదని కిందిస్థాయిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎప్పటికప్పుడు ఏదో ఒక పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం తన అసంతుష్ట వైఖరిని స్పష్టం చేస్తుండడం బీజేపీ నాయకులకు మింగుడు పడడం లేదు.
విపక్షాలకు అవకాశం..
ఈ పరిణామాల దృష్ట్యా అసెంబ్లీలో మోదీ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంపై కాంగ్రెస్, ఎంఐఎం, ఇతర విపక్షాల విమర్శలకు పరోక్షంగా అధికార టీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుందని ఈ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.