సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బ్యాంకర్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)ను ఎంపిక చేశారు. ఈ మేరకు నోటిఫై చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బ్యాంకర్‌గా ఎంపిక చేసుకున్న ఆర్‌బీఐ ఇకపై జనరల్ బ్యాంకింగ్ బిజినెస్ నిర్వహిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్‌బీఐలో ఖాతా తెరవడానికి ఆమోదించిందని, నాగ్‌పూర్ శాఖలో తెలంగాణ రాష్ట్ర ఖాతాను రూ. 1.38 కోట్లతో ప్రారంభించినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జారీ అయిన తొలి ఉత్తర్వు ఇదే కావడం విశేషం. ఆర్‌బీఐ ఇతర శాఖల్లో సబ్సిడరీ జనరల్ లెడ్జర్ అకౌంట్‌ను తెరవడానికి కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్ర మిగులు నిధులను, అనుమతించిన సెక్యూరిటీలను పెట్టుబడిగా పెట్టడానికి ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఆ ఉత్తర్వుల్లో వివరించారు.