సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వచ్చే ఎన్నికల్లో కింగ్ కాకపోయినా... కింగ్ మేకర్ అవ్వాలని కలలుగంటున్న భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పాగా కోసం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఒంటరిగా పోటీచేసి అనూహ్య విజయాలను సొంతం చేసుకోవాలనే ఆలోచనతో నాయకులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంలో గట్టి పోటీ ఇచ్చిన స్థానాలతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన నాయకత్వంతో అద్భుత విజయాలు సాధిస్తామనే ధీమా కమల నేతల్లో కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాల జోడి దేశంలోని పలు రాష్ట్రాల్లో సాధించిన విజయాల పరంపరలో తెలంగాణ రాష్ట్రం కూడా చేరితే తమకు ఎదురులేదని టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు భావిస్తున్నారు.
ఇప్పటికే జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసుకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో పోటీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసినట్లు సమాచారం. వచ్చే వారంలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి మరింత స్పష్టత రానున్నట్లు జిల్లా నేతలు చెపుతున్నారు. అమిత్‌షా రాష్ట్ర పర్యటనతో కొత్తగా పార్టీలోకి వలసలు పెరగడం కలిసి వచ్చే అదృష్టంగా బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈసారి పోటీ చేస్తే మోదీ, అమిత్‌షా కలిసి చేసే ప్రచారం వల్ల గట్టెక్కినా ఆశ్చర్యపోనక్కరలేదని నాయకులు భావిస్తున్నారు.
పది సీట్లలో పోటీకి నిర్ణయం
రాష్ట్రంలో ఈసారి ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్న బీజేపీ నేతలు అందుకు అనుగుణంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయనుంది. 2014 ఎన్నికల్లో మిత్రపక్షం టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఆదిలాబాద్, ముధోల్ నియోజకవర్గాల్లో 14వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అప్పట్లో టీడీపీతో పొత్తే తమ కొంప ముంచిందని భావిస్తున్న బీజేపీ నేతలు ఈసారి ఒంటరిగా పోటీచేసి ఈ రెండు సీట్లతో పాటు మరో మూడింట విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆదిలాబాద్, ముధోల్‌తో పాటు ఈసారి మంచిర్యాల, నిర్మల్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో సైతం గెలుపు అవకాశాలు ఉన్నాయని పార్టీ భావిస్తోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల విషయంలో చేసే తప్పులను అనుకూలంగా మలుచుకొంటూ ముందుకు సాగాలని నిర్ణయించినట్లు నాయకుడొకరు చెప్పారు. అందుకే ఎవరు పోటీ చేయబోతున్నారో తెలిసినా, కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తరువాతే బీజేపీ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది.
మంచిర్యాలలో తెరపైకి ఎన్నారై
మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి గత ఎన్నికల్లో మంచిర్యాల స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేయాలని భావించగా, కొత్తగా రఘునాథరావు అనే ఓ ఎన్నారై తెరమీదికి వచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో రాజకీయంగా బలమైన ఓ సామాజిక వర్గానికి చెందిన ఈయనను కొందరు మంచిర్యాలలో పోటీకి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ కోసం గత కొన్నేళ్లుగా సేవలందిస్తున్న మల్లారెడ్డి మాత్రం తనకే సీటు అనే ధీమాతో ఉన్నారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నాయకుడు గోలి రాము కూడా టికెట్టు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
చెన్నూర్‌లోనూ తీవ్ర పోటీ
చెన్నూర్ నియోజకవర్గంలో పోటీకి పలువురు నాయకులు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రాం వేణుతో పాటు 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన అందుగుల శ్రీనివాస్ టికెట్టు వేటలో ముందున్నారు. బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తూ పలుమార్లు అభ్యర్థిగా పోటీ చేసిన ఆరుమల్ల పోషం, మరో నాయకుడు రొడ్డ మోహన్ కూడా టికెట్టు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
బోథ్ నియోజకవర్గంలో గతంలో ఆదిలాబాద్ జెడ్పీటీసీగా పనిచేసిన మడావి రాజుతో పాటు నానాజీ టికెట్టు కోసం పోటీ పడుతున్నారు.
ఎస్టీ రిజర్వుడ్ ఖానాపూర్‌లో ప్రస్తుతానికి పండూరి ప్రభాకర్ అభ్యర్థిగా భావిస్తున్నప్పటికీ, ఇక్కడ నెలకొన్న రాజకీయ పరిణామాలలో ఏ మార్పులైనా జరిగే అవకాశం ఉంది.
ఆరుగురు అభ్యర్థులు ఖరారైనట్టే!
బీజేపీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు ఖరారైనట్టే. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పాయల్ శంకర్, ముధోల్‌లో పడకంటి రమాదేవి గత ఎన్నికల్లో విజయానికి కొద్ది దూరంలో నిలిచారు. ఈసారి కూడా వీరే పోటీలో నిలవనున్నారు.
- నిర్మల్‌లో మాజీ డిప్యూటీ స్పీకర్ భీంరెడ్డి కూతురు డాక్టర్ స్వర్ణారెడ్డి ఇటీవలే బీజేపీలో చేరడంతో పోటీ చేయడం ఖరారైంది. ఇప్పటికే ఇక్కడ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డిల మధ్య గట్టి పోటీ నెలకొనగా, అదే సామాజిక వర్గానికి చెందిన స్వర్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా నిలువనుండడం గమనార్హం.
- సిర్పూర్‌లో డాక్టర్ శ్రీనివాస్ ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు, పాదయాత్రలు, ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. శ్రీనివాస్‌కు టికెట్టు ఖరారైనట్టే.
- ఆసిఫాబాద్ నియోజకవర్గంపై కూడా దృష్టి పెట్టిన బీజేపీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి 25వేల ఓట్లు సాధించిన మర్సుకోల సరస్వతిని బరిలో నిలపాలని నిర్ణయించింది. అయితే ఆమె ఇంకా బీజేపీ తీర్థం పుచ్చుకోలేదు. జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచిగా మొన్నటి వరకున్న ఆమె ప్రస్తుత ఎమ్మెల్యే కోవ లక్ష్మికి స్వయానా సోదరి. ఆదివాసీ అభ్యర్థుల పోరులో సరస్వతికి విజయావకాశాలు ఉంటాయని బీజేపీ అంచనా వేస్తోంది.
- టీఆర్‌ఎస్ ఆసిఫాబాద్ జెడ్పీటీసీగా గెలిచి, రాష్ట్ర జెడ్పీటీసీల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న కొయ్యల ఏమాజీ ఏడాది క్రితమే టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో పోటీ చేయడమే లక్ష్యంగా ఆయన గత కొన్ని నెలలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆయనకే అధిష్టానం కూడా టికెట్టు ఖరారు చేయనుందనడంలో సందేహం లేదు. ఈ ఆరింట అభ్యర్థులు మారే అవకాశాలు లేవని పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment