దాచిన అప్పు.. 10 వేల కోట్లు! | Telangana budget-2017-18 10 thousand crore Loan to TRS Govt | Sakshi
Sakshi News home page

దాచిన అప్పు.. 10 వేల కోట్లు!

Published Tue, Mar 14 2017 3:09 AM | Last Updated on Sat, Aug 11 2018 6:44 PM

దాచిన అప్పు.. 10 వేల కోట్లు! - Sakshi

దాచిన అప్పు.. 10 వేల కోట్లు!

సాక్షి, హైదరాబాద్‌: అప్పులు, వడ్డీల భారం రాష్ట్రాన్ని వణికిస్తోంది. సర్కారును సైతం ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే.. ఈసారి బడ్జెట్‌లో కొంతమేరకు అప్పులను దాచి పెట్టింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో అప్పుల కుప్ప రూ.1.40 లక్షల కోట్లకు చేరుతుందని బడ్జెట్‌లో ప్రస్తావించింది. కానీ ఇది రూ.1.50 లక్షల కోట్లు దాటే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది.

దాదాపు రూ.10 వేల కోట్ల అప్పును ప్రభుత్వం దాచిపెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవలే కేంద్రం అమలు చేస్తున్న ఉదయ్‌ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరింది. దీంతో విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కం) అప్పులన్నీ రాష్ట్ర ఖజానాకు బదిలీ అయ్యాయి. దీంతో రూ.8,924 కోట్ల అప్పు రాష్ట్ర ఖాతాకు చేరింది. ఇటీవలే రిజర్వ్‌ బ్యాంకు మార్కెట్‌ బాండ్లను వేలం వేసి ప్రభుత్వం ఈ అప్పులను తీర్చింది. కానీ.. బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. వీటితోపాటు మార్చి నెలలో ప్రభుత్వం తీసుకున్న రుణాలనూ ఇందులో చూపించలేదు.

2016–17 బడ్జెట్‌ సవరణల ప్రకారం.. రూ.1.14 లక్షల కోట్ల అప్పులున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటికితోడు కొత్త బడ్జెట్‌లో ప్రస్తావించిన రూ.26 వేల కోట్ల ద్రవ్యలోటు మేరకు చేసే అప్పులన్నీ కలిపి.. రూ.1.40 లక్షల కోట్లుగా లెక్క తేల్చింది. కానీ ఇందులో జమ చేయకుండా వదిలేసిన అప్పులు కలిపితే రూ.1.50 లక్షల కోట్లకు చేరనుంది. రాష్ట్ర విభజన సమయంలో రూ.70 వేల కోట్లతో మొదలైన తెలంగాణ రుణ ప్రస్థానం మూ డేళ్లలోనే రెండింతలు దాటిపోయింది. వీటికి తోడు కార్పొరేషన్ల పేరిట బడ్జెట్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్ర భవిష్యత్‌ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయనున్నాయి.

బడ్జెటేతర అప్పులు రూ.40 వేల కోట్లకు పైనే..
బడ్జెటేతర వనరుల ద్వారా గొర్రెల పెంపకం, చేపల పెంపకం, మైక్రో ఇరిగేషన్‌ పథకాలు, మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఆసుపత్రుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పూచీకత్తుతో వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు సమీకరించి వీటికి ఖర్చు చేయాలనేది లక్ష్యం. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తు రుణాల చిట్టా రూ.31,453 కోట్లకు చేరింది. ఈ ఏడాది కొత్తగా రూ.40 వేల కోట్ల పూచీకత్తు రుణాలు తీసుకునే అవకాశముంది. ప్రభుత్వం నేరుగా తమపై భారం పడకుండా కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకున్నప్పటికీ.. వడ్డీ సహా అప్పులు తీర్చే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. దీంతో వడ్డీల చెల్లింపులు ఏటేటా భారీగా పెరిగిపోతున్నాయి.

తలసరి అప్పు రూ.42,857 కోట్లు
వడ్డీల చెల్లింపులు వచ్చే ఏడాది నుంచి సర్కారుకు తలకు మించిన భారంగా మారనున్నాయి. గత ఏడాది అప్పులపై వడ్డీలకు ప్రభుత్వం రూ.7,700 కోట్లు చెల్లించింది. 2017–18లో అప్పులపై చెల్లించే వడ్డీలకు రూ.11,138 కోట్లు అవసరమని ఖర్చుల పద్దులో ప్రస్తావించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను పంచితే తలసరి అప్పు రూ.42,857 ఉంటుంది.

కార్మిక, ఉపాధి, శిక్షణకు రూ.625 కోట్లు
సాక్షి, హైదరాబాద్‌: కార్మిక సంక్షేమం, ఉపాధి, శిక్షణ కార్యక్రమాలకు 2017– 18 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.625.58 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు నిమిత్తం రూ.310.22 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.315.36 కోట్లు ఇచ్చింది. ఇందులో కార్మిక ఉపాధి కల్పన కోసం 155.94 కోట్లు, సామాజిక సర్వీసుల కోసం రూ.6.5 కోట్లు కేటాయించింది. కార్మికుల బీమా, వైద్య సేవల నిమిత్తం రూ.87.66 కోట్లు నిర్దేశించింది. ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ)ల కోసం రూ.8.35 కోట్లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ కోసం రూ.39.28 కోట్లు కేటాయించింది. ఐటీఐ విద్యార్థుల కోసం తలపెట్టిన సంకల్ప్‌ పథకానికి రూ.24.20 కోట్లు కేటాయించింది.  

సివిల్‌ సప్లైస్‌కు కోత
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ఈ సారి బడ్జెట్‌ కేటాయింపులు తగ్గాయి.  తాజా బడ్జెట్‌లో ఈ శాఖకు నిర్వహణ పద్దు కింద రూ.27.21 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.1732.69 కోట్లు మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.2,200 కోట్లు కేటాయించింది. అంతకు మందు 2015–16 బడ్జెట్‌లో సైతం ఇదే మొత్తంలో బడ్జెట్‌ కేటాయించినా విడుదల మాత్రం అంతంత మాత్రంగానే ఉండింది. కాగా ఖర్చు మాత్రం బడ్జెట్‌ అంచనాలను దాటిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బీపీఎల్‌ కుటుంబాలకు ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున ఈ శాఖ రేషన్‌ బియ్యం సరఫరా చేస్తోంది. 2015–16 బడ్జెట్‌లో కేటాయించింది రూ.2,200 కోట్లు కాగా, ఆ ఏడాది ఏకంగా రూ.3,800 కోట్లు ఖర్చయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement