ప్రమాణాలకే పెద్దపీట
జిల్లా విద్యార్థులు 2014-15 విద్యాసంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో విద్యాసంబరాలను నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. నవ రాష్ట్రావిర్భావ సందర్భంగా తెలంగాణ వేడుకలు నిర్వహించనున్నారు. మరో వైపు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మౌళిక వసతులు, పాఠ్యపుస్తకాల పంపిణీ, ఉపాధ్యాయుల కొరత తదితర సమస్యలను అధిగమించేందుకు ఎలాంటి ప్రణాళికతో వెళ్తారన్న అంశాలపై డీఈవో డాక్టర్ వై. చంద్రమోహన్ ‘న్యూస్‌లైన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలు ఇలా...
-న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్ విద్యావిభాగం
ప్రశ్న : పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు మీ ప్రణాళిక ఏమిటి..?
జవాబు..: జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచే పాఠశాలలు, ఆవరణ, టాయిలెట్స్, పరిసరాలు శుభ్రం చేయాలని, వంటపాత్రలు కడగాలని ఆదేశాలు జారీ చేశాం. పాఠశాలల్లో పండుగ వాతావరణం కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హెచ్.ఎం.లకు ఆదేశాలు జారీ చేశాం. పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకున్నాం.
ప్ర..: బడిబయటి పిల్లలను చేర్పించేందుకు తీసుకుంటున్న చర్యలు..?
జ..: ఇప్పటికే బడిబయటి పిల్లల వివరాలను సేకరించాం. నేటి నుంచి ప్రతీ టీచరూ వారి పాఠశాల పరిసరాలలలో, గ్రామాలలో స్థానిక యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధుల సహకారంతో బడిబయటి పిల్లలను గుర్తిస్తూ వారిని స్కూళ్లలో చేర్పించే విధంగా చర్యలు తీసుకున్నాం.
ప్ర ..: జిల్లాలో ఉపాధ్యాయులు లేని పాఠశాలల పరిస్థితి ఏంటి..?
జ..: జిల్లాలో 235 స్కూళ్లలో ఉపాధ్యాయులు లేరు. టీచర్లు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి అక్కడికి కొందరిని పంపుతాం. ఈ మేరకు ఎంఇఓలకు సూచించాం. సుమారు 700 ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఆ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్తే పక్క పాఠశాల నుంచి ఉపాధ్యాయుడిని పంపించి తరగతులు కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
ప్ర..: ఏటా పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది పరిస్థితి ఏవిధంగా ఉంది..?
జ..: ఈ విద్యాసంవత్సరానికి 33లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటికే 30లక్షల పుస్తకాలు జిల్లాకు వచ్చాయి. వాటిని అన్ని మండల కేంద్రాలకు పంపించాం. పునఃప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
ప్ర..: మారిన పాఠ్యాంశాల ప్రకారం బోధనకు టీచర్లు సన్నద్ధంగా ఉన్నారా..?
జ..: విద్యాశాఖ ఈ సంవత్సరం పదో తరగతి పాఠ్యాంశాలను మార్చింది. రాష్ట్ర అధికారుల ఆదేశానుసారం కొత్త పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
ప్ర..: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు మీ చర్యలేమిటి..?
జ ..: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు కమిటీలు వేస్తాం. అన్ని చోట్ల ఫీజులు ఒకే విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. అతిక్రమించిన పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తాం.
ప్ర..: మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు చాలా పాఠశాలల్లో కనీస వసతులు లేవు.. ఏవిధంగా అధిగమిస్తున్నారు..?
జ..: జిల్లాలో 3,900 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలవుతుంది. తొలి విడతగా 1,281 పాఠశాలల్లో కిచెన్‌షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటికి 90శాతం పూర్తయ్యాయి. రెండో విడతలో మం జూరైన వంట గధుల నిర్మాణం కూడా తు ది దశలో ఉంది. నిర్మాణం ప్రారంభించని వాటికి వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం.
ప్ర..: సంఖ్యను పెంచేచర్యలు..?
జ..: విశాలమైన గధులు అహ్లాదకరమైన వాతావరణంలో బోధన ఉంటుంది. ప్ర భుత్వ పాఠశాలల్లోనే ప్రమాణాలతో కూ డిన విద్యనందిస్తామనేది చెప్పి, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తాం.