దేశానికే కేంద్ర బిందువులా తెలంగాణ
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం దేశ పటంలో కేంద్ర బిందువులా ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో భారతదేశ మ్యాప్‌లో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపర్చిన నమూనా మ్యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మన రాష్ర్టం మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కూడలిగా ఉందన్నారు. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు వ్యాపార కేంద్రంగా ఉంటుందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని రవాణ వ్యవస్థను పెంపొందించుకుంటే వ్యాపారాన్ని విస్తరించవచ్చన్నారు. గోదావరి, ప్రాణహితకు వంతెనలు నిర్మిస్తే అశేష అవకాశాలు లభిస్తాయన్నారు.
రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుందని, రామగుండం నుంచి కాగజ్‌నగర్ వరకు పారిశ్రామికవాడలుగా మార్చుకునేందుకు అనువైన ప్రదేశంగా ఉందన్నారు. టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను మిగతా రాష్ట్రాల కన్నా అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమించాలని కోరారు. సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 29వ రాష్ట్రంగా దేశ చిత్రపటంలో నమోదు చేయడం చారిత్రాత్మక ఘట్టమన్నారు.