15న సీఎం కేసీఆర్ రాక
రాంనగర్ :రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు. ముందుగానే ఆగస్టు 15న దళితులకు భూ పంపిణీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి జిల్లా నుంచే స్వీకారం చుట్టనున్నారు. ఈ నెల 15న నల్లగొండలోగానీ లేదా నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్ గ్రామంలో గానీ భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అధికార యంత్రాంగమంతా అప్రమత్తమైంది. సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాలో ఎక్కువమంది లబ్ధిదారులను, ఎక్కువ ఎకరాలను ఎంపిక చేసినందున సీఎం ఇక్కడినుంచే భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
సర్వం సిద్ధం కావాలని కలెక్టర్ అధికారులకు ఆదేశం..
ముఖ్యమంత్రి పర్యటన ఖరారైన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ టి.చిరంజీవులు జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యమంత్రి జిల్లాఅధికారులతో సమీక్షించనున్నందున పూర్తి నివేదికలతో సిద్ధం కావాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జిల్లాలో పర్యటించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితుల భూ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలి పారు. సీఎం పర్యటనకు హెలిపాడ్‌తోపాటు స్టేజీ కూడా ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.
మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రజలకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం పర్యటనకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడంతోపాటు జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ పంపిణీ కార్యక్రమం వద్ద అంబులెన్స్‌లతో డాక్టర్ల బృందాన్ని అందుబాటులో ఉంచాలని వైద్యాధికారిని ఆదేశించారు. సీఎం పర్యటనకు పల్లెపహాడ్ గ్రామం ఎంపికైతే ప్రధాన రోడ్డు మార్గం నుంచి రెండు కిలోమీటర్ల వరకు గ్రామానికి యుద్ధప్రాతిపదికపై రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.
భూ పంపిణీ లబ్ధిదారుల విషయంలో ఎంపిక చేసిన భూమి వ్యవసాయశాఖ అధికారులు సాగుకు అనువైనదిగా ఉండి.పంటలు పండే వివరాలతో ధ్రువీకరించాలని సూచించారు. అదే విధంగా సీఎం పర్యటన చింతపల్లి మండలం గడియగౌరారం కూడా ఉండే అవకాశముందని వివరించారు. జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్న కారణంగా అధికారులు గుర్తింపుకార్డులతో ఎవరికి కేటాయించిన విధులు వారే నిర్వహించాలని కోరారు. లబ్ధిదారులకు, వారిని తీసుకువచ్చే అధికారులకు కూడా గుర్తింపుకార్డులు జారీ చేయాలని సూచించారు. అదే విధంగా కలెక్టర్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై సమీక్షించారు. సమావేశంలో జేసీ ప్రీతిమీనా, ఏజేసీ వెంకట్రావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ సునంద, డీఆర్‌డీఏ పీడీ సుధాకర్ పాల్గొన్నారు.