గులాబీ పార్టీలో ... జోష్‌ ! | KCR To Contest As MP From Nalgonda In 2019 Elections | Sakshi
Sakshi News home page

గులాబీ పార్టీలో ... జోష్‌ !

Published Tue, Mar 6 2018 8:43 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

KCR To Contest As MP From Nalgonda In 2019 Elections - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్‌ నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు 2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గడిచిన రెండేళ్లలో ఆయా సందర్భాల్లో ఈ అంశం కార్యకర్తల్లో ప్రచారం జరిగినా, ఈ సారి మరింత స్పష్టంగా ఆయన పోటీ చేయడం ఖాయమని విశ్వసిస్తున్నారు.  జాతీయ రాజకీయాల్లో  చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్‌ ఆ మేరకు రెండు రోజుల కిందటే స్వయంగా ప్రకటన చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్‌ ఆయనను అభినందించడానికి ప్రగతి భవన్‌కు తరలివెళ్లారు. జిల్లా నేతలు సైతం మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సీఎం కేసీఆర్‌ను ఆదివారం కలిశారు. ఈ సదర్భంగా కూడా జిల్లా నేతలు నల్లగొండకు ఆహ్వానించారని పార్టీ వర్గాల సమాచారం. కేసీఆర్‌ నల్లగొండ లోక్‌సభా స్థానం నుంచి పోటీ చేయడం వల్ల పార్టీకి బహుళ ప్రయోజనాలు ఉంటాయని అధికార పార్టీ నేతలు పాల్గొంటున్నారు.

ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు
గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో అయిదు చోట్ల విజయం సాధించింది. అయితే, సూర్యాపేట మినహా మిగిలిన నాలుగు అసెంబ్లీ  నియోజకవర్గాలు భువనగిరి లోక్‌సభా స్థానం పరిధిలోనివే కావడం గమనార్హం. నల్లగొండ లోక్‌సభ సీటు పరిధిని నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జుసాగర్, హుజూర్‌నగర్, కోదాడల్లో కాంగ్రెస్‌ విజయం సాధించగా, దేవరకొండలో కాంగ్రెస్‌ పొత్తుతో సీపీఐ బయట పడింది. సూర్యాటపేలో మాత్రం టీఆర్‌ఎస్‌ గెలిచింది. ప్రధానంగా ఈ నల్లగొండ పార్లమెంటు స్థానం పరిధిలో కాంగ్రెస్‌ నుంచి కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పీసీపీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోనే ఉన్నారు.

ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే నల్లగొండలో కాంగ్రెస్‌ను పూర్తిగా దెబ్బకొట్టేందుకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం కొత్త ఎత్తు వేస్తోందంటున్నారు. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్‌ నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే వ్యూహం రచించారని అంటున్నారు. దీనివల్ల నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం తేలికవుతుందని పార్టీ నేతలు నమ్ముతున్నారు. కేవలం ఏడు సెగ్మెంట్లలో మాత్రమే కాకుండా సీఎం కేసీఆర్‌ పోటీస్తే ఆప్రభావం నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంటుందని వీరు విశ్లేషిస్తున్నారు. పార్టీ కేడర్‌లో ఊపు తెచ్చేందుకు ఆయా సందర్భాల్లో కేసీఆర్‌ ఆయా నియోజకవర్గాలను మార్చి మార్చి పోటీ చేసి ఫలితాలు రాబట్టారు.

 ఆయన గతంలో కరీంనగర్, మహబూబ్‌నగర్, గత సార్వత్రిక ఎన్నికల్లో మెదక్‌ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన విషయం విదితమే. ఈ మారు నల్లగొండ ఎంపీ సీటు నుంచి అదే తరహాలో పోటీ చేయడానికి కేసీఆర్‌  సూత్రప్రాయంగా అంగీకరించారని చెబుతున్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో ఆయనను కలిసిన జిల్లా నేతలు మరో మారు ఆయనను ఆహ్వానించారని అంటున్నారు. కాంగ్రెస్‌ ముఖ్యనేతలున్న జిల్లాలో గురిచూసి దెబ్బకోట్టేందుకు ఇదే సరైన ఉపాయమన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు మరి కొద్ది నెలలే మిగిలి ఉన్నందున పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పర్యటించి వెళ్లగా, మంగళవారం కోదాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మొత్తానికి అధికార పార్టీ కేడర్‌లో జోష్‌ నింపే పనిలో నాయకత్వం ఉన్నట్లు విదితమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement