వరంగల్‌కు అరూరి రమేశ్ ఓకే
ఖమ్మం... బీఆర్‌ఎస్ ఎంపీ ఆసక్తి... ఆయన కాదంటే జలగం పేరు పరిశీలనలో..
నల్లగొండ ఎంపీ అభ్యర్థి మార్పుపై కూడా చర్చ...
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా శనివారం వెలువడే అవకాశాలున్నాయి. ఢిల్లీలో శుక్రవారం జరగాల్సిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం మరుసటి రోజుకు వాయిదా పడినట్టు సమాచారం. తెలంగాణ విషయాని కొస్తే..వరంగల్, ఖమ్మం ఎంపీ సెగ్మెంట్లకు బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. బీఆర్‌ఎస్ నుంచి ఇటీవల బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు వరంగల్ ఖరారు కాగా, ఇక అది ప్రకటించడమే తరువాయి అని సమాచారం.
ఖమ్మం నుంచి ఎవరిని బరిలో దింపాలనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మాజీ సీఎం జలగం వెంగళరావు తనయుడు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పేరును పరిశీలనలోకి తీసుకున్నా... పోటీకి ఓ బీఆర్‌ఎస్ ఎంపీ ఆసక్తి కనబరుస్తుండడంతో ఆయనకే ఈ సీటు దక్కే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి ఖరారైన నల్లగొండ ఎంపీ సీటుతో పాటు ఒకట్రెండు స్థానాల్లో అభ్యర్థుల మార్పు జరగొచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఒకరు పోటీ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తుండడంతో, ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థి కంటే సదరునేత మెరుగైన వాడిగా భావిస్తే నల్లగొండ అభ్యర్థి మార్పు కూడా ఉంటుందంటున్నారు. తుది జాబితా ప్రకటన ఒకరోజు వాయిదా పడడంతో ఎన్నికల వ్యూహాల ఖరారుకు శనివారం నిర్వహించాల్సిన సమావేశం ఆదివా రానికి వాయిదా పడినట్టు తెలిసింది. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
వికేంద్రీకరణ వ్యూహం...
బీజేపీ అగ్రనేత అమిత్‌షా ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెరుగైన ఫలితాల సాధనకు వికేంద్రీకరణ వ్యూహం పార్టీ అమలు చేస్తోంది. ఇక్కడా పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇటీవల ఎల్‌బీ స్టేడియంలో దాదాపు 30వేల మంది పోలింగ్‌బూత్ కమిటీల అధ్యక్షులు, ఆపై మండల, జిల్లాస్థాయి అధ్యక్షులతో అమిత్‌షా సమావేశమైన సందర్భంగా పలు సూచనలు చేశారు. ఇందుకు అనుగుణంగా పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా ఎన్నికల కార్యకలా పాలపై పార్టీ ప్రత్యేకదృష్టి కేంద్రీకరిస్తోంది. ఒక్కో పోలింగ్‌బూత్ పరిధిలో దాదాపుగా 24 పనులు క్రమం తప్పకుండా చేయాలని అమిత్‌షా ఆదేశించినట్టు తెలిసింది.
ప్రధాన పార్టీల కంటే ముందుగానే
లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మిగతా పార్టీలకన్నా బీజేపీనే ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఓ విడత ముందస్తు ప్రచారం పూర్తిచేయడం దీనినే సూచిస్తోంది. తెలంగాణలో నాలుగో విడత పోలింగ్ మే 13న ఉన్నందున, ఆ దశ ఎన్నికలప్పుడు మోదీ, అమిత్‌షా, నడ్డా, ఇతర ముఖ్యనేతల విస్తృత ప్రచారం నిమిత్తం రాష్ట్రానికి వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment