రాంనగర్ : నవంబర్ 1వ తేదీ నుంచి ఆహారభద్రత కార్డులు జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, ఐకేపీ, వీఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ 1 నుంచి తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయాలని నిర్ణయించినందున ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రతి గ్రామానికి ఒక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఒక రిజిష్టరులో నమోదు చేసి 16వ తేదీలోగా తహసీల్దార్లకు అందజేయాలని సూచించారు. అదే విధంగా పింఛన్ల కోసం నేటి(గురువారం) నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను సేకరించాలన్నారు. 16నుంచి 30వ తేదీ వరకు రెవెన్యూ అధికారులు ఈ దరఖాస్తులను సమగ్ర కుటుంబ సర్వేతో సరి చూసుకుని ఇంటింటికి వెళ్లి తనిఖీ చేయాలన్నారు.
అర్హులైన వారికి నవంబరు 1వ తేదీ నుండి కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయాలని సూచించారు. అదే విధంగా పింఛన్ దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తూ ప్రత్యేకంగా లేఖలు ఇవ్వాలని పేర్కొన్నారు. అవకతవకలు జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అధికారుల పనితీరును పర్యవేక్షించేందుకు డివిజన్‌స్థాయిలో ఫ్లైయింగ్ స్వ్కాడ్‌ను నియమిస్తామని చెప్పారు. ఫాస్ట్ పథకం కింద లబ్ధిపొందేందుకు కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో గురువారం నుంచి 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. తహసీల్దార్లు అట్టి దరఖాస్తులను పరిశీలించి ఈ నెలాఖరులోగా సర్టిఫికెట్‌లను జారీ చేయాలని కోరారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పని చేసి సామాజిక, ఆర్థిక, కుల గణనను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం కులగణన తుది నివేదిక రూపొందించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ ప్రీతి మీనా, ఏజేసీ వెంకట్రావు, డీఆర్‌డీఏ పీడీ సుధాకర్, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, సీపీఓ నాగేశ్వరరావు, ఎల్‌డీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ 1నుంచి ఆహారభద్రత కార్డుల జారీ
Published Thu, Oct 9 2014 2:03 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement