పాలమూరు పరిశీలనకు సీఎం రాక | Telangana CM KCR Visits Mahabubnagar District | Sakshi
Sakshi News home page

పాలమూరు పరిశీలనకు సీఎం రాక

Published Thu, Aug 29 2019 8:47 AM | Last Updated on Thu, Aug 29 2019 9:05 AM

Telangana CM KCR Visits Mahabubnagar District - Sakshi

కరివెన రిజర్వాయర్‌ 13వ ప్యాకేజీ వద్ద హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్, ఎస్పీ రెమా రాజేశ్వరి, ఎమ్మెల్యే ఆల

సాక్షి,మహబూబ్‌నగర్‌: ఎట్టకేలకు.. సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటన ఖరారైంది. ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథక పనులను పరుగులు పెట్టించడంతో పాటు ఇతర ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఇన్నాళ్లూ కాళేశ్వరం ప్రాజెక్టుపై దృష్టిసారించిన సీఎం.. అది పూర్తవడంతో ఇప్పుడు తన దృష్టంతా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాజెక్టు రాష్ట్ర, జిల్లా అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించిన కేసీఆర్‌ పనుల పురోగతిని పరిశీలించేందుకు జిల్లాలో పర్యటించనున్నారు.

సాగుకు నీరులేక కరువుతో అల్లాడిన పాలమూరును పచ్చబర్చాలనే లక్ష్యంతో నేడు ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ప్రాజెక్టు బాట పడుతున్నారు. ఉదయం 9.40గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సుమారు 8 గంటల పాటు సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. సర్కిల్‌–1 పరిధిలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల వద్ద పనులను ఆయన పర్యవేక్షిస్తారు. ప్రాజెక్టు పరిధిలో ప్యాకేజీల వారీగా పనుల పురోగతి.. అడ్డంకులు.. సమస్యలను తెలుసుకునేందుకు ఆయన రోజంతా ఉమ్మడి జిల్లాలో గడపనున్నారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలోని పది లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 

ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రుణంతో జీవం  
నిధులు లేక పడకేసిన ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు ఇటీవల పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన రూ.10వేల కోట్ల రుణం జీవం పోసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాల్లో 12.30లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం 2015 జూన్‌లో ప్రతిష్టాత్మకంగా రూ.35,200 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ వద్ద కరివెనా రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. తర్వాత కాంట్రాక్టర్లతో ఒప్పందం కోసం పది నెలల సమయం పట్టింది. చివరకు 2016 మే నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో 2018 ఆఖరులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రాజెక్టు పనులు వేగంగా చేసేందుకు సరిపడా నిధులు లేకపోవడంతో పనుల్లో వేగం తగ్గింది. పనుల పురోగతికి సంబంధించిన నిధులు.. నిర్వాసితులకు పరిహారం పంపిణీలో జాప్యం కావడంతో పనులు ముందుకు సాగలేదు.

తాజాగా పవర్‌ కార్పొరేషన్‌ మంజూరు చేసిన రూ.10వేల కోట్లతో పనులు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ల పనులు 30 శాతం నుంచి 90శాతం వరకు పూర్తయ్యాయి.కాల్వల విషయానికొస్తే నార్లాపూర్‌ నుంచి ఏదుల వరకు 8.375 కిలో మీటర్ల కాల్వను 2,3 ప్యాకేజీలుగా విభజించి ఇప్పటి వరకు 50శాతం పనులు పూర్తి చేశారు. ఏదుల నుంచి వట్టెం వరకు 6.4 కిలో మీటర్ల కాల్వలను 6,7ప్యాకేజీలుగా విభజించి 81శాతం పనులు పూర్తి చేశారు. ఇక వట్టెం నుంచి కరివెన వరకు 12కిలో మీటర్ల కాల్వలను 12వ ప్యాకేజీగా విభజించి 72శాతం కాలువ పనులను పూర్తి చేశారు.

రెండు హెలిక్యాప్టర్లు.. పది హెలీప్యాడ్లు 
సీఎం కేసీఆర్‌ పర్యటన అంతా రెండు హెలిక్యాప్టర్లలో జరగనుంది. ఓ హెలీక్యాప్టర్‌లో సీఎం కేసీఆర్‌.. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు మరో హెలీక్యాప్టర్‌లో సీఎం కార్యదర్శితో పాటు ఈఎన్‌సీ మురళీ, పాలమూరు– రంగారెడ్డి సీఈ రమేశ్, ఇతర ఉన్నతాధికారులు ఉంటారు. దీంతో అధికారులు సీఎం పర్యటించనున్న భూత్పూర్‌ మండలం బట్టుపల్లి (కరివెన), బిజినేపల్లి మండలం వట్టెం, గోపాల్‌పేట మండలం ఏదుల వద్ద రెండు చొప్పున హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. కాగా నార్లాపూర్‌ వద్ద రిజర్వాయర్‌ నిర్మాణ ప్రాంతంలో, టన్నెల్‌ పనుల వద్ద రెండు చొప్పున నాలుగు హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో జిల్లా ఎస్పీలు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
 

ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపైనా..  
పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టుల పురోగతి పైనా సీఎం కేసీఆర్‌ ఆరా తీయనున్నారు. ఈ మేరకు వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుల వద్ద క్యాంప్‌ కార్యాలయంలో మధ్యాహ్నం 2గంటల నుంచి 5:30గంటల వరకు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటి వరకు విడుదలైన నిధులు.. అయిన ఖర్చు, బిల్లుల పెండింగ్‌ అంశాలను సమీక్షలో చర్చకొచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల అధికారులందరూ సమగ్ర నివేదికలు సిద్ధం చేసుకున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ ఇలా..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరుతారు.

  • 9:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం  నుంచి హెలికాప్టర్‌లో  బయలుదేరుతారు. 
  • 9:40 గంటలకు మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం బట్టుపల్లి వద్ద కొనసాగుతున్న  కరివెన రిజర్వాయర్‌కు చేరుకుంటారు. 
  • 10:15 గంటలకు కరివెన రిజర్వాయర్‌ నుంచి బయల్దేరుతారు.  
  • 10:40 గంటలకు నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వద్ద కొనసాగుతున్న  వట్టెం రిజర్వాయర్‌కుచేరుకుంటారు. 
  • 11:00 గంటలకు వట్టెం నుంచి బయల్దేరుతారు.
  • 11:20 నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లపూర్‌ రిజర్వాయర్‌కు చేరుకుంటారు. 
  • 11:50 నార్లపూర్‌ నుంచి బయల్దేరుతారు.  
  • 12:10గంటలకు వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుల రిజర్వాయర్‌కు చేరుకుంటారు.  అక్కడే భోజనం చేస్తారు. అనంతరం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టు పురోగతిపై జిల్లా మంత్రులు, సంబంధిత రాష్ట్ర, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 
  •  సాయంత్రం 5:30 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement