పొన్నాల మెడపై రాజీనామా కత్తి
టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలంటూ సీనియర్ల ఒత్తిళ్లు
నేడు ఢిల్లీకి పొన్నాల పయనం
ఎన్నికల్లో ఓటమిపై అధిష్టానానికి నివేదిక
హైదరాబాద్: ‘ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. ఇదే మాటకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నా.’- తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలివి.
‘ఓటమికి బాధ్యత వహిస్తానని చెబుతున్న పొన్నాల ఇంకా టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఎలా కొనసాగుతారు? వెంటనే రాజీనామా చేయాలి. లేకుంటే రాజకీయాల్లో ‘నైతిక బాధ్యత’ అనే పదానికి అర్ధమే ఉండదు ’ - తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల వ్యాఖ్యలు.
పొన్నాల ఢిల్లీ పర్యటన తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. పొన్నాల రాజీనామాపై ఓవైపు సీనియర్ల నుంచి ఒత్తిళ్లు రావడం, వురోవైపు ఆయన తీరుపై అధిష్టానం గుర్రుగా ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో ఓటమిపై నివేదికతో పొన్నాల బుధవారం ఢిల్లీ పయునవువుతున్నారు.
పొన్నాల తక్షణమే టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. మాజీ మంత్రులు జానారెడ్డి, దానం నాగేం దర్, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కీ, రాజయ్య, పొన్నం ప్రభాకర్‌తోపాటు మెజారిటీ నాయకులు, కార్యకర్తలు పొన్నాల తప్పుకుంటేనే మేలనే భావనను వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ 30 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలైన పొన్నాల లక్ష్మయ్య ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఆ పదవిలో కొనసాగుతారంటూ నేరుగానే ప్రశ్నలు సంధిస్తున్నారు.
దేశంలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ సోనియా, రాహుల్ రాజీనావూకు సిద్ధపడ్డ విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు హైకమాండ్ పెద్దలను కలసి ఆయనను తప్పించాలని ఫిర్యాదు చేశారు. ఓటమిపై పొన్నాల అధిష్టానానికి నివేదిక సమర్పించను న్నారు.
సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా కాంగ్రెస్‌వల్లే తెలంగాణ వచ్చిందనే అంశాన్ని తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడిగా విఫలమయ్యారని, దీనికితోడు 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, దేశంలో ఏర్పడిన రాజకీయ కారణాలు ఓటమికి ప్రధాన కారణాలని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎన్నికల్లో ఓటమికి ఉమ్మడి బాధ్యత వహిస్తున్నామంటూ ఈనెల 20న గాంధీభవన్‌లో టీపీసీసీ నేతలు చేసిన తీర్మానం ప్రతిని కూడా జతచేయనున్నట్టు సమాచారం.