తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక నిర్ణయాలు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీ పీసీసీ ముఖ్యనేతలు మంగళవారం నగరంలోని గోల్కొండ హోటల్‌లో భేటీ అయ్యారు. అనంతరం టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల గవర్నర్, ముఖ్యమంత్రులు..ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చి రాజకీయాలు దిగజార్చారని మండిపడ్డారు. ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలవడంతో పాటు, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని అన్నారు.
కేసీఆర్ నియంతృత్వ పాలనకు నిరసనగా కలిసివచ్చే ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని ఐక్య పోరాటం చేస్తామని ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. రెండు లక్షల కోట్ల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, వేలకోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. అవినీతి వాస్తవాలను బయటపెట్టి కేసీఆర్ సర్కార్‌ను ఎండగడతామన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మ తగలబెడితే కూడా పోలీసులు సీరియస్ కేసులు పెడుతున్నారని, కేసులకు, జైళ్లకు తాము భయపడేది లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. అవసరం అయితే జైల్‌భరో కార్యక్రమానికి పిలుపునిస్తామన్నారు.
అలాగే పార్టీ తరపున బరిలోకి దిగే అసెంబ్లీ అభ్యర్థులను ముందే ఖరారు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. విభజన చట్టంలోని హామీలను పూర్తి చేసిన తర్వాతే డీలిమిటేషన్‌ను చేపట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ భారం కాబోతుందని, ఒక ఎకరా సాగునీటికి లక్ష రూపాయిలు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.