కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
సాక్షి, రంగారెడ్డి: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న విధానాల వల్లే దేశంలో ఆర్థిక మాద్యం తలెత్తిందని చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం లక్డీకపూల్‌లోని కలెక్టరేట్‌ని ముట్టడించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా తీరు, తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాకముందు ఊదరకొట్టిన ‘బ్లాక్‌మనీ వెలికతీత’ ఏమైందని ప్రశ్నించారు. జీఎస్టీని అసంబద్ధంగా అమలు చేసి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు పరిపాలించడం ఏమాత్రం చేతకాదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం నియంతలా వ్యవరిస్తున్నారని ధ్వజమెత్తారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. హడావుడిగా పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం.. ఆ తర్వాత నిధులు విడుదల చేయడాన్ని విస్మరించారని విమర్శించారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని అన్నారు.
ఏ పథకమూ సక్రమంగా కొనసాగడం లేదన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నిధులు లేకపోవడం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందనడానికి నిదర్శమన్నారు. సీఎం కేసీఆర్ పతనం జిల్లా నుంచే మొదలవుతుందని ఆయన జోస్యం చెప్పారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారిణి ఉషారాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శులు అమరేందర్ రెడ్డి, జానకిరాం, శివకుమార్, ఉదయ్‌మోహన్‌రెడ్డి, బాబర్‌ఖాన్, అధికార ప్రతినిధి సిద్దేశ్వర్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు వినోద్, దేపభాస్కర్‌రెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు రియాజ్, శంకర్, సంజయ్ యాదవ్, గోపాల్ రెడ్డి, ఖలీద్, చిగురింత నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment