దిగ్విజయ్‌పై మండిపడ్డ తెలంగాణ డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులే ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారని, ఐఎస్‌ఐఎస్ పేరిట నకిలీ వెబ్‌సైట్ ఏర్పాటుచేసి దాని ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్‌మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ సోమవారం ట్విట్టర్‌లో ఆరోపణలు చేయడం దుమారం రేపింది. ఈ పోస్టుపై ఐటీ మంత్రి కేటీఆర్, రాష్ట్ర డీజీపీ తీవ్రంగా స్పందించారు.
ఎటువంటి ఆధారాల్లేకుండా ఒక సీనియర్ నేత ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధకరమైందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై ఆయన తన అధికారిక ట్విట్టర్ పేజీలో ఈ మేరకు స్పందించారు. దేశ భద్రత కోసం పనిచేస్తున్న పోలీస్ శాఖపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పోలీస్ ఇమేజ్‌ను దెబ్బతీయడమేనని తెలంగాణ పోలీస్‌శాఖ కూడా ట్వీట్ చేసింది.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఆధారాల్లేని ఆరోపణలు చేయడం సరైంది కాదని, వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర శాంతి భద్రతల వ్యవహారాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉగ్రవాదులను సైతం పట్టించిన తెలంగాణ పోలీసులు అర్దరహితమైన వ్యాఖ్యలు చేయడం పద్దతి కాదని కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.