నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా
- టీ-పోలీసులు ఐసిస్ పేరిట ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారన్న ట్వీట్‌పై దిగ్విజయ్
- పోలీసులు ఎలా రెచ్చగొడుతున్నారో నా వద్ద ఆధారాలున్నాయి
- ఎవరెన్ని కేసులు పెట్టుకున్నా అభ్యంతరం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పోలీసులు ఐసిస్ నకిలీ వెబ్‌సైట్లతో ముస్లిం యువతను రెచ్చ గొడుతున్నారంటూ ట్వీటర్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ స్పందించారు. మంగళవారం ఢిల్లీలో దిగ్విజయ్ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాన న్నారు. తెలంగాణ పోలీసులు యువతను ఎలా రెచ్చగొడుతున్నారో తన వద్ద ఆధా రాలు ఉన్నాయని దిగ్విజయ్ తెలిపారు. ఈ అంశంపై చాలా మందితో మాట్లాడి అధ్యయ నం చేసి ఆధారాలు సేకరించానన్నారు. ముస్లిం యువతను ట్రాప్ చేయడం నైతి కంగా ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఈ విషయంపై ఎవరెన్ని కేసులు పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని, న్యాయపరంగా పోరాడతానన్నారు.
మధ్యప్రదేశ్‌లోని షాజా పూర్ జిల్లాలో బాంబు పేలుళ్లు, కాన్పూర్‌లో సైఫుల్లా ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పోలీసుల కు ముందే సమాచారం ఉందని...దీనిని తెలంగాణ పోలీసులే అంగీకరించారన్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన ఫొటోలు తెలంగాణ పోలీసుల వద్ద ఉండటమే అందుకు నిదర్శనమని దిగ్విజయ్ పేర్కొన్నారు. తెలంగాణ పోలీసుల వ్యూహం ఏదైనా కావచ్చుగానీ నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి ఐసిస్ వైపు ఆకర్షితులయ్యే ముస్లిం యువతను గుర్తించే విధానం సరికాదని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ఐసిస్‌వైపు యువతను రెచ్చగొట్టడం వల్ల వారు ఇంకా ఎక్కువగా ఆకర్షితులవుతారన్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన కౌంటర్ టెర్రరిజం సమావేశాల్లో పాల్గొన్న యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులంతా కూడా ఈ విధానాన్ని వ్యతిరేకించారని దిగ్విజయ్ చెప్పారు.