డిగ్గీరాజా.. ట్వీట్ గుట్టు
- వాస్తవమా..? అయోమయం సృష్టించేందుకా?
- ముస్లిం రిజర్వేషన్ల క్రెడిట్ టీఆర్‌ఎస్‌కు దక్కకుండా చేసేందుకా?
- దక్షిణాదిన తెలంగాణపై కాంగ్రెస్ కన్నేసిందా?
- మైనారిటీలను తమ వైపు తిప్పుకునేందుకేనా?
- రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు
- ఇది ఆషామాషీ వ్యవహారం కాదు.. అసలు కథ ముందుందన్న దిగ్విజయ్
- డిగ్గీపై మండిపడుతున్న టీఆర్‌ఎస్.. చర్యలు తీసుకోవాలన్న బీజేపీ
- ముస్లింలను ఆకర్షించడానికి ఉపయోగపడుతుందంటున్న కాంగ్రెస్ సీనియర్లు
దిగ్విజయ్ వివాదాస్పద వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి?
సాక్షి, హైదరాబాద్: ఐసిస్ పేరిట నకిలీ వెబ్‌సైట్ ప్రారంభించి తెలంగాణ పోలీసులు ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. దిగ్విజయ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందా..? లేదా అయోమయం సృష్టించడానికి ఇలాంటి ట్వీట్ చేశారా..? అని వివిధ పార్టీల నేతలు అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నేతలు కొందరు నేరుగా దిగ్విజయ్‌కే ఫోన్ చేసి ఆరా తీశారు. తమకు తెలిసిన పోలీసు ఉన్నతాధికారులను వాకబు చేశారు.
మరోవైపు దిగ్విజయ్ ట్వీట్‌లో నిజానిజాలు పక్కన పెడితే ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని రాజకీయ పార్టీలు ఆచితూచీ వ్యవహరిస్తున్నాయి. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేసిన దిగ్విజయ్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేయగా.. బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారంటూ అధికార టీఆర్‌ఎస్ మండిపడింది. ఇక దిగ్విజయ్ ట్వీట్ వెనుక వ్యూహమేంటో తెలియక రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవరూ మంగళవారం మీడియా ముందుకు కూడా రాలేదు.
అసలు కథ ముందుంది..
ట్వీట్ వెనుక వాస్తవాలు తెలుసుకునేందుకు పార్టీ ముఖ్య నేత ఒకరు దిగ్విజయ్‌సింగ్‌తో సోమవారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. అయితే తాను చేసిన ట్వీట్ ఆషామాషీ వ్యవహారం కాదన్నారే తప్ప దాని గురించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఐసిస్ పేరిట ప్రారంభించిన నకిలీ వెబ్‌సైట్‌కు సంబంధించి మున్ముందు అసలు కథ ఉంటుందని, జరగబోయే పరిణామాలను జాగ్రత్తగా గమనించాలని దిగ్విజయ్ ఆ నేతకు సూచించారు. మరికొందరు నేతలు మాట్లాడినా.. ఆయన దీనిపై పూర్తి వివరాలు తెలియజేయడానికి నిరాకరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సూచించినట్లు చెబుతున్నారు.
ఐసిస్ పేరిట పోలీసులు వెబ్‌సైట్ నడుపుతున్నారా లేదా అన్నది పక్కనపెడితే ముస్లిం వర్గం వారికి పార్టీ దగ్గరయ్యేందుకు ఇది దోహదపడుతుందని ఓ సీనియర్ నేత విశ్లేషించారు. 12 శాతం రిజర్వేషన్లు అంటూ టీఆర్‌ఎస్ ముస్లింలను ఆకట్టుకుంటోందని, ఈ నేపథ్యంలో పోలీసులు ఇలా అమాయక ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారన్నది ప్రచారంలో పెడితే కాంగ్రెస్‌కు ఎంతో కొంత ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. అయితే కొన్నిసార్లు ఇది బెడిసి కొట్టే ప్రమాదం కూడా లేకపోలేదని ఆ నేత వ్యాఖ్యానించారు.
రాష్ట్రంపై హస్తం కన్ను..!
ఇటీవల దక్షిణాదిన కర్ణాటక, ఏపీ, తెలంగాణలో పార్టీ పరిస్థితిపై కాంగ్రెస్ ఓ ప్రైవేట్ కంపెనీతో సర్వే చేయించుకుంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈసారి గెలుపు అవకాశాలు ఏమాత్రం లేవని, ఏపీలో పరిస్థితి గడచిన ఎన్నికలతో పోలిస్తే మరింతగా దిగజారిందని ఆ సర్వేలో తేలింది. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తో పోలిస్తే ఓట్ల పరంగా భారీ తేడా కనిపించినా రెండోస్థానంలో 36 శాతం ఓట్లు కలిగి ఉన్నట్లు ఆ సర్వే తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 52 శాతం ఓట్లు లభిస్తాయని ఆ సర్వే వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ సర్వేలో ముస్లింలు కేవలం 2 శాతం మాత్రమే కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. ఎన్నికలకు ఏడాదిన్నర వ్యవధి మిగిలిన ఉన్న తరుణంలో ముస్లిం వర్గాలను టీఆర్‌ఎస్‌కు దూరం చేసేందుకు దిగ్విజయ్ ఈ పాచిక వేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దిగ్విజయ్ ఆరోపించినట్లు పోలీసులు ఐసిస్ పేరిట ఓ వెబ్‌సైట్ పెట్టి ముస్లిం యువతను రెచ్చగొట్టినా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వదిలేస్తున్నారని, ఒక విధంగా అది మంచిదేనని, వారు పక్కదారులు పట్టకుండా ఉంటుందని కాంగ్రెస్ నేతలే ప్రైవేట్ సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
ట్వీట్ వెనుక పోలీస్ కోల్డ్‌వార్
దిగ్విజయ్ ట్వీట్ వెనుక పోలీస్ కోల్డ్‌వార్ ఉం దా? అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు! గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఉగ్ర నెట్‌వర్క్ ఉన్నా.. దాన్ని ట్రాక్ చేయడం, పేలు ళ్ల పథక రచనను నిరోధించి బ్రేక్ చేయడం కేవలం తెలంగాణ పోలీస్‌కు మాత్రమే సాధ్య మైంది. ఈ రకంగా దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అనేక మంది కీలక ఉగ్ర వాదులను తెలంగాణ పోలీస్ విభాగం పట్టిం చింది. అక్కడి స్థానిక నిఘా బృందాలకు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు సైతం దొరకని ఉగ్రవాదులని రాష్ట్ర పోలీసులు పక్కాగా ఆప రేషన్ నిర్వహించి కటకటాల్లోకి నెట్టారు.
పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ తెలంగాణ పోలీ సులు ఇలాగే వ్యవహరించారు. అయితే తమ రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసులు ఇలా దూకు డుగా వ్యవహరించడం ఆయా రాష్ట్రాలకు రుచించలేదు. దీంతో ఆ రాష్ట్రాల పోలీసులకు, తెలంగాణ పోలీసులకు మధ్య కోల్డ్‌వార్ మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రా ల్లోని పోలీస్ అధికారులు.. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ దృష్టికి తెచ్చారని, దాన్ని ఆధా రంగా చేసుకొని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
నకిలీ వెబ్‌సైట్ చూపించాలి: రాష్ట్ర పోలీసులు
దిగ్విజయ్ సింగ్ ఆరోపిస్తున్నట్టు నకిలీ వెబ్‌సైట్ ఉంటే చూపించాలని, పక్కా ఆధారాలతో రావాలని రాష్ట్ర పోలీస్ విభాగం సవాల్ విసిరింది. అవాస్తవాలతో తమ మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం సరి కాదని వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల్లో తమ బృందాలు ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదిస్తూ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఇతర రాష్ట్ర పోలీసుల్లో ఉన్న అసహనం దిగ్విజయ్ ట్వీట్ల ద్వారా బయటపడిందన్నారు.
కేంద్ర హోంశాఖ, ఎన్‌ఐఏ, కేంద్ర ఇంటెలిజెన్స్.. విభాగాలు కూడా ఈ అంశంపై ఆరా తీశాయని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. నకిలీ వెబ్‌సైట్ ఏర్పాటు చేసి నెట్‌వర్క్ సాగించడం అంత సులభం కాదని, తాము చేసే ఆపరేషన్స్‌ను ఎన్‌ఐఏ, కేంద్ర హోంశాఖ, కేంద్ర ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాయని, ఆ విభాగాలను కాదని తాము ముందుకెళ్లే ప్రసక్తి ఉండదని ఆయన స్పష్టంచేశారు.
క్షమాపణ చెప్పకుంటే చట్టపరమైన చర్యలు: నాయిని
తెలంగాణ పోలీసులపై వివా దాస్పద వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ బహిరంగ క్షమా పణ చెప్పాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. అట్టర్ ప్లాఫ్ పార్టీకి ఇన్ చార్జిగా ఉన్న దిగ్విజయ్.. రాష్ట్ర పోలీస్‌ల కు క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 2014లో కాంగ్రెస్ తమతో పొత్తుకు యత్నించిందని, అయితే దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ వల్లే తాము పొత్తుకు నిరాకరించామని పేర్కొన్నారు. తెలం గాణ పోలీసులు దేశంలోనే సమర్థవం తంగా పనిచేస్తున్నారని కొనియాడారు.