19న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ | Telangana EAMCET 2020 Notification On February 19 | Sakshi
Sakshi News home page

19న ఎంసెట్‌ నోటిఫికేషన్‌

Published Sun, Feb 16 2020 3:33 AM | Last Updated on Sun, Feb 16 2020 5:05 AM

Telangana EAMCET 2020 Notification On February 19 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్‌–2020 నోటిఫికేషన్‌ను ఈనెల 19న జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి మార్చి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్ష తన జరిగిన ఎంసెట్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ.. 20 జోనల్‌ కేంద్రాల పరిధిలోని 55 ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 105 కేంద్రాల్లో ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. ఇందులో రాష్ట్రంలో 16 జోనల్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల కోసం కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోనూ జోనల్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌కు ఒక్కో దానికి రూ.800 పరీక్ష ఫీజుగా నిర్ణయించామని, ఎస్సీ, ఎస్టీలతోపాటు వికలాంగులకు ఫీజు సగానికి (రూ.400) తగ్గించినట్లు వెల్లడించారు. రెండింటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు రూ.1,600 (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే రూ. 800) ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మే 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్‌ ఎంసెట్, 9, 11 తేదీల్లో అగ్రికల్చర్‌ ఎంసెట్‌ పరీక్ష ఉంటుందని, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, ఈ నిబంధనను యథావిధిగా అమలు చేస్తామన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉండేలా ఈసారి టెస్ట్‌ సెంటర్లను రీఆర్గనైజ్‌ చేశామని ఎంసెట్‌ కన్వీనర్, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ వెల్లడించారు.}

ప్రభుత్వం ఆమోదిస్తే ఈడబ్ల్యూఎస్‌... 
రాష్ట్రంలో ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) కోటా అమలుకు సంబంధించి అం«శం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఈసారి ప్రవేశాల్లో అమలు చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కాలేదన్నారు. తాము మాత్రం ముందస్తుగా దాని అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాకు సంబంధించిన ప్రత్యేక కాలమ్‌ను విద్యార్థులు చేసుకునే దరఖాస్తులో పొందుపరుస్తున్నట్లు కన్వీనర్‌ వెల్లడించారు.

ప్రభుత్వం జీవో మార్చితేనే కెమిస్ట్రీ మినహాయింపు అమలు.. 
ఇంజనీరింగ్‌లో చేరేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ మాత్రమే కాకుండా ఇతర సబ్జెక్టులు చదివిన వారికి అవకాశం ఇవ్వాలని, కెమిస్ట్రీ తప్పనిసరి కాదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పేర్కొన్న అంశంపై ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి వివరణ ఇచ్చారు. ఏఐసీటీఈ ఆ నిబంధనను తీసుకువచ్చినా తాము రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ఎంసెట్‌ నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు చేపడుతున్నామన్నారు. ఏఐసీటీఈ చేసిన మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను మార్చితే అమలు చేస్తామన్నారు. 

ఇదీ ఎంసెట్‌–2020 షెడ్యూలు.. 

19–ఫిబ్రవరి : ఎంసెట్‌ నోటిఫికేషన్‌ 
21–ఫిబ్రవరి నుంచి 30–మార్చి వరకు : ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 
31– మార్చి నుంచి 3–ఏప్రిల్‌ వరకు: ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేసిన దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం 
6–ఏప్రిల్‌ వరకు: రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం 
13–ఏప్రిల్‌ వరకు: రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 
20–ఏప్రిల్‌ వరకు: రూ. 5 వేల ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చాన్స్‌ 
17–ఏప్రిల్‌: హాల్‌టికెట్ల జనరేషన్‌ 
27–ఏప్రిల్‌ వరకు..: రూ. 10 వేల ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సబ్మిషన్‌ 
20–ఏప్రిల్‌ నుంచి 1–మే వరకు: వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ 
4–మే, 5–మే, 7–మే: ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ 
9–మే, 11–మే: అగ్రికల్చర్‌ ఎంసెట్‌ 

    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement