Engeeneering college
-
Telangana: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాల్లో ఫీజులను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. అడ్మిషన్, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) సిఫార్సుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ తెలంగాణ సర్కార్ బుధవారం జీవో జారీ చేసింది. అదే విధంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస రుసుమును రూ.45వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ ఫీజు రూ. లక్ష దాటింది. ఎంజీఐటీ రూ.1.60లక్షలు, సీవీఆర్ రూ.1.50లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్, వాసవీ రూ.1.40లక్షలుగా నిర్ణయించింది. మూడేళ్లపాటు కొత్త ఇంజనీరింగ్ ఫీజులు అమల్లో ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఫీజులు సైతం ప్రభుత్వం పెంచింది. ఎంబీయే, ఎంసీయే కనీస వార్షిక ఫీజు రూ.27వేలుగా.. ఎంటెక్ కనీస వార్షిక రుసుము రూ.57వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది. చదవండి: మందుకొట్టి.. గొడ్డలి పట్టి కానిస్టేబుల్‌పై దాడి -
విద్యార్థులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి : కరోనా కష్ట కాలంలో విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ శుభవార్తను వినిపించారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.1800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించామన్నారు. అంతేకాకుండా 2019-20 సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యారంగానికి సంబంధించిన పలు కీలక విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లి ఖాతాలోకే ఫీజు రియింబర్స్‌మెంట్ మొత్తాన్ని చెల్లిస్తాం పేర్కొన్నారు. గతంలో ఇంజనీరింగ్ విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ప్రభుత్వం రూ.35వేలు మాత్రమే ఇచ్చేదని, మిగతా డబ్బును కాలేజీలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు ఇస్తోందని వివరించారు. తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి 191 కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, వాటిని సక్రమంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్ లిస్టులో పెడతామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. -
19న ఎంసెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్–2020 నోటిఫికేషన్‌ను ఈనెల 19న జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి మార్చి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్ష తన జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ.. 20 జోనల్ కేంద్రాల పరిధిలోని 55 ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 105 కేంద్రాల్లో ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. ఇందులో రాష్ట్రంలో 16 జోనల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోనూ జోనల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌కు ఒక్కో దానికి రూ.800 పరీక్ష ఫీజుగా నిర్ణయించామని, ఎస్సీ, ఎస్టీలతోపాటు వికలాంగులకు ఫీజు సగానికి (రూ.400) తగ్గించినట్లు వెల్లడించారు. రెండింటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు రూ.1,600 (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే రూ. 800) ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మే 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్, 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష ఉంటుందని, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో సెషన్లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, ఈ నిబంధనను యథావిధిగా అమలు చేస్తామన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉండేలా ఈసారి టెస్ట్ సెంటర్లను రీఆర్గనైజ్ చేశామని ఎంసెట్ కన్వీనర్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు.} ప్రభుత్వం ఆమోదిస్తే ఈడబ్ల్యూఎస్... రాష్ట్రంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా అమలుకు సంబంధించి అం«శం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఈసారి ప్రవేశాల్లో అమలు చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కాలేదన్నారు. తాము మాత్రం ముందస్తుగా దాని అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించిన ప్రత్యేక కాలమ్‌ను విద్యార్థులు చేసుకునే దరఖాస్తులో పొందుపరుస్తున్నట్లు కన్వీనర్ వెల్లడించారు. ప్రభుత్వం జీవో మార్చితేనే కెమిస్ట్రీ మినహాయింపు అమలు.. ఇంజనీరింగ్‌లో చేరేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ మాత్రమే కాకుండా ఇతర సబ్జెక్టులు చదివిన వారికి అవకాశం ఇవ్వాలని, కెమిస్ట్రీ తప్పనిసరి కాదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పేర్కొన్న అంశంపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వివరణ ఇచ్చారు. ఏఐసీటీఈ ఆ నిబంధనను తీసుకువచ్చినా తాము రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ఎంసెట్ నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపడుతున్నామన్నారు. ఏఐసీటీఈ చేసిన మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను మార్చితే అమలు చేస్తామన్నారు. ఇదీ ఎంసెట్–2020 షెడ్యూలు.. 19–ఫిబ్రవరి : ఎంసెట్ నోటిఫికేషన్ 21–ఫిబ్రవరి నుంచి 30–మార్చి వరకు : ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 31– మార్చి నుంచి 3–ఏప్రిల్ వరకు: ఆన్లైన్లో సబ్మిట్ చేసిన దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం 6–ఏప్రిల్ వరకు: రూ.500 ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం 13–ఏప్రిల్ వరకు: రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 20–ఏప్రిల్ వరకు: రూ. 5 వేల ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుకు చాన్స్ 17–ఏప్రిల్: హాల్‌టికెట్ల జనరేషన్ 27–ఏప్రిల్ వరకు..: రూ. 10 వేల ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుల సబ్మిషన్ 20–ఏప్రిల్ నుంచి 1–మే వరకు: వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ 4–మే, 5–మే, 7–మే: ఇంజనీరింగ్ ఎంసెట్ 9–మే, 11–మే: అగ్రికల్చర్ ఎంసెట్ -
ఆ కాలేజీలకు ‘ఈడబ్ల్యూఎస్’ షాక్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలపై ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా ప్రభావం పడనుంది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్ల పెరుగుదల సాధారణ కాలేజీలకు నష్టదాయకం కానుండగా, టాప్ కాలేజీలకు మేలు చేకూర్చనుంది. ప్రవేశాల్లో విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది టాప్ కాలేజీలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో ఈడబ్ల్యూఎస్ కోటాలో టాప్ కాలేజీల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యే అవకాశం ఉండగా, సాధారణ కాలేజీల్లో ఆ మేరకు ప్రవేశాల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం నెలకొంది. కౌన్సెలింగ్ కసరత్తు షురూ.. రాష్ట్రంలో 2020–21 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ఇప్పటికే ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు అంచనాల్లో పడ్డాయి. తమ కాలేజీలకు ఉన్న డిమాండ్ ప్రకారం తమకు ఎంత మేలు చేకూరుతుంది.. ఎవరికి నష్టం చేకూరుతుందన్న లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు యాజమాన్యాల వారీగా, కోర్సుల వారీగా 10 శాతం సీట్ల పెంపుతో ఎలా కౌన్సెలింగ్ నిర్వహించాలన్న కసరత్తును ప్రవేశాల క్యాంపు కార్యాలయం ప్రారంభించింది. ఆన్లైన్ ప్రోగ్రామింగ్ రూపకల్పనకు చర్యలు చేపట్టింది. 40 నుంచి 50 కాలేజీల్లోనే 100% ప్రవేశాలు రాష్ట్రంలో 205 ఇంజనీరింగ్ కాలేజీలుండగా, గతేడాది కన్వీనర్ కోటాలో 183 కాలేజీల్లోని 65,544 సీట్లలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వ హించారు. మరికొన్ని మైనారిటీ కాలేజీల్లో ఆయా యాజమాన్యాలే సొంత ప్రవేశాలను చేపట్టాయి. కన్వీనర్ కోటాలో చేపట్టిన ప్రవేశాల్లో 44 కాలేజీల్లోనే సీట్లు 100% భర్తీ అయ్యాయి. ఒక్క విద్యార్థి చేరని కాలేజీలు 3 ఉండగా, అన్ని బ్రాంచీల్లో కలిపి 10 లోపే ప్రవేశాలు వచ్చిన కాలేజీలు 90కి పైగా ఉన్నాయి. ఒక్కో కాలేజీలో 200 మందికి మించి విద్యార్థులు చేరిన మరికొన్ని కాలేజీల్లోనే 45 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. ఆయా కాలేజీల్లోనే 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 4,500కుపైగా సీట్లు పెరుగనున్నాయి. దీంతో విద్యార్థులు కూడా టాప్ కాలేజీల్లో పెరిగిన సీట్లలో చేరేందుకు ఆసక్తి చూపనున్నారు. 100 లోపే ప్రవేశాలు వచ్చిన 90కి పైగా కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% సీట్లు పెరిగినా పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. ఎంబీఏ, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఎడ్, ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ (ఈసెట్) వంటి ఇతర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లోనూ ఇదే ప్రభా వం ఉండనుంది. వాటిల్లోనూ టాప్ కాలేజీల్లో పెరిగే సీట్లలోనే విద్యార్థులు చేరేందుకు మొగ్గు చూపనున్నారు. ఇక ఎంబీఏను తీసుకుంటే గతే డాది 276 కాలేజీల్లో 22,434 సీట్లను భర్తీ చేశా రు. అయితే అందులో 184 కాలేజీల్లోనే 100% సీట్లు భర్తీ అయ్యాయి. మరో 92 కాలేజీల్లో 100% సీట్లు భర్తీ కాలేదు. అందులో తక్కువ అడ్మిషన్లున్న కాలేజీలు 65కు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ అడ్మిషన్లు ఉన్న కాలేజీలకు సీట్లు పెరిగినా పెద్దగా ప్రయోజనం లేకపోగా, ఎక్కువ డిమాండ్ ఉన్న కాలేజీల్లో పెరిగే సీట్లలో చేరేందుకే సాధారణ కాలేజీల్లో చేరాల్సిన విద్యార్థులే వెళ్లే అవకాశముంది. -
పైసామే అడ్మిషన్..!
సాక్షి , శాతవాహనయూనివర్సిటీ(కరీంగనర్): ఇంజనీరింగ్ ప్రవేశాల తీరును చూస్తే ఇంజినీరింగ్ విద్య ఇంతకు దిగజారిందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఏ మాత్రం నాణ్యత ప్రమాణాలు చూడని కొందరు తల్లిదండ్రులు, విద్యార్థుల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది. ఇంజినీరింగ్ కళాశాలలు ప్రవేశాల కోసం దిగజారుడుతనం ప్రదర్శించి ప్రవేశాలను ‘కొని’ తెచ్చుకుంటున్నాయని తీవ్రమైన ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్క అడ్మిషన్‌కు అభ్యర్థులకు వివిధ రకాల ఆఫర్లు ఇస్తూ వీటితోపాటు రూ.10 వేలు నగదును కూడా నజరానాగా అందిస్తున్నట్లు దూమారం రేగుతోంది. కొన్ని కళాశాలలు ఎంసెట్ ఫలితాలు రాకముందు నుండే ఇంటర్ విద్యార్థుల కోసం గాలించి వివిధ రకాల ఆఫర్లను ఇచ్చి ప్రవేశాలు తీసుకొవాలని వ్యూహం పన్నాయి. గత సంవత్సరం ప్రవేశాల కంటే ఈ సంవత్సరం ఎలాగైనా మెరుగైన విధంగా సీట్లు నింపుకోవాలనే ఉద్దేశంతో మొదటి నుంచే రంగం సిద్ధం చేసుకొని ప్రత్యేకంగా ప్రవేశాల కోసం పీఆర్వోలు, మధ్యవర్తులు, అధ్యాపకులను కేటాయించుకొని అక్రమాలకు ఒక వ్యవస్థ ఏర్పర్చుకున్నాయి. వీరందరికీ ముందుగానే ప్రవేశానికి కొంత మొత్తం చొప్పున ముందుగానే డీల్ కుదుర్చుకున్నాయి. ఇంకేముంది వారు సంపాదనే ధ్యేయంగా విద్యార్థుల వేటలోపడి కళాశాలల యాజమాన్యాలు ఇచ్చిన ఆఫర్లను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించి వారిని ప్రలోభపెట్టి అక్రమంగా ప్రవేశాలు సంపాదించుకుంటున్నాయని గత నాలుగు రోజులుగా సోషల్‌మీడియాల్లో, బయట సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రవేశాల విషయంలో పలు ప్రైవేటు కళాశాలల మధ్య అనారోగ్యకరమైన పోటీ నెలకొనడంతో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తూ ప్రవేశాలు సంపాదించడం చూస్తుంటే ఇంజినీరింగ్ కోర్సు ఇంతటికి దిగజారిందా అని విద్యారంగ నిపుణులు వాపోతున్నారు. మొదటి విడతలో 46 శాతమే... మొదటి విడత ఇంజినీరింగ్ ప్రవేశాల తీరును పరిశీలించినట్లయితే ఇంజినీరింగ్ కోర్సుకు డిమాండ్ తగ్గిందా అనే సందేహం కలుగక మానదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 46 శాతం సీట్ల భర్తీ జరగగా ఊహించని రీతిలో ప్రముఖ కళాశాలలకు కూడా షాక్ తగిలేలా సీట్ల కేటాయింపు జరిగింది. జిల్లా వ్యాప్తంగా 13 ఇంజినీరింగ్ కళాశాలలుండగా ఇందులో 2 ప్రభుత్వ కళాశాలలు, 11 ప్రవేట్ కళాశాలలున్నాయి. అన్ని కళాశాలల్లో కలుపుకొని 3,025 కన్వీనర్ కోటా సీట్లున్నాయి. కాగా మొదటి దశలో కోర్సుల వారిగా చూసినట్లయితే సివిల్ 368 సీట్లకు 125, సీఎస్ఈలో 777 సీట్లకు 707, ఈసీఈలో 882 సీట్లకు 368, ఈఈఈలో 662 సీట్లకు 146, మెకానికల్‌లో 336 సీట్లకు 43 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 3,025 సీట్లకు 1,389 సీట్లు భర్తీ కాగా 46 భర్తీ శాతం నమోదైంది. ఇందులో రెండు ప్రభుత్వ కళాశాలల్లో నూటికి నూరు శాతం సీట్ల భర్తీ జరుగగా 90 శాతం ఒక కళాశాల, 60–70 శాతం ఒక కళాశాల, 40–60 శాతం 03 కళాశాలలు, 30–40 శాతం 05 కళాశాలలు, 0–5 శాతం వరకు ఒక కళాశాలల్లో సీట్ల భర్తీ శాతాలు నమోదయ్యాయి. పోటాపోటీగా ఆఫర్లు... ఇంజినీరింగ్ రెండవ దశ సర్టిఫికెట్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి 26న వెరిఫికేషన్ ముగిసింది. మొదటి దశలో జిల్లాలోని కళాశాలల్లో నిరాశనే మిగిల్చినా పలు ప్రవేట్ కళాశాలలు రెండవ దశలో సీట్ల భర్తీ శాతాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకొని ఇష్టారాజ్యంగా ఆఫర్లు కుమ్మరిస్తున్నాయని తెలుస్తోంది. వెబ్ఆప్షన్లకు నేటి వరకు ఉండడంతో విద్యార్థుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సమాచారం. పోటాపోటీగా విద్యార్థుల వద్దకు వారి కళాశాలలు ఇస్తున్న ఆఫర్లు చెబుతూనే ఒక కళాశాల మీద మరొక కళాశాల వారు ఆరోపణలు చేసుకోవడం జరుగుతోందని తెలిసింది. కొన్ని ప్రైవేట్ కళాశాలలు మొదటి దశలో కూడా ప్రలోభాలతోనే ప్రవేశాలు ‘కొని’ తెచ్చుకున్నాయని ప్రచారం జరుగుతోంది. రెండద దశలో సైతం ఇలాంటి పద్ధతిలోనే ప్రవేశాలు సంపాదించుకోవడానికి ప్రణాళికతో పనిచేసినట్లు ప్రచారం. విద్యార్థులకు చాలా మంది ఏ కళాశాలలో బాగుంటుందో ఏ కళాశాలలో చేరాలనే విషయంలో స్పష్టత ఉండదు కాబట్టి వారి తల్లిదండ్రులు కళాశాలల చరిత్ర క్షుణ్ణంగా, స్వయంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలు, క్యాంపస్ ఇంటర్వూలు, అన్ని విషయాలు ఆయా కళాశాలల్లో చదువుతున్న సీనియర్లను అడిగి తెలుసుకొని చేర్పించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. కానీ మొదటి దశలో మెరుగ్గా ఉన్న కళాశాలలు వారి ప్రవేశాలు పోకుండా జాగ్రత్తపడగా , తక్కువ సీట్లతో నిరాశకు చెందిన వారు సీట్లు నిండడానికి వివిధ మార్గాలను ఆశ్రయించినట్లు సమాచారం. రెండవ దశ సీట్లు కేటాయింపు ఈ నెల 29న ఉండడంతో అదే రోజు ఏయే కళాశాలల ప్రయత్నాలు ఏమేరకు ఫలించాయో తెలుస్తుంది. కళాశాలలపై చర్యలు తీసుకోవాలి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు అడ్డదారిలో అక్రమంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంటు దోచేయాలనే దురుద్దేశంతో విద్యార్థులను ప్రలోభాలకు గురిచేస్తూ ఒక్కో అడ్మిషన్‌కు 10 వేల వరకు చెల్లిస్తున్నాయి. కళాశాలలోని వివిధ రకాల ఫీజులు, కన్వీనర్ కోటాలో ప్రభుత్వం ఇచ్చే ఫీజుకు అదనంగా కావాల్సిన ఫీజును కళాశాలల వారే భరించుకొని విద్యార్థుల సర్టిఫికెట్లు తీసుకొని ప్రవేశాలు చేపడుతున్నారు. బీటెక్ పూర్తయ్యే వరకు ఎలాంటి ఫీజులు అడగబోమని బాండ్లు కూడా ఇస్తున్నారు. అక్రమంగా ప్రవేశాలు చేపడుతున్న కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సిరిశెట్టి రాజేశ్‌గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు -
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈనెల 6వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రివైజ్డ్ షెడ్యూలును ప్రవేశాల కమిటీ జారీ చేసింది. విద్యార్థులు ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం 54,836 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోగా, అందులో 53,795 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారంతా శుక్రవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల క్యాంపు మిగతా కార్యాలయం అధికారి బి.శ్రీనివాస్ వివరించారు. అలాగే కాలేజీల వారీగా సీట్ల వివరాలను వెల్లడించారు. ఫీజుల ఖరారు.. లేదంటే షరతులతో ముందుకు! రాష్ట్రంలోని 189 ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు ఫీజుల ఖరారు కోసం కోర్టును ఆశ్రయించిన 81 కాలేజీలతో ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) హియరింగ్ నిర్వహించి ఫీజులను ఖరారు చేసింది. మిగతా 108 కాలేజీల ఫీజల ఖరారు ప్రక్రియను గురువారం చేపట్టింది. అర్ధరాత్రి వరకు కొనసాగించింది. మరోవైపు శుక్రవారం ఉదయం నుంచే ఆయా కాలేజీలతో హియరింగ్ నిర్వహించి ఫీజులను ఖరారు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటికే 81 కాలేజీలకు ఖరారు చేసిన ఫీజులపై ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఫైలును ప్రభుత్వానికి పంపించింది. గురువారం సాయంత్రమే ఆ ఫైలును సీఎం ఆమోదం కోసం విద్యాశాఖ పంపించింది. దీంతో శుక్రవారం ఆయా కాలేజీల ఫీజులపై ఉత్తర్వులు జారీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఏఎఫ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ స్వరూప్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం సమావేశమై 4గంటల పాటు చర్చించారు. శుక్రవారం సాయంత్రం వరకు మిగతా కాలేజీలకు సంబంధించిన ఫీజుల ఫైలును కూడా పంపించాలన్న ఆలోచనల్లో ఉన్నారు. సీఎం ఆమోదం ఆలస్యమైతే! ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించిన ఫైలుకు ఆమోదం లభించడంలో ఆలస్యమైతే.. ఎలా ముందుకెళ్లాలన్న కార్యాచరణపైనా ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు. ఇప్పటికే ఎలాగూ కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి రూ.50వేల లోపు ఫీజున్న కాలేజీలకు 20%, రూ.50వేలకు పైగా ఫీజు ఉన్న కాలేజీలకు 15% పెంపునకు ప్రతిపాదించడం.. దీనికి మెజారిటీ కాలేజీలు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను ఆలస్యం చేయవద్దని, యాజమాన్యాలకు ఏఎఫ్ఆర్సీ చేసిన ఫీజు పెంపు ప్రతిపాదనల అమలుతో ముందుకు సాగాలని నిర్ణయించారు. సీఎం కనుక శుక్రవారం ఓకే చేస్తే ఎలాంటి సమస్యా ఉండదన్న భావనకు వచ్చారు. అది జరక్కపోతే మాత్రం కండిషనల్‌గా 15%, 20% పెంపును వర్తింపజేయాలని నిర్ణయించారు. పూర్తిస్థాయి ఫీజులపై ఉత్తర్వులు వచ్చాక వాటిని అమలు చేస్తామని, ఈ అంశాలన్నింటిని తెలియజేస్తూ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఫీజుల పెంపుపై స్పష్టత! తల్లిదండ్రుల్లో ఇప్పటికే ఫీజుల పెంపుపై ఓ స్పష్టత వచ్చిందన్న అభిప్రాయానికి అధికారుల వచ్చారు. ఏఎఫ్ఆర్సీ హియరింగ్ సీబీఐటీకి రూ.1.34 లక్షలు వార్షిక ఫీజుగా ఖరారు చేసినట్లు తెలిసింది. అలాగే శ్రీనిధి, వాసవి కాలే జీలకు రూ.1.30 లక్షలుగా, ఎంజీఐటీకి రూ.1.08 లక్షలుగా ఫీజును ఖరారు చేసినట్లు సమాచారం.దీంతో టాప్ కాలేజీల్లో గరిష్టంగా ఫీజు ఎంత ఉండొచ్చన్న అంచనా ఉంది. దీంతో ఇంజనీరింగ్ కాలేజీల్లో రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.25 వేల వరకు ఫీజు పెంపు ఉండనుంది. ఈ నేపథ్యంలో ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఈ ఫీజులకు శుక్రవారం ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోతే షరతులతో ముందుకు సాగనున్నారు. కన్వీనర్ కోటాలో 64,709 సీట్లు ఇప్పటివరకు అన్ని సరిగ్గా ఉన్న 183 కాలేజీల్లో మొత్తంగా 91,270 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రవేశాల కమిటీ ప్రకటించింది. అందులో 169 ప్రైవేటు కాలేజీల్లో 88,199 సీట్లు అందుబాటులో ఉండగా, 14 యూనివర్సిటీ/ప్రభుత్వ కాలేజీల్లో 3,071 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో 70% సీట్లను (64,709) కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తంగా 26,561 సీట్లు మేనేజ్మెంట్, ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటాలో కాలేజీలు భర్తీ చేసుకునే అవకాశం ఉంది. శనివారం నాటికి మరిన్ని కాలేజీలు, సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. యూనివర్సిటీల వారీగా ప్రభుత్వ కాలేజీలు, సీట్లు యూనివర్సిటీ కాలేజీలు సీట్లు ఉస్మానియా 2 420 జేఎన్టీయూ–హెచ్ 4 1,410 కాకతీయ 3 825 మహత్మాగాంధీ 1 180 జేఎన్ఏఎఫ్ఏయూ 1 160 అగ్రికల్చర్ యూనివర్సిటీ 2 54 వెటర్నరీ యూనివర్సిటీ 1 22 మొత్తం 14 3,071 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్ల వివరాలు.. యూనివర్సిటీ ఆమోదం లభించిన మొత్తం కన్వీనర్ కోటాలో సీట్లు కాలేజీలు సీట్లు కాలేజీలు సీట్లు ఉస్మానియా 13 7,760 13 5,411 జేఎన్టీయూ–హెచ్ 151 78,729 151 55,030 కాకతీయ 5 1,710 5 1,197 మొత్తం 169 88,199 169 61,638 యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో 14 3,071 మొత్తంగా కన్వీనర్ కోటాలో... 183 64,709 కన్వీనర్ కోటాలో కోర్సుల వారీగా సీట్ల వివరాలు.. కోర్సు యూనివర్సిటీ ప్రైవేటు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 27 – ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ – 84 ఏరోనాటికల్ ఇంజనీరింగ్ – 294 ఆటోమొబైల్ ఇంజనీరింగ్ – 84 బయోటెక్నాలజీ – 21 బయోమెడికల్ ఇంజనీరింగ్ 30 21 కెమికల్ ఇంజనీరింగ్ 120 126 సివిల్ ఇంజనీరింగ్ 130 7,949 కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టం – 42 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 550 16,614 సీఎస్‌ఐటీ – 42 డైరీయింగ్ 22 – డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైన్ అండ్ ప్లానింగ్ 60 – ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 500 14,955 ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ – 16 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 490 7,792 ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేనేషన్ ఇంజనీరింగ్ – 322 ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీమ్యాటిక్స్ – 42 ఫుడ్‌సైన్స్ 27 – ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ 20 – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 240 3,717 ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ – 112 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ – 42 మెకానికల్ (మెకట్రానిక్స్) ఇంజనీరింగ్ – 42 మెకానికల్ ఇంజనీరింగ్ 420 8,833 మెటలర్జికల్ ఇంజనీరింగ్ 60 – మైనింగ్ ఇంజనీరింగ్ 55 168 మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ – 42 పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ – 84 ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్ – 42 ప్లానింగ్ 40 – టెక్స్టైల్ టెక్నాలజీ 20 – మొత్తం 3,071 61,638 -
పెరగనున్న బీటెక్ ఫీజు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ తదితర వృత్తి విద్య కోర్సుల ఫీజులు పెరగనున్నాయి. ఇప్పటివరకు రూ.50 వేల లోపు వార్షిక ఫీజున్న కాలేజీల్లో 20%మేర, రూ.50 వేలకు పైగా వార్షిక ఫీజు ఉన్న కాలేజీల్లో 15% మేర ఫీజులు పెరగనున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి, సాంకేతిక విద్య కాలేజీ యాజమాన్యాలతో శనివారం విశ్వేశ్వరయ్య భవన్లో ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ), తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఏఎఫ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ స్వరూప్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం చైర్మన్ గౌతంరావు, కార్యదర్శి సునీల్, వివిధ కాలేజీ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఫీజుల ఖరారులో ఆలస్యం, ఫీజుల ఖరారులో న్యాయవివాదం తలెత్తడంతో యాజమాన్యాలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్త ఫీజులను అమలు చేసేందుకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఆయా కాలేజీల్లో ఉన్న ఫీజులపై 20%, 15% ఫీజులను పెంచేందుకు ఒకట్రెండు రోజుల సమయం పట్టనున్నందున.. జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఇంజనీరింగ్ వెబ్ఆప్షన్ల ప్రక్రియను మరో రెండు మూడ్రోజులు వాయిదా వేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. కాలేజీ వారీగా ఫీజులను ఖరారు చేశాకే, వెబ్ ఆప్షన్లను అందుబాటులో తేవాల్సి ఉంటుంది. దీంతో.. తాజా మార్పులను దృష్టిలో ఉంచుకుని వెబ్ఆప్షన్లను వాయిదా వేయనున్నారు. 103 ఇంజనీరింగ్ కాలేజీల్లో 20% రాష్ట్రంలో 2016–17 విద్యా సంవత్సరంలో 184 ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులను ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది. ఇందులో కనీస ఫీజు రూ.35 వేల లోపు ఉన్న కాలేజీలు 26 ఉన్నాయి. వాటితో కలుపుకొని రూ.50వేల లోపు ఫీజున్న కాలేజీల సంఖ్య 103. ప్రస్తుతం వాటన్నింటిలో 20% ఫీజులు పెరగనున్నాయి. మిగతా 81 కాలేజీల్లో 15% ఫీజులు పెంచనున్నారు. ఇంజనీరింగ్‌తోపాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా తదితర వృత్తి విద్యాకోర్సుల ఫీజులు కూడా ఇదే నిష్పత్తిలో (20%, 15%) పెంచేందుకు అధికారులు ఓకే చెప్పారు. 2019–20 విద్యా సంవత్సరం నుంచి 2021–22 విద్యా సంవత్సరం వరకు మూడేళ్లపాటు అమలు చేయాల్సిన ఫీజుల కోసం 1,235 వృత్తి, సాంకేతిక విద్యా కాలేజీలు ప్రతిపాదనలను అందజేశాయి. ప్రస్తుతం వాటన్నింటిలో ఈ పెంపు అమలు కానుంది. భారీగా పెంపుదలకు డిమాండ్ కొత్త ఫీజుల ఖరారు విషయంలో న్యాయ వివాదం నేపథ్యంలో ఫీజులను పెంచుతామని అధికారులు యాజమాన్యాల ముందు ప్రతిపాదన పెట్టగా కొన్ని కాలేజీలు 35–40% పెంచాలని డిమాండ్ చేశాయి. కానీ భారీగా పెంచితే వ్యతిరేకత ఎదురవుతుందన్న అభిప్రాయం కారణంగా తాజా మార్పులను ఏఎఫ్ఆర్సీ సూచించింది. దీనికి మెజారిటీ యాజమాన్యాలు అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. వాస్తవానికి ఏఎఫ్ఆర్సీ చైర్మన్‌ను ముందుగా నియమించి ఉంటే, ఆయా కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను ఖరారు చేసే వారు. నియామకంలో ఆలస్యం కావడం, ఫీజులను ఖరారు చేయకపోవడంతో ప్రవేశాలు మరింత జాప్యమయ్యే పరిస్థితి నెలకొనడంతో.. ఈ పెంపును అధికారులే ప్రతిపాదించారు. దీనికి కోర్టును ఆశ్రయించిన కాలేజీలు కూడా చాలా వరకు అంగీకరించాయని అధికారులు వెల్లడించారు. అంతేకాదు రాతపూర్వకంగా అంగీకారాన్ని తెలియజేశాయని పేర్కొన్నారు. కోర్టు తీర్పును కచ్చితంగా అమలు చేయాలంటే.. ఏఎఫ్ఆర్సీ చేసిన ప్రతిపాదనకు అంగీకరించడకుండా, కోర్టు తీర్పునే అమలు చేయాలంటే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. కొత్త ఫీజు ప్రతిపాదనలు ఇచ్చిన కాలేజీల్లో కొన్ని 280% పెంపుదల కోరాయి. రూ.1,13,500 ఫీజు ఉన్న ఓ కాలేజీ రూ.3.19 లక్షల వార్షిక ఫీజును ప్రతిపాదించాయి. ఇలా చాలా కాలేజీలు 200శాతానికి పైగా ఫీజులను ప్రతిపాదించాయి. అలాంటి వాటిల్లో మొదట 6 కాలేజీలు కోర్టును ఆశ్రయించగా, యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలుకు తీర్పు ఇచ్చింది. ఆ తరువాత మరో 75 కాలేజీలు కోర్టుకు వెళ్లి అదే తరహా ఆర్డర్ తెచ్చుకున్నాయి. దీంతో వాటి సంఖ్య 81కి చేరింది. అయితే శనివారం జరిగిన సమావేశంలో ఆ కాలేజీలకు చెందిన యాజమాన్యాలు కూడా పాల్గొన్నాయి. అందులో మెజారిటీ కాలేజీలు అధికారుల ప్రతిపాదనకు అంగీకరించాయి. ఇక భారీగా ఫీజును ప్రతిపాదించిన 20 వరకు కాలేజీలు ఈ పెంపు ప్రతిపాదనను అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. వారు కోర్టు తీర్పును అమలు చేయాలని కోరే అవకాశం ఉంది. తమ ప్రతిపాదనకు రాత పూర్వకంగా అంగీకారం తెలుపని కాలేజీలతో మరోసారి మాట్లాడి ఒప్పించాలని భావిస్తున్నారు. వారు అంగీకరించకపోతే ఆయా కాలేజీలకు ఫీజులను నిర్ధారించాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఎలాగూ వెబ్ఆప్షన్లను వాయిదా వేయాలని భావిస్తున్నందున మరికొంత సమయం దొరుకుతుంది. వెబ్ ఆప్షన్ల చివరి తేదీ నాటికి ఆయా కాలేజీల ఫీజులను ఖరారు చేసి కౌన్సెలింగ్‌లో పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. విద్యార్థులు కొత్త ఫీజులను చూసి చివరి రోజున తమ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ తర్వాత మిగతా అన్ని కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి కొత్త ఫీజులను నెల, రెండు నెలల రోజుల్లోఖరారు చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దాంతో విద్యార్థులు ఫీజులు చెల్లించే నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తే ఎలాంటి సమస్యలు ఉండబోవని అధికారులు భావిస్తున్నారు. ఫీజు తంటాలు తప్పవా? వెబ్ ఆప్షన్ల సమయంలో కాలేజీ వారీ ఫీజులను వెల్లడించాలి. వాటిని చూసే విద్యార్థులు ఆ ఫీజులను బట్టి తమకు ఇష్టమైన కాలేజీని ఎంచుకుంటారు. అయితే ఇప్పటివరకు రూ.60 వేల ఫీజు ఉన్న ఓ కాలేజీకి అధికారుల చేసిన 15% పెంపు ప్రతిపాదన ప్రకారం రూ.9 వేలు పెరుగుతుంది. ఆ కాలేజీ ఫీజు రూ.69 వేలకు చేరుకుటుంది. అయితే ఇది తాత్కాలికమే. ఆదాయ వ్యయాలను బట్టి ఆ కాలేజీ ఫీజును వచ్చే నెల రెండు నెలల్లో పూర్తిస్థాయి ఫీజును ఖరారు చేస్తారు. ఇక్కడే ఓ సమస్యుంది. ఇప్పటి వరకు రూ.60 వేల ఫీజు ఉన్న ఆ కాలేజీ కొత్త ఫీజును రెట్టింపు చేస్తూ రూ.1.20 లక్షలకు ప్రతిపాదిస్తే వాటిని ఏఎఫ్ఆర్సీ పరిశీలించనుంది. అందులో రూ.1 లక్షకు కనుక ఆ కాలేజీ ఫీజు ఖరారైతే ఆ కాలేజీలో చేరిన విద్యార్థిపై రూ.40 వేల అదనపు భారం పడనుంది. ఆ కాలేజీ ఫీజు ఇపుడు రూ.69వేలుగా చేసినా, ఆ తరువాత ఎంత వరకు పెరుగుతుందో.. ఆదాయ వ్యయాలను బట్టి ఫీజుల నియంత్రణ కమిటీ ఎంతవరకు తగ్గిస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. విద్యార్థి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేప్పుడు రూ.69 వేలు మాత్రమే కనిపిస్తుంది తప్ప కచ్చితమైన ఫీజు తెలియదు. ఇలాంటి పరిస్థితి చాలా కాలేజీల విషయంలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉంది. దీంతో ఈసారి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఫీజు ఇబ్బందులు, గందరగోళం తప్పేలా లేదు. ఫీజుల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలు బీటెక్–197, ఎంటెక్–130, ఎంబీఏ–285, ఎంసీఏ–33, బీఫార్మసీ–122, ఎంఫార్మసీ–113, ఫార్మ్‌డీ–57, ఫార్మ్‌డి (పీబీ)–28, బీఎడ్–196, ఎంఎడ్–9, బీపీఈడీ–9, డీపీడీడీ–2, ఎల్ఎల్బీ–29, ఎల్ఎల్ఎం–9, బీఆర్క్–9, ఎం.ఆర్క్–2, బీఎఫ్ఏ–5. -
ఇంజిన్ ‘గేర్’ మార్చండి!
నువ్వు ఒక అంబాసిడర్ కారు కొనడానికి వెళ్లావు.. పక్కన బెంజ్ ఉంది.. నువ్వేం కొంటావ్.. నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్లావ్.. పక్కన ఓ పెద్ద ప్లాస్మా టీవీ ఉంది.. నువ్వేం కొంటావ్.. అక్క అంబాసిడర్.. నేను బెంజ్.. అది పోర్టబుల్.. నేను ప్లాస్మా.. అది లైఫ్‌బాయ్.. నేను లక్స్.. ఇది ఓ ఫేమస్ చిత్రంలోని సన్నివేశం.. ప్రస్తుతం ఇంజనీరింగ్ జాబ్ మార్కెట్ పరిస్థితీ ఇలాగే ఉంది.. అందరికీ కావాల్సింది స్మార్ట్ టీవీలే. కానీ మన కాలేజీలు ఇంకా ఆ పాత పోర్టబుల్ టీవీలనే ఇస్తున్నాయి.. తప్పెవరిది?? శిక్షెవరికి??చింతకింది గణేశ్ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న కోర్సులు ఇంజనీరింగ్ విద్యలో రావట్లేదు. మన దేశంలో, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో గతంలో ప్రవేశ పెట్టిన కోర్సులు మినహా మార్కెట్ అవసరాలకు మేరకు ఒక్క కోర్సునూ ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. దీంతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఆశించిన మేర లభించట్లేదు. దేశవ్యాప్తంగా ఏటా 17 లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరు తుంటే, రాష్ట్రంలో 90 వేల మంది చేరుతున్నారు. రాష్ట్రంలో ఏటా 65వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు బయటకొస్తున్నా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్న వారు 27 శాతానికి మించి ఉండట్లేదు. అందుకే ఇంజనీరింగ్ విద్యలో రీఇంజనీరింగ్ అవసరం ఏర్పడింది. మార్కెట్ అవసరాల మేరకు ఈ విద్యలో సమూల మార్పులు తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపునకు కేంద్రం చర్యలు చేపడుతున్నా.. రాష్ట్రంలో ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఇంజనీరింగ్ అంటే విలువలేని పరిస్థితి వస్తోంది. డిమాండున్న కోర్సులు అనేకమున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో డిమాండ్ ఉన్న కోర్సులు అనేకం ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ అండ్ రొబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి అనేక కోర్సులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రముఖ కంపెనీలన్నీ దృష్టిసారించాయి. సివి ల్, మెకానికల్ రంగాల్లో కూడా అనేక మార్పులొచ్చాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. అయినా అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యలో మార్పులు తీసుకురావడంలో యూనివర్సిటీలు విఫలమవుతున్నాయి. కంటిన్యూడ్ ఇండస్ట్రీ డిజిటైజేషన్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలు కంటిన్యూడ్ ఇండస్ట్రీ డిజిటైజేషన్ టెక్నాలజీని అనుసరిస్తు న్నాయి. అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), త్రీడీ స్కానింగ్ అండ్ ప్రిటింగ్ వంటి వాటిని అమలు చేస్తున్నాయి. అయినా వీటిపై ప్రత్యేక బీటెక్ కోర్సులు లేవు. క్లౌడ్ కంప్యూటింగ్.. మెజారిటీ కంపెనీలన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీని వినియోస్తున్నాయి. ఏఆర్, వీఆర్ అండ్ ఇమ్మర్సివ్ ఆర్కిటెక్చర్ విధానం ప్లానింగ్ రంగంలో కీలకంగా మారింది. బిగ్ డేటా అనాలిసిస్, ఆర్కిటెక్చర్ రొబోట్స్, త్రీడీ ప్రింటింగ్ కూడా కీలకంగా మారాయి. ఇందులో కొన్ని వివిధ కోర్సుల్లో ఓ సబ్జెక్టుగానే ఉన్నాయి తప్ప కోర్సులుగా ఎక్కడా లేవు. మన రాష్ట్రంలో అయితే అవేవీ సబ్జెక్టుగా కూడా లేవు. ఏఐపై ప్రత్యేక దృష్టి ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. దేశంలోనే మొదటిసారిగా వచ్చే విద్యా సంవత్సరంలో ఏఐను బీటెక్ కోర్సుగా ప్రవేశ పెట్టేందుకు హైదరాబాద్ ఐఐటీ చర్యలు చేపట్టింది. దేశంలోని మరే విద్యా సంస్థ కూడా ఆ దిశగా అడుగులు వేయట్లేదు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలే కొన్ని కోర్సులకు సర్టిఫికెట్ ఇస్తూ వాటిని నేర్చుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. విద్యా సంస్థలు మాత్రం ఆ దిశగా కసరత్తు చేయట్లేదు. మైక్రోసాఫ్ట్ దేశవ్యాప్తంగా 10 పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసి ఏఐపై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. డేటా సైన్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటెలిజెంట్ క్లౌడ్ హబ్ వంటి అంశాల్లో వచ్చే మూడేళ్లలో 5 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ పరిజ్ఞానాన్ని 700కు పైగా కంపెనీలు వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బీటెక్ డిగ్రీలతో పాటు వీటన్నింటినీ ప్రత్యేకంగా ప్రవేశపెడితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాల మేరకు.. రాష్ట్రంలో 198 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో 95,235 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 72 వేల సీట్లే భర్తీ అవుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో సీట్ల భర్తీ క్రమంగా తగ్గిపోతోంది. ఏటా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బయటకొస్తున్న 65 వేల మంది గ్రాడ్యుయేట్లలో 27 శాతం మందికే ఉపాధి లభిస్తుండగా మిగతా వారంతా నిరుద్యోగులుగానే మిగులుతున్నారు. రాష్ట్రంలో ఫార్మా, సిమెంట్, ఐటీ, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్, మైన్స్ అండ్ మినరల్స్, టెక్స్టైల్స్ అండ్ అపెరల్స్, హార్టికల్చర్, పౌల్ట్రీ రంగాలు అధికంగా ఉన్నా వాటి అవసరాలకు అనుగుణంగా కోర్సులను రీడిజైన్ చేసి విద్యార్థులను అందించడంలో యూనివర్సిటీలు విఫలం అవుతున్నాయి. రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టు పనుల్లో దాదాపు 2 వేల మందికి పైగా ఇంజనీర్లు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే పని చేస్తుండటం గమనార్హం. ఇదే సరైన సమయం.. ఇంజనీరింగ్‌లో కొత్త ఇంటర్న్‌షిప్ పాలసీని అమల్లోకి తేవాలని ఏఐసీటీఈ స్పష్టం చేసిన నేపథ్యంలో కోర్సుల రీఇంజనీరింగ్‌కు చర్యలు చేపట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా కోర్సుల రీడిజైన్‌తో పాటు స్థానికంగా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సులను తీర్చిదిద్దాలని చెబుతున్నారు. అప్పుడే రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలకు మెరుగవుతాయని పేర్కొంటున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 600–700 గంటల ఇంటర్న్‌షిప్‌ను ఇటీవల ఏఐసీటీఈ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో స్కిల్స్‌ను పెంపొందించడంతో పాటు పారిశ్రామిక అవసరాలపై పక్కాగా నేర్చుకునేలా ఇంటర్న్‌షిప్ అమలు చేయాలని చెబుతున్నారు. కమ్యూనికేషన్, ఇంట్రాపర్సనల్ రిలేషన్స్, ప్రాబ్లం సాల్వింగ్, డిసిషన్ మేకింగ్, టైం మేనేజ్మెంట్, సెల్ఫ్ మోటివేషన్ నైపుణ్యాలను, టెక్నికల్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, టైమ్ మేనేజ్మెంట్, న్యూమరికల్ స్కిల్స్ కచ్చితంగా నేర్పించేలా సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. ఇటీవల వెల్లడైన ఇండియా స్కిల్ రిపోర్టు–2019లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్లోనూ రెండో స్థానంలో ఉన్న తెలంగాణ విద్యార్థులు మిగతా వాటిన్నింటిలో వెనుకబడే ఉన్నారు. పట్టించుకోని వర్సిటీలు.. మార్కెట్, ఇండస్ట్రీ అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు సిలబస్‌లో మార్పులు తీసుకురావాల్సిన యూనివర్సిటీలు ఆ పని మానేశాయి. ఉస్మానియా, జేఎన్టీయూలు కేవలం కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలుగానే మిగిలిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పరిశ్రమల అవసరాల మేరకు కోర్సుల రీఇంజనీరింగ్‌ను పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తామే కోర్సులను రీడిజైన్ చేసుకుని అనుమతివ్వాలని కొన్ని ప్రైవేటు కాలేజీలు కోరినా.. ‘యూనివర్సిటీ కాలేజీల్లోనే లేదు.. మీకెలా అనుమతిస్తాం’అంటూ తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. పీజీ ఇంజనీరింగ్‌లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్సును ప్రవేశ పెట్టేందుకు సిలబస్ రూపొందించుకొని ఓ కాలేజీ అనుమతి కోరినా యూనివర్సిటీ ఇవ్వలేదు. దీంతో ఆ కోర్సును ఆ కాలేజీ ప్రవేశపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్ రూపురేఖలు మార్చే కోర్సులివే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ అండ్ రొబోటిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ మిషన్ లెర్నింగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బిగ్ డేటా అనలిటిక్స్ ఇకనైనా మారిస్తే మేలు: కృష్ణారావు, చైర్మన్, స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీ ఇకనైనా యూనివర్సిటీల తీరు మారాలి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో మార్పులు తేవాలి. వీలైతే విద్యార్థులకు మొదటి ఏడాది కోర్సుకు సంబంధించి పరిశ్రమల్లోనే పని చేసేలా చర్యలు చేపట్టాలి. లేదంటే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రీడిజైన్ చేయాలి. అవసరం లేనపుడు ఎలా వస్తారు: నర్సింహారెడ్డి, ఉన్నత విద్యా మండలి పాలక మండలి సభ్యుడు నల్లగొండలో యాభైకి పైగా సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ఇంజనీరింగ్‌కు సంబంధించి యూనివర్సిటీలో సమావేశమైన ప్రతిసారి వారిని ఆహ్వానించినా వారు రావట్లేదు. ఒకసారి అడిగితే ‘మా పరిశ్రమకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో సిలబస్ లేదు.. మేమొచ్చి ఏం చేయాలి.. మీరు చెప్పే చదువు చదువుకునే విద్యార్థులు మాకు పనికి రారు.. అలాంటపుడు వచ్చి చేసేదేముంది’అని పేర్కొన్నారు. మార్పులపై ప్రభుత్వానికి నివేదిస్తాం: తుమ్మల పాపిరెడ్డి, చైర్మన్ ఉన్నత విద్యా మండలి ప్రస్తుతం రాష్ట్రంలోని కాలేజీల్లో అమలు అవుతున్న ఇంజనీరింగ్ విద్య స్థితి గతులను ప్రభుత్వానికి నివేదిస్తాం. జాతీయంగా, అంతర్జాతీయంగా, స్థానిక అవసరాల మేరకు సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై చర్చిస్తాం. రాష్ట్ర యువతకు నైపుణ్యాల పెంపుదలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతాం. – దేశవ్యాప్తంగా ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యం ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 57 శాతమే. అంటే మరో 43 శాతం మందికి నైపుణ్యాల్లేవు. ఇందులో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 42 శాతం మందిలోనే ఉద్యోగార్హ నైపుణ్యాలున్నాయి. 58 శాతం మందిలో ఆ నైపుణ్యాలు లేవు. ఇండియా స్కిల్ రిపోర్టు–2019 వెల్లడించిన వాస్తవాలివీ. – చదువుతున్న చదువుకు పారిశ్రామిక అవసరాలకు సంబంధం లేకపోవడం, అవి కోరుకునే విద్యను ఇంజనీరింగ్ కాలేజీలు అందించకపోవడంతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ముందుకు రావట్లేదు. ఫలితంగా ఐటీ, ఐటీ సంబంధ రంగాలు మినహా మిగతా రంగాల్లో ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించట్లేదు. ఏఐసీటీఈ సర్వేలో వెల్లడైన అంశాలివీ.. -
ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలి
సాక్షి, అనంతరపురం : ర్యాగింగ్ భూతానికి మరో ఇంజనీరింగ్ విద్యార్థిని బలైంది. అనంతరపురం జిల్లా పట్నం గ్రామానికి చెందిన ప్రియాంక మదనపల్లి గోల్డెన్ వ్యాలీ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత కొంత కాలంగా సీనియర్ విద్యార్థి తనపై వేధిపులకు పాల్పడుతున్నారని కళాశాల ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేసింది. నిన్న సాయంత్రం బస్‌లో వెళ్తున్న సమయంలో కూడా మరోసారి వేధించాడని తీవ్ర మనస్తాపన చెందిన ప్రియాంక సూపర్ వాస్మోల్ తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. వేధింపులపై కళాశాల ప్రిన్సిపాల్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
ఆఫ్ క్యాంపస్‌లు అక్రమమే!
సాక్షి, హైదరాబాద్ : అనుమతులు ఒకచోట.. తరగతులు ఇంకోచోట.. ఆఫ్ క్యాంపస్‌ల పేరుతో కొన్ని.. స్టడీ సెంటర్ల పేరుతో మరికొన్ని.. అనుమతులు లేకుండానే సర్టిఫికెట్లు జారీ చేస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు, స్టడీ సెంటర్లు లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు లేకుండానే పలు సంస్థలు సాధారణ డిగ్రీలు, ఇంజనీరింగ్ కోర్సులను కొనసాగిస్తున్నాయని ప్రభుత్వానికి ఇటీవల భారీగా ఫిర్యాదులు అందాయి. వాటిపై ఏఐసీటీఈకి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సాంకేతిక విద్య కోర్సులు నిర్వహించేందుకు తమ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఏఐసీటీఈ ఈనెల 26న బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రంగంలోకి దిగింది. వివరణ కోరిన మండలి ఏఐసీటీఈ ఆమోదం లేకుండానే ఇతర రాష్ట్రాల్లో ఆఫ్ క్యాంపస్‌లు నిర్వహిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పలు విద్యా సంస్థల నుంచి వివరణ కోరింది. గీతమ్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్, సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అమిటీ, సింఘానియా, కేఎల్ యూనివర్సిటీ, ఇక్ఫాయ్ యూనివర్సిటీలకు లేఖలు రాసింది. 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపడుతున్న ఆయా సంస్థలకు ఏయే అనుమతులున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్వోసీ ఉందా.. ఏఐసీటీఈ అనుమతులున్నాయా.. యూజీసీ అనుమతి ఉందా.. తదితర అంశాలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. దీనిపై మూడు సంస్థలు ఇప్పటికే వివరణ ఇచ్చాయి. మరో మూడు విద్యా సంస్థల నుంచి వివరణ రావాల్సి ఉందని మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. మిగతా విద్యా సంస్థల నుంచి వివరణ వచ్చాక అన్నింటినీ తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో సరైన అనుమతులు లేకుండానే కోర్సులను నిర్వహిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ వివరణ కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇష్టారాజ్యంగా కోర్సుల నిర్వహణ అనుమతుల్లేకపోయినా కొన్ని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అలాంటి విద్యాసంస్థల్లో చేరి, విద్యార్థులు డబ్బుతో పాటు భవిష్యత్తును నష్టపోతున్నారు. డిసెంబర్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏఐసీటీఈ అనుమతితోనే సాంకేతిక విద్య కోర్సులు నిర్వహించాలన్న నిబంధన ఉన్నా ఆఫ్ క్యాంపస్‌ల పేరుతో ఇతర రాష్ట్రాల్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి. కొన్ని రాష్ట్రస్థాయి యూనివర్సిటీలైతే సంప్రదాయ డిగ్రీలు, వివిధ కోర్సులను ఇతర రాష్ట్రాల్లో స్టడీసెంటర్ల ద్వారా నిర్వహించకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. స్టడీ సెంటర్ల పేరుతో లక్షలాది విద్యార్థులను మోసం చేస్తున్నాయి. పదోన్నతులు పొందేందుకు అలాంటి చెల్లని సర్టిఫికెట్లు పెట్టిన వారు వివిధ శాఖల్లో అనేక మంది ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తూనికలు, కొలతల శాఖలో చెల్లని సర్టిఫికెట్ల గొడవ కొనసాగుతోంది. ఆ సర్టిఫికెట్లతోనే పదోన్నతులు ఇస్తున్నారంటూ ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. దీనిపై ఉన్నత విద్యామండలికి భారీగా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ‘గీతమ్ అనుమతికి దరఖాస్తు చేయలేదు’ గీతమ్ డీమ్డ్ యూనివర్సిటీ విశాఖపట్నం, హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ కోర్సుల నిర్వహణ కోసం తమకు దరఖాస్తు చేయలేదని, ఆమోదం పొందలేదని ఏఐసీటీఈ రీజనల్ ఆఫీసర్ రమేశన్ ఉన్ని క్రిష్ణన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన బీఎన్ శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా, ఈ మేరకు ఏఐసీటీఈ అధికారులు ఈనెల 25న రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీనిపై గీతమ్ వర్సిటీ వర్గాలను వివరణ కోరగా.. మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ), యూజీసీ, ఏఐసీటీఈ భాగస్వామ్యంతో కూడిన జాయింట్ కమిటీ ఆమోదం మేరకే తమ కోర్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నాయి. ప్రత్యేకంగా ఏఐసీటీఈ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపాయి. -
10,122 ఇంజనీరింగ్ సీట్ల కోత
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో 10,122 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కోత పెట్టింది. 14 కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం ఇవ్వలేదు. ఇందులో కొన్ని స్వచ్ఛందంగా మూసివేత కోసం దరఖాస్తు చేసుకోగా, మరికొన్నింటికి ఏఐసీటీఈ అనుమతి నిరాకరించినట్టు తెలిసింది. గతేడాది రాష్ట్రంలోని 242 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,24,239 సీట్లకు అనుమతి ఇచ్చిన ఏఐసీటీఈ.. ఈసారి 228 కాలేజీల్లోని 1,14,117 సీట్లకే అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతులు ఇచ్చిన కాలేజీలు, సీట్ల వివరాలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖకు పంపించింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో కాలేజీల మూత రాష్ట్రంలో పాత రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని 14 కాలేజీలు మూతపడ్డాయి. గతేడాది ఈ కాలేజీలు కొనసాగినా.. ఈసారి అనుమతులు రాలేదు. నల్లగొండ జిల్లాలో గతేడాది 26 ఇంజనీరింగ్ కాలేజీలుంటే ఈసారి 21 కాలేజీలకే అనుమతులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో కాలేజీల సంఖ్య 119 నుంచి 113కు, ఖమ్మం జిల్లాలో 18 నుంచి 15 కాలేజీలకు పరిమితమయ్యాయి. మిగతా జిల్లాల్లో అన్ని కాలేజీలకు అనుమతులు ఇచ్చినా సీట్ల సంఖ్యలో మాత్రం కోత పడింది. జేఎన్టీయూ ‘గుర్తింపు’లో మరింత కోత! ఇంజనీరింగ్ కాలేజీల్లో పది వేల సీట్లకు ఏఐసీటీఈ కోత విధించగా... రాష్ట్రంలో కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సిన జేఎన్టీయూ చర్యలతో మరిన్ని సీట్లు తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్ కాలేజీల పరిధిలో 1.24 లక్షల సీట్ల భర్తీకి ఏఐసీటీఈ అనుమతించినా... జేఎన్టీయూ సహా రాష్ట్ర వర్సిటీలు 97,961 సీట్ల భర్తీకే అనుబంధ గుర్తింçపు ఇచ్చాయి. అయితే కాలేజీల్లో వరుసగా మూడేళ్ల పాటు 25 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలకు గుర్తింపు రద్దు చేస్తామని జేఎన్టీయూ ఇటీవల ప్రకటించింది. దీంతో మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. జేఎన్టీయూ ఇప్పటికే ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ)’ఆధ్వర్యంలో కాలేజీల్లో తనిఖీలు చేపట్టి.. నివేదికలను క్రోడీకరించింది. అందులో ఏయే కాలేజీల్లోని, ఏయే బ్రాంచీల్లో 25 శాతంలోపు సీట్లు భర్తీ అయ్యాయని పరిశీలిస్తోంది. అలా గుర్తించిన బ్రాంచీలను రద్దు చేయనుంది. మొత్తంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఈనెల 15వ తేదీలోగా అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రకటించనుంది. పాలిటెక్నిక్‌లో 4వేల సీట్ల తగ్గింపు రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ నాలుగు వేల సీట్లకు ఏఐసీటీఈ కోత విధించింది. పలు కాలేజీలకు అనుమతులు కూడా రద్దు చేసింది. గతేడాది రాష్ట్రంలో 201 కాలేజీల్లో 51,625 సీట్లు అందుబాటులో ఉండగా... ఈసారి 187 కాలేజీల్లో 47,264 సీట్లకు అనుమతులు వచ్చాయి. డి.ఫార్మసీలో మాత్రం గతేడాది అనుమతించిన 15 కాలేజీల్లోని 830 సీట్లకు ఈసారి కూడా పూర్తిగా అనుమతి ఇచ్చింది. -
44 ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపుపై సందిగ్ధత!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 44 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులపై సందిగ్ధత నెలకొంది. ఆయా కాలేజీలు 111 జీవో పరిధిలోని ప్రదేశాలు, భూదాన్ భూముల్లో ఉండటంతో వాటికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి నిరాకరించింది. దీంతో ఆయా కాలేజీలకు అనుమతులపై గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో మొత్తంగా 212 ఇంజనీరింగ్ కాలేజీలుండగా 168 కాలేజీల్లో ప్రవేశాలకే ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేసింది. జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు జాబితాను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే నెల 7లోగా అనుబంధ గుర్తింపు జాబితాను ఇస్తామని జేఎన్టీయూహెచ్ పేర్కొనగా, వచ్చే నెల 15లోగా అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి ఆదేశించింది. ఏఐసీటీఈ గుర్తింపు లభించని కాలేజీల్లో ప్రముఖుల కాలేజీలు ఉండటంతో ఈలోగా వాటికి అనుమతులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. మే 2 నుంచి ఎంసెట్.. రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలను మే 2 నుంచి 7 వరకు నిర్వహించేందుకు జేఎన్టీయూహెచ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తంగా 2,20,990 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,47,912 మంది, అగ్రికల్చర్ ఎంసెట్ రాసేందుకు 73,078 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. -
'పవనిజం జిందాబాద్' అంటూ 'బన్నీ' వెబ్ సైట్ హ్యాక్!
విజయవాడ: 'మీ కాలేజి వెబ్ సైట్ సెక్యూరిటీ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది' అని హెచ్చరిస్తూ ఓ కాలేజి వెబ్ సైట్ ను బన్నీ పేరుతో హ్యాక్ చేయడమే కాకుండా పవనిజం జిందాబాద్ అంటూ ఓ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. బన్ని అంటే అల్లు అర్జున్ అనుకుంటే పొరపాటే. బన్ని పేరుతో విజయవాడ సమీపంలో మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజి వెబ్ సైట్ ను ఇటీవల హ్యాక్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హ్యాకింగ్ పాల్పడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టి పవనిజం జిందాబాద్ అనే సందేశాన్ని హోంపేజీలో పోస్ట్ చేశారు. 'మా వెబ్ సైట్ ను హ్యాక్ చేసినట్టు గమనించాం. ఇందుకు బాధ్యులైన వారిపై తర్వాత దృష్టిపెడుతాం' అని కాలేజి యాజమాన్యం ఓ దినపత్రికకు వెల్లడించారు. ప్రస్తుతం కాలేజి వెబ్ సైట్ ను పునరుద్దరించి.. యధావిధిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల కరెన్సీ నోటును ఫ్యాన్స్ మార్పింగ్ చేసి గాంధీజీ బొమ్మ స్థానంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను పెట్టడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. Follow @sakshinews