సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలపై ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా ప్రభావం పడనుంది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్ల పెరుగుదల సాధారణ కాలేజీలకు నష్టదాయకం కానుండగా, టాప్ కాలేజీలకు మేలు చేకూర్చనుంది. ప్రవేశాల్లో విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది టాప్ కాలేజీలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో ఈడబ్ల్యూఎస్ కోటాలో టాప్ కాలేజీల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యే అవకాశం ఉండగా, సాధారణ కాలేజీల్లో ఆ మేరకు ప్రవేశాల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం నెలకొంది.
కౌన్సెలింగ్ కసరత్తు షురూ..
రాష్ట్రంలో 2020–21 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ఇప్పటికే ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు అంచనాల్లో పడ్డాయి. తమ కాలేజీలకు ఉన్న డిమాండ్ ప్రకారం తమకు ఎంత మేలు చేకూరుతుంది.. ఎవరికి నష్టం చేకూరుతుందన్న లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు యాజమాన్యాల వారీగా, కోర్సుల వారీగా 10 శాతం సీట్ల పెంపుతో ఎలా కౌన్సెలింగ్ నిర్వహించాలన్న కసరత్తును ప్రవేశాల క్యాంపు కార్యాలయం ప్రారంభించింది. ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ రూపకల్పనకు చర్యలు చేపట్టింది.
40 నుంచి 50 కాలేజీల్లోనే 100% ప్రవేశాలు
రాష్ట్రంలో 205 ఇంజనీరింగ్ కాలేజీలుండగా, గతేడాది కన్వీనర్ కోటాలో 183 కాలేజీల్లోని 65,544 సీట్లలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వ హించారు. మరికొన్ని మైనారిటీ కాలేజీల్లో ఆయా యాజమాన్యాలే సొంత ప్రవేశాలను చేపట్టాయి. కన్వీనర్ కోటాలో చేపట్టిన ప్రవేశాల్లో 44 కాలేజీల్లోనే సీట్లు 100% భర్తీ అయ్యాయి. ఒక్క విద్యార్థి చేరని కాలేజీలు 3 ఉండగా, అన్ని బ్రాంచీల్లో కలిపి 10 లోపే ప్రవేశాలు వచ్చిన కాలేజీలు 90కి పైగా ఉన్నాయి. ఒక్కో కాలేజీలో 200 మందికి మించి విద్యార్థులు చేరిన మరికొన్ని కాలేజీల్లోనే 45 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. ఆయా కాలేజీల్లోనే 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 4,500కుపైగా సీట్లు పెరుగనున్నాయి. దీంతో విద్యార్థులు కూడా టాప్ కాలేజీల్లో పెరిగిన సీట్లలో చేరేందుకు ఆసక్తి చూపనున్నారు. 100 లోపే ప్రవేశాలు వచ్చిన 90కి పైగా కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% సీట్లు పెరిగినా పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు.
ఎంబీఏ, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఎడ్, ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ (ఈసెట్) వంటి ఇతర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లోనూ ఇదే ప్రభా వం ఉండనుంది. వాటిల్లోనూ టాప్ కాలేజీల్లో పెరిగే సీట్లలోనే విద్యార్థులు చేరేందుకు మొగ్గు చూపనున్నారు. ఇక ఎంబీఏను తీసుకుంటే గతే డాది 276 కాలేజీల్లో 22,434 సీట్లను భర్తీ చేశా రు. అయితే అందులో 184 కాలేజీల్లోనే 100% సీట్లు భర్తీ అయ్యాయి. మరో 92 కాలేజీల్లో 100% సీట్లు భర్తీ కాలేదు. అందులో తక్కువ అడ్మిషన్లున్న కాలేజీలు 65కు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ అడ్మిషన్లు ఉన్న కాలేజీలకు సీట్లు పెరిగినా పెద్దగా ప్రయోజనం లేకపోగా, ఎక్కువ డిమాండ్ ఉన్న కాలేజీల్లో పెరిగే సీట్లలో చేరేందుకే సాధారణ కాలేజీల్లో చేరాల్సిన విద్యార్థులే వెళ్లే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment