సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో 10,122 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కోత పెట్టింది. 14 కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం ఇవ్వలేదు. ఇందులో కొన్ని స్వచ్ఛందంగా మూసివేత కోసం దరఖాస్తు చేసుకోగా, మరికొన్నింటికి ఏఐసీటీఈ అనుమతి నిరాకరించినట్టు తెలిసింది. గతేడాది రాష్ట్రంలోని 242 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,24,239 సీట్లకు అనుమతి ఇచ్చిన ఏఐసీటీఈ.. ఈసారి 228 కాలేజీల్లోని 1,14,117 సీట్లకే అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతులు ఇచ్చిన కాలేజీలు, సీట్ల వివరాలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖకు పంపించింది.
మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో కాలేజీల మూత
రాష్ట్రంలో పాత రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని 14 కాలేజీలు మూతపడ్డాయి. గతేడాది ఈ కాలేజీలు కొనసాగినా.. ఈసారి అనుమతులు రాలేదు. నల్లగొండ జిల్లాలో గతేడాది 26 ఇంజనీరింగ్ కాలేజీలుంటే ఈసారి 21 కాలేజీలకే అనుమతులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో కాలేజీల సంఖ్య 119 నుంచి 113కు, ఖమ్మం జిల్లాలో 18 నుంచి 15 కాలేజీలకు పరిమితమయ్యాయి. మిగతా జిల్లాల్లో అన్ని కాలేజీలకు అనుమతులు ఇచ్చినా సీట్ల సంఖ్యలో మాత్రం కోత పడింది.
జేఎన్టీయూ ‘గుర్తింపు’లో మరింత కోత!
ఇంజనీరింగ్ కాలేజీల్లో పది వేల సీట్లకు ఏఐసీటీఈ కోత విధించగా... రాష్ట్రంలో కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సిన జేఎన్టీయూ చర్యలతో మరిన్ని సీట్లు తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్ కాలేజీల పరిధిలో 1.24 లక్షల సీట్ల భర్తీకి ఏఐసీటీఈ అనుమతించినా... జేఎన్టీయూ సహా రాష్ట్ర వర్సిటీలు 97,961 సీట్ల భర్తీకే అనుబంధ గుర్తింçపు ఇచ్చాయి. అయితే కాలేజీల్లో వరుసగా మూడేళ్ల పాటు 25 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలకు గుర్తింపు రద్దు చేస్తామని జేఎన్టీయూ ఇటీవల ప్రకటించింది. దీంతో మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. జేఎన్టీయూ ఇప్పటికే ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్‌ఎఫ్‌సీ)’ఆధ్వర్యంలో కాలేజీల్లో తనిఖీలు చేపట్టి.. నివేదికలను క్రోడీకరించింది. అందులో ఏయే కాలేజీల్లోని, ఏయే బ్రాంచీల్లో 25 శాతంలోపు సీట్లు భర్తీ అయ్యాయని పరిశీలిస్తోంది. అలా గుర్తించిన బ్రాంచీలను రద్దు చేయనుంది. మొత్తంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఈనెల 15వ తేదీలోగా అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రకటించనుంది.
పాలిటెక్నిక్‌లో 4వేల సీట్ల తగ్గింపు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ నాలుగు వేల సీట్లకు ఏఐసీటీఈ కోత విధించింది. పలు కాలేజీలకు అనుమతులు కూడా రద్దు చేసింది. గతేడాది రాష్ట్రంలో 201 కాలేజీల్లో 51,625 సీట్లు అందుబాటులో ఉండగా... ఈసారి 187 కాలేజీల్లో 47,264 సీట్లకు అనుమతులు వచ్చాయి. డి.ఫార్మసీలో మాత్రం గతేడాది అనుమతించిన 15 కాలేజీల్లోని 830 సీట్లకు ఈసారి కూడా పూర్తిగా అనుమతి ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment