నువ్వు ఒక అంబాసిడర్ కారు కొనడానికి వెళ్లావు.. పక్కన బెంజ్ ఉంది.. నువ్వేం కొంటావ్.. నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్లావ్.. పక్కన ఓ పెద్ద ప్లాస్మా టీవీ ఉంది.. నువ్వేం కొంటావ్.. అక్క అంబాసిడర్.. నేను బెంజ్.. అది పోర్టబుల్.. నేను ప్లాస్మా.. అది లైఫ్‌బాయ్.. నేను లక్స్..
ఇది ఓ ఫేమస్ చిత్రంలోని సన్నివేశం.. ప్రస్తుతం ఇంజనీరింగ్ జాబ్ మార్కెట్ పరిస్థితీ ఇలాగే ఉంది.. అందరికీ కావాల్సింది స్మార్ట్ టీవీలే. కానీ మన కాలేజీలు ఇంకా ఆ పాత పోర్టబుల్ టీవీలనే ఇస్తున్నాయి.. తప్పెవరిది?? శిక్షెవరికి??చింతకింది గణేశ్
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న కోర్సులు ఇంజనీరింగ్ విద్యలో రావట్లేదు. మన దేశంలో, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో గతంలో ప్రవేశ పెట్టిన కోర్సులు మినహా మార్కెట్ అవసరాలకు మేరకు ఒక్క కోర్సునూ ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. దీంతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఆశించిన మేర లభించట్లేదు. దేశవ్యాప్తంగా ఏటా 17 లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరు తుంటే, రాష్ట్రంలో 90 వేల మంది చేరుతున్నారు. రాష్ట్రంలో ఏటా 65వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు బయటకొస్తున్నా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్న వారు 27 శాతానికి మించి ఉండట్లేదు. అందుకే ఇంజనీరింగ్ విద్యలో రీఇంజనీరింగ్ అవసరం ఏర్పడింది. మార్కెట్ అవసరాల మేరకు ఈ విద్యలో సమూల మార్పులు తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపునకు కేంద్రం చర్యలు చేపడుతున్నా.. రాష్ట్రంలో ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఇంజనీరింగ్ అంటే విలువలేని పరిస్థితి వస్తోంది.
డిమాండున్న కోర్సులు అనేకమున్నా..
ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో డిమాండ్ ఉన్న కోర్సులు అనేకం ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ అండ్ రొబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి అనేక కోర్సులకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రముఖ కంపెనీలన్నీ దృష్టిసారించాయి. సివి ల్, మెకానికల్ రంగాల్లో కూడా అనేక మార్పులొచ్చాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. అయినా అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యలో మార్పులు తీసుకురావడంలో యూనివర్సిటీలు విఫలమవుతున్నాయి.
కంటిన్యూడ్ ఇండస్ట్రీ డిజిటైజేషన్..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు కంటిన్యూడ్ ఇండస్ట్రీ డిజిటైజేషన్ టెక్నాలజీని అనుసరిస్తు న్నాయి. అగ్‌మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), త్రీడీ స్కానింగ్ అండ్ ప్రిటింగ్ వంటి వాటిని అమలు చేస్తున్నాయి. అయినా వీటిపై ప్రత్యేక బీటెక్ కోర్సులు లేవు.
క్లౌడ్ కంప్యూటింగ్..
మెజారిటీ కంపెనీలన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీని వినియోస్తున్నాయి. ఏఆర్, వీఆర్ అండ్ ఇమ్మర్సివ్ ఆర్కిటెక్చర్ విధానం ప్లానింగ్ రంగంలో కీలకంగా మారింది. బిగ్ డేటా అనాలిసిస్, ఆర్కిటెక్చర్ రొబోట్స్, త్రీడీ ప్రింటింగ్ కూడా కీలకంగా మారాయి. ఇందులో కొన్ని వివిధ కోర్సుల్లో ఓ సబ్జెక్టుగానే ఉన్నాయి తప్ప కోర్సులుగా ఎక్కడా లేవు. మన రాష్ట్రంలో అయితే అవేవీ సబ్జెక్టుగా కూడా లేవు.
ఏఐపై ప్రత్యేక దృష్టి
ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. దేశంలోనే మొదటిసారిగా వచ్చే విద్యా సంవత్సరంలో ఏఐను బీటెక్ కోర్సుగా ప్రవేశ పెట్టేందుకు హైదరాబాద్ ఐఐటీ చర్యలు చేపట్టింది. దేశంలోని మరే విద్యా సంస్థ కూడా ఆ దిశగా అడుగులు వేయట్లేదు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలే కొన్ని కోర్సులకు సర్టిఫికెట్ ఇస్తూ వాటిని నేర్చుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. విద్యా సంస్థలు మాత్రం ఆ దిశగా కసరత్తు చేయట్లేదు. మైక్రోసాఫ్ట్ దేశవ్యాప్తంగా 10 పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసి ఏఐపై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. డేటా సైన్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటెలిజెంట్ క్లౌడ్ హబ్ వంటి అంశాల్లో వచ్చే మూడేళ్లలో 5 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ పరిజ్ఞానాన్ని 700కు పైగా కంపెనీలు వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బీటెక్ డిగ్రీలతో పాటు వీటన్నింటినీ ప్రత్యేకంగా ప్రవేశపెడితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్థానిక అవసరాల మేరకు..
రాష్ట్రంలో 198 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో 95,235 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 72 వేల సీట్లే భర్తీ అవుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో సీట్ల భర్తీ క్రమంగా తగ్గిపోతోంది. ఏటా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బయటకొస్తున్న 65 వేల మంది గ్రాడ్యుయేట్లలో 27 శాతం మందికే ఉపాధి లభిస్తుండగా మిగతా వారంతా నిరుద్యోగులుగానే మిగులుతున్నారు. రాష్ట్రంలో ఫార్మా, సిమెంట్, ఐటీ, ఆటోమొబైల్, కన్‌స్ట్రక్షన్, మైన్స్ అండ్ మినరల్స్, టెక్స్‌టైల్స్ అండ్ అపెరల్స్, హార్టికల్చర్, పౌల్ట్రీ రంగాలు అధికంగా ఉన్నా వాటి అవసరాలకు అనుగుణంగా కోర్సులను రీడిజైన్ చేసి విద్యార్థులను అందించడంలో యూనివర్సిటీలు విఫలం అవుతున్నాయి. రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టు పనుల్లో దాదాపు 2 వేల మందికి పైగా ఇంజనీర్లు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే పని చేస్తుండటం గమనార్హం.
ఇదే సరైన సమయం..
ఇంజనీరింగ్‌లో కొత్త ఇంటర్న్‌షిప్ పాలసీని అమల్లోకి తేవాలని ఏఐసీటీఈ స్పష్టం చేసిన నేపథ్యంలో కోర్సుల రీఇంజనీరింగ్‌కు చర్యలు చేపట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా కోర్సుల రీడిజైన్‌తో పాటు స్థానికంగా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సులను తీర్చిదిద్దాలని చెబుతున్నారు. అప్పుడే రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలకు మెరుగవుతాయని పేర్కొంటున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 600–700 గంటల ఇంటర్న్‌షిప్‌ను ఇటీవల ఏఐసీటీఈ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో స్కిల్స్‌ను పెంపొందించడంతో పాటు పారిశ్రామిక అవసరాలపై పక్కాగా నేర్చుకునేలా ఇంటర్న్‌షిప్ అమలు చేయాలని చెబుతున్నారు. కమ్యూనికేషన్, ఇంట్రాపర్సనల్ రిలేషన్స్, ప్రాబ్లం సాల్వింగ్, డిసిషన్ మేకింగ్, టైం మేనేజ్‌మెంట్, సెల్ఫ్ మోటివేషన్ నైపుణ్యాలను, టెక్నికల్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, టైమ్ మేనేజ్‌మెంట్, న్యూమరికల్ స్కిల్స్ కచ్చితంగా నేర్పించేలా సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. ఇటీవల వెల్లడైన ఇండియా స్కిల్ రిపోర్టు–2019లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్‌లోనూ రెండో స్థానంలో ఉన్న తెలంగాణ విద్యార్థులు మిగతా వాటిన్నింటిలో వెనుకబడే ఉన్నారు.
పట్టించుకోని వర్సిటీలు..
మార్కెట్, ఇండస్ట్రీ అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు సిలబస్‌లో మార్పులు తీసుకురావాల్సిన యూనివర్సిటీలు ఆ పని మానేశాయి. ఉస్మానియా, జేఎన్‌టీయూలు కేవలం కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలుగానే మిగిలిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పరిశ్రమల అవసరాల మేరకు కోర్సుల రీఇంజనీరింగ్‌ను పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తామే కోర్సులను రీడిజైన్ చేసుకుని అనుమతివ్వాలని కొన్ని ప్రైవేటు కాలేజీలు కోరినా.. ‘యూనివర్సిటీ కాలేజీల్లోనే లేదు.. మీకెలా అనుమతిస్తాం’అంటూ తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. పీజీ ఇంజనీరింగ్‌లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్సును ప్రవేశ పెట్టేందుకు సిలబస్ రూపొందించుకొని ఓ కాలేజీ అనుమతి కోరినా యూనివర్సిటీ ఇవ్వలేదు. దీంతో ఆ కోర్సును ఆ కాలేజీ ప్రవేశపెట్టలేని పరిస్థితి నెలకొంది.
ఇంజనీరింగ్ రూపురేఖలు మార్చే కోర్సులివే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఆటోమేషన్ అండ్ రొబోటిక్స్
క్లౌడ్ కంప్యూటింగ్
మిషన్ లెర్నింగ్
డిజిటల్ ఎలక్ట్రానిక్స్
బ్లాక్ చైన్ టెక్నాలజీ
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
బిగ్ డేటా అనలిటిక్స్
ఇకనైనా మారిస్తే మేలు: కృష్ణారావు, చైర్మన్, స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీ
ఇకనైనా యూనివర్సిటీల తీరు మారాలి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో మార్పులు తేవాలి. వీలైతే విద్యార్థులకు మొదటి ఏడాది కోర్సుకు సంబంధించి పరిశ్రమల్లోనే పని చేసేలా చర్యలు చేపట్టాలి. లేదంటే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రీడిజైన్ చేయాలి.
అవసరం లేనపుడు ఎలా వస్తారు: నర్సింహారెడ్డి, ఉన్నత విద్యా మండలి పాలక మండలి సభ్యుడు
నల్లగొండలో యాభైకి పైగా సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ఇంజనీరింగ్‌కు సంబంధించి యూనివర్సిటీలో సమావేశమైన ప్రతిసారి వారిని ఆహ్వానించినా వారు రావట్లేదు. ఒకసారి అడిగితే ‘మా పరిశ్రమకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో సిలబస్ లేదు.. మేమొచ్చి ఏం చేయాలి.. మీరు చెప్పే చదువు చదువుకునే విద్యార్థులు మాకు పనికి రారు.. అలాంటపుడు వచ్చి చేసేదేముంది’అని పేర్కొన్నారు.
మార్పులపై ప్రభుత్వానికి నివేదిస్తాం: తుమ్మల పాపిరెడ్డి, చైర్మన్ ఉన్నత విద్యా మండలి
ప్రస్తుతం రాష్ట్రంలోని కాలేజీల్లో అమలు అవుతున్న ఇంజనీరింగ్ విద్య స్థితి గతులను ప్రభుత్వానికి నివేదిస్తాం. జాతీయంగా, అంతర్జాతీయంగా, స్థానిక అవసరాల మేరకు సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై చర్చిస్తాం. రాష్ట్ర యువతకు నైపుణ్యాల పెంపుదలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతాం.
– దేశవ్యాప్తంగా ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యం ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 57 శాతమే. అంటే మరో 43 శాతం మందికి నైపుణ్యాల్లేవు. ఇందులో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 42 శాతం మందిలోనే ఉద్యోగార్హ నైపుణ్యాలున్నాయి. 58 శాతం మందిలో ఆ నైపుణ్యాలు లేవు. ఇండియా స్కిల్ రిపోర్టు–2019 వెల్లడించిన వాస్తవాలివీ.
– చదువుతున్న చదువుకు పారిశ్రామిక అవసరాలకు సంబంధం లేకపోవడం, అవి కోరుకునే విద్యను ఇంజనీరింగ్ కాలేజీలు అందించకపోవడంతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ముందుకు రావట్లేదు. ఫలితంగా ఐటీ, ఐటీ సంబంధ రంగాలు మినహా మిగతా రంగాల్లో ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించట్లేదు. ఏఐసీటీఈ సర్వేలో వెల్లడైన అంశాలివీ..
Comments
Please login to add a commentAdd a comment