జిల్లా పోలీసు యంత్రాంగం శాసనసభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించే పనిలో నిమగ్నమైంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఆ శాఖ.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిపేందుకు.. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట ప్రణాళికలు రూపొందించి.. అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి.. భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పోలింగ్ బూత్‌లవారీగా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పూనుకుంది.
సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో మొత్తం 1,303 పోలింగ్ బూత్‌లు ఉండగా.. కొత్తగా మరో మూడు బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇటీవల ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టగా.. పెరిగిన ఓటర్లను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు వాటిని ఏర్పాటు చేశారు. రెండు పోలింగ్ బూత్‌లను ఖమ్మం నియోజకవర్గంలో.. ఒకటి పాలేరు నియోజకవర్గం లోనూ ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో 1,306 బూత్‌లున్నట్లు అయింది. ఈ లెక్క ప్రకారం ఖమ్మంలో 296 పోలింగ్ బూత్‌లు, పాలేరు 266, మధిర 251, వైరా 229, సత్తుపల్లిలో 264 పోలింగ్ బూత్‌లున్నాయి. మొత్తం పోలింగ్ బూత్‌లను పరిశీలించిన అనంతరం సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు.
342 సమస్యాత్మక కేంద్రాలు
జిల్లాలో మొత్తం 342 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో సమస్యాత్మకం, అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను లెక్కించిన అధికార యంత్రాంగం ఈసారి సమస్యాత్మక బూత్‌లను మాత్రమే గుర్తించింది. గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు, ఘర్షణల ఆధారంగా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 342 సమస్మాత్మక కేంద్రాల్లో ఖమ్మం నియోజకవర్గంలో 65, పాలేరు 93, మధిర 69, వైరా 49, సత్తుపల్లి 66 ఉన్నాయి. వీటిలో...అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 93 పోలింగ్ బూత్‌లున్నాయి. ఈ నియోజకవర్గంలో గతంలో పలు సంఘటనలు జరగడం వల్ల వీటిని సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల జాబితాలో చేర్చారు.
కూసుమంచి మండలం చేగొమ్మ, పోచారం, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు, ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు, ముత్తగూడెం తదితర గ్రామాల్లో గతంలో ఎన్నికల సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఈ పోలింగ్ బూత్‌లను సమస్యాత్మక కేంద్రాల పరిధిలోకి తెచ్చారు. పాలేరు తర్వాత మధిర, సత్తుపల్లి, ఖమ్మం కేంద్రాల్లో సమస్యాత్మక కేంద్రాలున్నట్లు గుర్తించారు. వైరా నియోజకవర్గంలో తక్కువగా 49 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతోపాటు సాధారణ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ యంత్రాంగంతోపాటు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు.
గట్టి నిఘా ఏర్పాటు..
జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 342 పోలింగ్ బూత్‌లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి నుంచే అక్కడ చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే బైండోవర్లను ముమ్మరం చేశారు. ఇక సమస్యాత్మక కేంద్రాలున్న ప్రాంతాల్లో బైండోవర్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎన్నికలకంటే ముందు నుంచి పోలీస్ బందోబస్తును పటిష్టం చేశారు. ఎప్పటికప్పుడు పోలీసుల నిఘా.. పర్యవేక్షణ ఉండేలా చూస్తున్నారు. అలాగే ఘర్షణలు జరగకుండా అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment