రాహుల్‌ వస్తుండు..  | Telangana Elections Rahul Chandrababu Naidu Joint Campaign He's Coming To Khammam | Sakshi
Sakshi News home page

రాహుల్‌ వస్తుండు.. 

Published Sun, Nov 25 2018 7:37 AM | Last Updated on Sun, Nov 25 2018 7:37 AM

Telangana Elections Rahul Chandrababu Naidu Joint Campaign He's Coming To Khammam - Sakshi

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ

సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల 28వ తేదీన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఈ మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రజాకూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సైతం సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌ శ్రేణులు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా జన సమీకరణపై దృష్టి పెట్టాయి. వాస్తవానికి రాహుల్‌గాంధీ గత నెల 27న జిల్లాలో పర్యటిస్తారని ప్రచారం జరిగింది.

ఆ పర్యటన అప్పుడు వాయిదా పడడం, ఈనెల 23వ తేదీన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడంతో మలివిడత పర్యటనలో రాహుల్‌గాంధీ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. తొలుత 28న సోనియాగాంధీ జిల్లాలో పర్యటిస్తారని ప్రచారం జరిగింది. ఈ మేరకు అధికారికంగా పర్యటన సైతం ఖరారవుతుందని కాంగ్రెస్‌ వర్గాలు భావించాయి. అయితే అనూహ్యంగా 28వ తేదీన రాహుల్‌గాంధీ జిల్లా పర్యటన ఖరారు కావడంతో కాంగ్రెస్‌ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ ఖమ్మం జిల్లా పర్యటనలో బహిరంగ సభకు బదులుగా ఖమ్మం నగరంతోపాటు పలు ప్రాంతాల్లో రాహుల్‌తో రోడ్‌షోలు నిర్వహించాలని భావించి.. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నించారు.

అయితే భద్రతా కారణాల వల్ల రోడ్‌షోకు అనుమతి లభించే అవకాశం లేదని భావిస్తున్న కాంగ్రెస్‌ నేతలు బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5గంటలకు ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసే హెలిప్యాడ్‌కు హెలీకాప్టర్‌ ద్వారా చేరుకోనున్న రాహుల్‌ పక్కనే ఉన్న ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి ప్రజాకూటమి తరఫున పోటీ చేస్తున్న ఖమ్మం టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుతోపాటు జిల్లా కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లపై దృష్టి సారించారు.

ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాల నుంచి వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను రాహుల్‌గాంధీ వేదికపై నుంచి పరిచయం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాహుల్‌ పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో శనివారం కాంగ్రెస్‌ నేతలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, శాసన మండలి ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు జిల్లాలో పర్యటించి.. రాహుల్‌ పర్యటనకు జన సమీకరణపై దృష్టి పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement