రాహుల్‌గాంధీ సభ కోసం ముస్తాబవుతున్న ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ పీజీ కళాశాల మైదానం గ్రౌండ్‌ను పరిశీలిస్తున్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రజాకూటమి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం హాజరుకానున్న సభ నిర్వహణ కోసం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ కళాశాల గ్రౌండ్‌లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా రాహుల్ జిల్లాకు వస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నాయి. కాంగ్రెస్‌తోపాటు ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలు జన సమీకరణపై దృష్టి సారించి.. నియోజకవర్గాలవారీగా బాధ్యులను నియమించి.. సభ విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఏఐ సీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్రు కుంతియా మంగళవారం మధ్యాహ్నం హెలీకాప్టర్ ద్వారా ఖమ్మం చేరుకుని రాహుల్‌గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
అలాగే టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు సభ ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాహుల్‌గాంధీ ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు హెలీకాప్టర్ ద్వారా వచ్చి.. సమీపంలోని బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు. రాహుల్‌తోపాటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు పాల్గొననున్నారు.
రాహుల్, చంద్రబాబుకు స్పెషల్ కేటగిరీ భద్రత ఉండడంతో సభ ఏర్పాట్లను సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించారు. ఏర్పాట్లు జరుగుతున్న తీరు.. సభా ప్రాంగణానికి ఎటువైపు నుంచి రాహుల్ చేరుకుంటారు.. ఎంతసేపు ఉంటారు.. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి ఎటువైపు నుంచి ప్రధాన ద్వారం ఇచ్చారనే అంశాలను సీపీ పరిశీలించారు. సభకు సంబంధించి ప్రత్యేక భద్రతా అధికారులు ఇప్పటికే ఖమ్మం చేరుకున్నారు. రాహుల్‌గాంధీ మధ్యాహ్నం 2.30 గంటలకు ఖమ్మం చేరుకుని.. 4 గంటల వరకు సభలో పాల్గొని.. ప్రసంగించి హెలీకాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
రాహుల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతోపాటు అడుగడుగునా రక్షణ చర్యలు చేపట్టారు. రాహుల్‌గాంధీ సభ విజయవంతం కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐలు సైతం జనసమీకరణపై దృష్టి సారించాయి. అలాగే టీడీపీ నేత నామా నాగేశ్వరరావు సభ ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment