తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ల కేటాయింపు జరిగి నెల రోజులు కావస్తున్నా పార్టీలో అంతర్గతంగా తలెత్తిన అసమ్మతి కొలిక్కి రావడం లేదు. ఇతర పార్టీల నుంచి రాజకీయ వలసలు కూడా ఆశించిన రీతిలో జరగడం లేదు. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు, క్రియాశీల నాయకులు పార్టీని వీడుతున్నారు. సొంత గూటిలో అసమ్మతిని సర్దుబాటు చేసే బాధ్యతను పార్టీ అభ్యర్థులకు అప్పగించినా ఫలితం కనిపించడం లేదు. దీంతో అప్రమత్తమైన పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో అసమ్మతి సెగను ఆర్పే బాధ్యతను ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో టీఆర్‌ఎస్‌లో అంతర్గత అసమ్మతితో పాటు రాజకీయ వలసలు ఆందోళన కలిగిస్తున్నాయి. పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్య నేతలు నలుగురు ఒకే రోజు కాంగ్రెస్ గూటికి చేరడం చర్చనీయాంశమైంది. అందోలులో టికెట్ దక్కని తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ బీజేపీలో చేరారు. సంగారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎంపీపీ రాజేశ్వర్ రావు దేశ్‌పాండే బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో గ్రామస్థాయి నాయకులు కాంగ్రెస్‌లో చేరినా, మరుసటి రోజే టీఆర్‌ఎస్ గూటికి
చేరుకున్నారు. నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు పార్టీ అభ్యర్థుల వెంట ప్రచార పర్వంలో కనిపించడం లేదు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం పట్టాలెక్కలేదు. మరోవైపు గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాణిక్‌రావుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అవకాశం ఇవ్వకూడదంటూ కొందరు నేతలు తెగేసి చెబుతున్నారు.
అసెంబ్లీ రద్దు ప్రకటన రోజే పార్టీ అభ్యర్థులను ప్రకటించినా, నెల రోజులుగా పార్టీలో నెలకొన్న అసమ్మతి సర్దుబాటు కావడం లేదు. అసమ్మతి నేతలతో మంతనాలు జరిపి సర్దుబాటు చేసుకోవాల్సిందిగా పార్టీ అభ్యర్థులకు సూచించింది. అభ్యర్థులతో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పలు దఫాలుగా భేటీ జరిపి సూచనలు చేసినా క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా అసమ్మతి సర్దుబాటు కాకపోవడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది.
రంగంలోకి మంత్రి హరీశ్‌రావు
నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని ప్రత్యేక బృందాలు, సర్వే టీంలతో పార్టీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ప్రత్యేక బృందాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అసమ్మతిని సర్దుబాటు చేసే బాద్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. నర్సాపూర్‌లో జెడ్పీ చైర్మన్ రాజమణి మురళీయాదవ్, జెడ్పీటీసీ సభ్యులు కమలాబాయి, జయశ్రీ, ఇతర అసంతృప్త నేతలతో మంత్రి మాట్లాడారు. పార్టీ అభ్యర్థి మదన్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొనేలా సయోధ్య కుదిర్చారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్‌తోనూ మంతనాలు జరిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉంటున్న నేతలతో మరోమారు సమావేశం కావాలని మంత్రి నిర్ణయించారు. సిద్దిపేట, గజ్వేల్, మెదక్, దుబ్బాక నియోజకవర్గాల్లో పెద్దగా అసమ్మతి బెడద లేకున్నా, స్థానికంగా సమన్వయం ఉండేలా చూసుకోవాలని మంత్రి హరీశ్‌రావు పార్టీ నేతలకు జాగ్రత్తలు చెబుతున్నారు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో అసమ్మతి గళం వినిపించడం లేదు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాణిక్‌రావుకు మరోమారు అవకాశం ఇవ్వొద్దంటూ స్థానిక నేతలు హరీశ్ వద్దకు బారులు తీరుతున్నారు. దీంతో మాణిక్‌రావు, నరోత్తమ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
చేరికలపై ప్రత్యేక వ్యూహం
ఓ వైపు పార్టీలో నెలకొన్న అసమ్మతిని సర్దుబాటు చేస్తూనే, ఎదుటి పార్టీల నుంచి ముఖ్య నేతలను టీఆర్‌ఎస్ గూటికి చేర్చేందుకు హరీశ్ వ్యూహ రచన చేస్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకునే దిశగా చర్చలు సాగుతున్నాయి. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ముఖ్యులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్‌లోనూ ఇద్దరు ముఖ్య నేతలతో చర్చలు సఫలం అయితే, ఓ ప్రధాన సామాజిక వర్గం ఓటర్లు పార్టీ వైపు మొగ్గు చూపుతారనే అంచనాతో హరీశ్ ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు తర్వాత తలెత్తే పరిణామాలను విశ్లేషించుకుంటూ, చేరికల వ్యూహాన్ని అమలు చేయాలనే ఆలోచనలో మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ‘మన ప్రచారాన్ని చురుగ్గా సాగిస్తూనే, ఎదుటి పార్టీ కదలికలపైనా కన్నేయాలని’ పార్టీ అభ్యర్థులకు హరీశ్‌రావు సూచనలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment