సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమైన జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తదితరులు
పీఆర్‌సీ అమలుపై తెలంగాణ ఉద్యోగుల్లో భారీ ఆశలు
69 శాతం ఫిట్‌మెంట్ కావాలని డిమాండ్
కనీసం 49 శాతమిచ్చినా నాలుగు ఇంక్రిమెంట్లకు అవకాశం
2014 జనవరి నుంచి నగదు రూపంలో వర్తింపజేయాలి
కనీస వేతనం 15 వేలు, గ్రాట్యుటీ 15 లక్షలకు పెంచాలి
సచివాలయంలో ఉద్యోగ సంఘాల భేటీలో చర్చ
17న హైపవర్ కమిటీతో సమావేశానికి సమాయత్తం
చింతకింది గణేశ్: పదో పీఆర్‌సీ అమలులో భాగంగా ఫిట్‌మెంట్ బెనిఫిట్‌ను భారీగా సాధించుకునే దిశగా తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. 69 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వంతో చర్చల సందర్భంగా 49 శాతమైనా సాధించుకోవాలన్న యోచనలో ఉన్నాయి. అది కూడా సాధ్యంకాని పక్షంలో 43 శాతానికంటే తగ్గేది లేదని ఉద్యోగులు భీష్మించుకున్నారు. తద్వారా సర్వీసులో ఉన్న ఒక్కో ఉద్యోగికి అదనంగా మూడు ఇంక్రిమెంట్లు వస్తాయి. పదో పీఆర్‌సీ కమిషనర్ అగర్వాల్ మాత్రం 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేశారు. దాని ప్రకారమే కొత్త వేతనాలను నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే దాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయిస్తే 34 శాతం వరకైనా ఉద్యోగులకు పెద్దగా ప్రయోజనం ఉండదు. 35 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే మాత్రం ఒక ఇంక్రిమెంట్ లభిస్తుంది. అదే 37 నుంచి 42 శాతం వరకు ఇస్తే మరొక ఇంక్రిమెంట్(రెండోది) లభిస్తుంది. 43 శాతమైతే మూడు... అదే 49 శాతం అయితే నాలుగు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అయితే ప్రభుత్వం ఈ స్థాయిలో ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ర్ట ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 37 శాతంలోపే ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.
9వ పీఆర్‌సీలో అప్పటి ప్రభుత్వం 39 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చింది. దీంతో ఈసారి తక్కువలో తక్కువ 43 శాతమైనా ఇవ్వాల్సిందేనని ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి. కాగా, పీఆర్‌సీని ఎప్పటి నుంచి వర్తింపజేస్తారన్నది కూడా కీలకమేకానుంది. 2013 జూలై 1 నుంచే పీఆర్‌సీని నగదు రూపంలో వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. మరీ కాదంటే చివరకు 2014 జనవరి 1 నుైంచె నా అమలుకు ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఉద్యోగులు భావిస్తున్నారు.
ఫిట్‌మెంట్‌పై తగ్గేది లేదు..
ఈ నెల 17న హైపవర్ కమిటీతో పీఆర్‌సీ అంశంపై చర్చించడానికి వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. 69 శాతం ఫిట్‌మెంట్ కోసమే పట్టుపట్టాలని ఉద్యోగ నేతలు భావిస్తున్నారు. ఉద్యోగులకు కడుపునిండా పీఆర్‌సీ ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు హామీ ఇచ్చిన నేపథ్యంలో వారు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పీఆర్‌సీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి, పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, టీజీవో కార్యదర్శి సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు నరేందర్‌రావు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి, ఎస్టీయూ అధ్యక్ష ప్రధానకార్యదర్శులు రాజిరెడ్డి, భుజంగరావు, పీఆర్‌టీయూ తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఫిట్‌మెంట్‌ను భారీగా సాధించుకోవాల్సిందేనని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఇక కుటుంబానికి ముగ్గురినే పరిగణనలోకి తీసుకుని కనీస వేతనం రూ. 13 వేలుగా నిర్ధరించారని, నలుగురు సభ్యులను పరిగణనలోకి తీసుకొని రూ. 15 వేలు చేయాలని సర్కారును కోరనున్నారు. గ్రాట్యుటీని 15 లక్షలకు పెంచాలని కూడా డిమాండ్ చేయనున్నారు. వెయిటేజీ ఇంక్రిమెంట్లను ప్రతి ఐదేళ్లు, పదేళ్లు, 15 ఏళ్లకు ఒకటి చొప్పున ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌ఏ పెంచాలని కూడా డిమాండ్ చేయనున్నారు.