బొగ్గు బ్లాక్‌లపై టీజెన్‌కో ఆరా
* సాధ్యాసాధ్యాల పరిశీలన
* జనవరి 15 వరకు తుది గడువు
* దక్కించుకునేందుకు సింగరేణి ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు రద్దుచేసిన బొగ్గు బ్లాక్‌లపై తెలంగాణ జెన్‌కో ఆరా తీస్తోంది. రద్దయిన బొగ్గు బ్లాక్‌లకు త్వరలోనే ఈ-వేలం విధానంలో టెండర్లు పిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ఏడింటిని విద్యుత్తురంగ సంస్థలకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయగడ్, జార్ఖండ్‌లోని సౌత్ క్రాన్‌పుర, మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి, ఒడిశాలోని ఎల్‌బీ వాలీ, పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్, బర్జోరా బ్లాక్‌లను విద్యుత్తు అవసరాలకు వినియోగించాలని టెండర్ షెడ్యూల్లో నిర్దేశించింది. కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాలకు భారీ మొత్తంలో బొగ్గు నిల్వలు అవసరమున్నందున ఈ బ్లాక్‌లను దక్కించుకునేందుకు తెలంగాణ జెన్‌కో ప్రయత్నాలు ప్రారంభించింది.
వీటిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే ఆయా రాష్ట్రాలకు వెళ్లి.. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. ఈ వేలంలో పాల్గొనేందుకు జనవరి 15 వరకు కేంద్రం గడువు విధించింది. దీంతో ఈలోగా క్షేత్రస్థాయి పరిస్థితులపై అందిన నివేదికల ఆధారంగా వేలంలో పాల్గొనాలా.. వద్దా.. అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు జెన్‌కో వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఏపీ జెన్‌కో సైతం అదే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు బొగ్గు బ్లాకుల రద్దు నిర్ణయంతో తెలంగాణ జెన్‌కో ఒక బ్లాక్‌ను కోల్పోయింది. కరీంనగర్ జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ రద్దయిన జాబితాలో ఉంది. గతంలో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏపీ జెన్‌కోకు కేటాయించింది. రాష్ట్ర పునర్విభజనలో ఇది తెలంగాణ జెన్‌కో ఖాతాలోకి వచ్చింది. ఈ బ్లాక్ నిర్వహణ, తవ్వకాల బాధ్యతను టీజెన్‌కో సింగరేణి కంపెనీకే అప్పగించింది. ఈసారి కూడా అదే పద్ధతిలో బ్లాక్‌లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
సిద్ధమవుతున్న సింగరేణి
మరోవైపు సింగరేణి సైతం ఈ బొగ్గు బ్లాక్‌లపై కన్నేసింది. తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్‌లన్నీ తమ సంస్థకే కేటాయించాలని నెల రోజుల కిందటే కేంద్ర ఇంధన శాఖకు లేఖ రాసింది. దీనికి తోడు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని కోల్ బ్లాక్‌లు అప్పగించాలనే ప్రతిపాదనలు పంపింది. బొగ్గు ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వరంగ సంస్థల్లో సింగరేణికి అపారమైన అనుభవం ఉంది. తాజా నిబంధనల ప్రకారం విద్యుత్తు ప్లాంట్లు ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొనాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి విద్యుత్తు ప్లాంట్ నిర్మిస్తుండటంతో.. ఈ వేలంలో పాల్గొనేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.