కోమటి బండ
సాక్షి, హైదరాబాద్ : అది అంతర్థాన దశలో ఉన్న అటవీ ప్రాంతం. వర్షాకాలంలో కొంచెం పచ్చగా కనిపించినా.. మిగిలిన కాలమంతా బీడు భూములను తలపించేది. అడవి సన్నబడటంతో వేటగాళ్లు జంతువుల మీద పడ్డారు. కుందేళ్లు, కొండ గొర్రెలు, నెమళ్లను వేటాడారు. బతకలేని జీవజాలం వలస వెళ్లిపోయింది. ఇలాంటి అడవికి కొత్త జవ సత్వాలు తొడిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని.. మొక్కలు పెంచింది. మొక్కలు ఎదగకుండా అడ్డం పడుతున్న పొదలను, తీగ జాతులను తీసివేసి గాలి, వెలుతురు సహజంగా అందేట్లు చేసింది. అధికారులు ఎండిపోయిన చెట్లను గుర్తించి వాటి స్థానంలో కొత్తవి నాటారు. మొత్తానికి అడవి çపునరుజ్జీవం పోసుకుంది. దట్టమైన చెట్లతో ఓ రూపం సంతరించుకుంది. వలస వెళ్లిపోయిన జీవజాలాన్ని మళ్లీ దగ్గరకు పిలుచుకుంది. అదే సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కోమటిబండ అటవీ ప్రాంతం. ఈ అడవే జిల్లా కలెక్టర్లకు పాఠ్యాంశమైంది. తెలంగాణలో అంతరించిపోతున్న సహజ అడవుల పునరుజ్జీవనానికి మార్గం చూపింది.
సేద్యం.. స్మగ్లింగ్.. కరువు..
గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ములుగు మండలం నర్సంపల్లి, వర్గల్ మండలం మీనాజీపెట, లింగాయపల్లి, మైలారం, వర్గల్, తున్కిఖల్సా, గజ్వేల్ మండలం కోమటిబండ, సంగాపూర్ ప్రాంతాల్లో మొత్తం 2,379 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. గతంలో దట్టమైన చెట్లతో విస్తరించి ఉన్న అడవిలో.. కుందేళ్లు, కొండగొర్రెలు, దుప్పులు, నెమళ్లు, పెద్ద పిట్ట, పౌడికంటి వంటి వివిధ రకాల జంతువులు, పక్షులు జీవనం చేసేవి. కాలక్రమేణా అడవి రూపు కోల్పోయింది. రైతులు అడవి భూము ల్లో సేద్యం చేయటం, స్మగ్లర్లు చెట్లను నరికి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేయటం, వరుస కరువులతో పూర్తి అంతర్ధాన దశకు చేరుకుంది.
సహజ, కృత్రిమ పునరుజ్జీవం..
సహజ పునరుజ్జీవం, (ఏఎన్‌ఆర్–యాడెడ్ నేచురల్ రీ జనరేషన్), కృత్రిమ పునరుజ్జీవం (ఏఆర్–ఆర్టిఫిషియల్ రీ జనరేషన్) పద్ధతిలో అడవిని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. సహజంగా పుట్టిన మొక్కలను సహజ వాతావరణంలోనే పెంచడాన్ని ఏఎన్‌ఆర్ అని, ఎండిపోయిన మొక్కలను డీ కంపోజ్ చేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటడాన్ని ఏఆర్ అని అంటారు. ఈ మేరకు గజ్వేల్ రేంజ్ పరిధిలో 439 హెక్టార్లలో ఏఎన్‌ఆర్, 370 హెక్టార్లలో ఏఆర్ విధానంలో మొక్కల పెంపకం చేపట్టినట్లు పీసీసీఎఫ్ పీకే ఝా వివరించారు. 2015–16లో 70 లక్షల మొక్కలు, 2016–17లో కోటి 21 లక్షలు, 2017–18లో కోటి 57 లక్షలు నాటినట్లు చెప్పారు. తొలి రెండేళ్లలో నాటిన మొక్కలు పెరిగి పెద్దయ్యాయి. దట్టమైన అడవి రూపుదిద్దుకుంటోంది. కొండ గొర్రెలు, నెమళ్లు, కుందేళ్లు, పక్షులు మళ్లీ వచ్చాయి.
కలెక్టర్ల అధ్యయనం..
కోమటిబండను సందర్శించాల్సిందిగా కలెక్టర్లను గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ప్లాంటేషన్ తీరుపై కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. నాలుగో విడత హరితహారంలో రాష్ట్రవ్యాప్తంగా కోమటిబండ సూత్రాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. అంతర్ధాన దశలో ఉన్న అడవులను గుర్తించి పునర్జీవం పోయాల ని నిర్ణయించారు. పండ్ల మొక్కలు తగ్గిపోవటంతో కోతులు వనాలు వదిలి ఊళ్ల మీద కు మళ్లాయని, తిరిగి వాటిని వనాల్లోకి పంపాలంటే సాధ్యమైనన్ని ఎక్కువ పండ్ల మొక్కలు నాటాలని భావించి ఆ మేరకు ప్రణాళికలు రూపొందించారు. కోతులు ఇష్టంగా తినే 25 రకాల పండ్ల మొక్కలను గుర్తించి నాటేందకు సిద్ధంగా ఉంచారు. ఈ ఏడాది 39.5 కోట్ల మొ క్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఖమ్మం జిల్లాలో అమలు
అంతర్థాన దశలో ఉన్న కోమటిబండ అడవిని ఏఎన్‌ఆర్, ఏఆర్ పద్ధతుల్లో దట్టమైన అడవిగా మార్చిన తీరు బాగుంది. ఖమ్మం జిల్లాలో కూడా అంతర్థాన దశలో ఉన్న అడవులను గుర్తించాం. హరితహారంలో అక్కడ ఏఎన్‌ఆర్, ఏఆర్ పద్ధతుల్లో ఆ అడవులకు పునరుజ్జీవం పోసేందుకు సిద్ధంగా ఉన్నాం.
–లోకేశ్ కుమార్, కలెక్టర్, ఖమ్మం
సహజ పునరుత్పత్తి బాగుంది
ములుగు నర్సరీ బాగుంది. కోమటిబండలో సహజ పునరుత్పత్తితో అడవిని కాపాడటం బాగుంది. అటవీ శాఖ అధికారులతో ఇంటరాక్షన్‌లో అనేక విషయాలు తెలిశాయి. కొత్తగూడెం ప్రాంతంలో అటవీ భూముల్లో బ్లాక్ ప్లాంటేషన్ చేయబోతున్నాం. ఇది కోమటిబండలోని ఏఆర్ తరహాలోనే ఉంటుంది.
– రాజీవ్ గాంధీ హనుమంతు,
కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం
ఫైర్ లైన్స్ ఆకట్టుకున్నాయి
ఫారెస్టు ప్రాంతంలో సహజంగా పుట్టిన మొక్కలకు శాస్త్రీయంగా గాలి, వెలుతురు అందే ఏర్పాట్లు చేశారు. వేసవిలో మంటలు చెలరేగితే పక్కకు వ్యాపించకుండా ఫైర్ లైన్స్ ఏర్పాటు చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ చక్కగా చేశారు. కిలోమీటర్ల కొద్ది మొక్కలకు రక్షణ గార్డులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నూటికి నూరుపాళ్లు సూర్యాపేట జిల్లాలో అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాం.
– సురేంద్ర మోహన్, కలెక్టర్, సూర్యాపేట
అటవీ అధికారుల కృషితోనే..
పక్కా ప్రణాళికతో కోమటిబండ ఫారెస్టును తిరిగి పూర్వ స్థితిలోకి తీసుకురాగలిగాం. ఫారెస్టు అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయం. ముందుగా అడవిలో తీగ జాతి మొక్కలను తొలగించాం. దీంతో సహజమైన చెట్టుకు ఎండ, వెలుతురు తగిలింది. ఎండిపోయిన చెట్లను తీసేసి కొత్త మొక్కలు నాటాం. ఈ ఏడాది జిల్లాలోని అటవీ భూముల్లో బ్లాక్ ప్లాంటేషన్‌పై దృష్టి పెట్టాం.
– వెంకట్రామిరెడ్డి, కలెక్టర్, సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment