
రబీకి నీళ్లు ఇచ్చేందుకు టీ-సర్కారు ఓకే
నాగార్జున సాగర్ నీటి సమస్య సమసిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రబీ సీజన్కు గాను నీళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. వచ్చే సీజన్లో ఆ మేరకు తాము నీళ్లు వాడుకుంటామని టీ సర్కారు తెలిపింది. రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు సమావేశమయ్యారు. అక్కడే ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా పవర్‌హౌజ్ ద్యారా 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం హెడ్ రెగ్యులేటర్ ద్యారా మరో 5వేల క్యూసెక్కుల నీటిని నాలుగో గేటు నుంచి అధికారులు విడుదల చేశారు. రెండు రాష్ట్రాల్లో రైతులు నష్టపోకుండా చూస్తామని మంత్రులు హరీశ్రావు, దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు.
పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. నీటి విడుదలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో ముందుకు వెళ్తారని చెప్పారు. డ్యాం పైకి రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నీటి విడుదల వ్యవహారాన్ని రెండు రాష్ట్రాలకు చెందిన ఈఎన్సీలు పర్యవేక్షిస్తారని దేవినేని ఉమా మహేశ్వరరావు, హరీశ్రావు తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించామన్నారు. భవిష్యత్తులో వరదలు వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా అంతా కలిసి పరిష్కరించుకుంటామని చెప్పారు.