లిక్కర్‌.. లిక్విడ్‌ క్యాష్‌ | Telangana Government Announces New Liquor Policy | Sakshi
Sakshi News home page

లిక్కర్‌తో ‘లిక్విడ్‌ క్యాష్‌’

Published Fri, Oct 4 2019 8:04 AM | Last Updated on Fri, Oct 4 2019 8:04 AM

Telangana Government Announces New Liquor Policy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా మద్యం విక్రయాలకు సంబంధించి లైసెన్స్‌ మార్గదర్శ కాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మద్యం దుకాణాల సంఖ్య పెంచకుండానే ఖజానా నింపే ప్రయత్నం చేసింది. గురువారం ఎక్సైజ్‌ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ మార్గదర్శకాలతో కూడిన జీవోలను విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం గతంలో నాలుగు శ్లాబుల్లో ఉన్న లైసెన్స్‌ ఫీజును ఆరు శ్లాబులుగా నిర్ధారించారు. ఈ ఆరు శ్లాబు ల్లోని నాలుగు శ్లాబుల్లో ఫీజును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచారు. తద్వారా లైసెన్స్‌ ఫీజు కింద ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరనుంది.

గతంలో ఉన్న టెండర్‌ ఫీజును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచారు. ఈ పెంపు ద్వారా కనీసం రూ.400 కోట్ల అదాయం అదనంగా రానుంది. ప్రతి షాపు ఏటా రూ.5 లక్షలు లెవీ కింద చెల్లించాలన్న నిబంధనతో మరో రూ.100 కోట్లకు పైగా రాబడి వస్తుంది. మొత్తం మీద లైసెన్స్‌ ఫీజులు, దరఖాస్తు ఫీజు, లెవీ, శ్లాబుల పెంపు ద్వారా మొత్తం రూ.2,320 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుందని అంచనా వేస్తున్నారు. ఫీజులు పెంచినా లైసెన్స్‌ హోల్డర్లకు కొంత వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా దరఖాస్తుతో పాటు ఇవ్వాల్సిన ధరావత్తు తొలగిం చారు. లైసెన్స్‌ ఫీజు మొత్తాన్ని గతంలో మూడు వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా, దాన్ని నాలుగు వాయిదాలకు పెంచారు. బ్యాంకు గ్యారంటీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో కూడా ఉదారతతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీర్లపై కమీషన్‌ 25 నుంచి 20 శాతానికి తగ్గించారు.

కొత్త మార్గదర్శకాలు

  • కొత్త లైసెన్స్‌ నవంబర్‌1 నుంచి అమల్లోకి వస్తుంది. 2021 అక్టోబర్‌ 31తో గడువు ముగుస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం షాపుల సంఖ్యను నిర్ధారించి డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తారు.
  • ప్రస్తుతమున్న 2,216 షాపులు కొనసాగుతాయి. షాపుల పరిధి, శ్లాబులను మార్పు చేసే అధికారం ఎక్సైజ్‌ కమిషనర్‌కు ఉంది. 
  • ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మద్యం విక్రయాలకు అనుమతిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రాత్రి 11 వరకు విక్రయించవచ్చు.
  • ఏటా లైసెన్స్‌ ఫీజు మొత్తానికి ఏడింతల విలువైన మద్యాన్ని అమ్ముకోవచ్చు. అంతకన్నా ఎక్కువ అమ్మకాలు జరపాలంటే వ్యాట్‌తో పాటు 8 శాతం టర్నోవర్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.
  • ఏటా రూ.5 లక్షలు లెవీ కింద చెల్లించాలి.
  • సాధారణ రకం మద్యానికి 27 శాతం, మధ్యతరహా, ప్రీమియం మద్యంపై 20 శాతం, బీర్లపై 20 శాతం కమిషన్‌ రిటైలర్‌కు ఉంటుంది. అయితే గతంలో బీర్లపై ఉన్న 25 శాతం కమీషన్‌ తగ్గించారు.
  • టెండర్‌ ఫీజు కింద రూ.2 లక్షలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు. దరఖాస్తుతో పాటు ఈఎండీ కింద ఎలాంటి ధరావత్తు అవసరం లేదు.
  • నాలుగు శ్లాబుల విధానాన్ని 6 శ్లాబులకు పెంచారు. లైసెన్స్‌ ఫీజు మొత్తాన్ని ఏటా 4 వాయిదాల్లో చెల్లించొచ్చు. గతంలో 3 వాయిదాలే ఉండేది. 
  • షాపులు నిర్వహించేందుకు మొదట లైసెన్స్‌ ఫీజులో నాలుగో వంతు చెల్లించాలి. మరో 6 నెలలకు బ్యాంకు గ్యారంటీలు లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సమర్పించాలి.
  • వైన్‌షాపులను వాకిన్‌ షాపుల తరహాలో నిర్వ హించాలంటే అదనంగా ఏటా రూ.5 లక్షలు కట్టాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement