హద్దులు దాటితే ఆపేస్తాం.. | Telangana Government Decide To Take Action On Clinical Trials Issue | Sakshi
Sakshi News home page

హద్దులు దాటితే ఆపేస్తాం..

Published Mon, Sep 30 2019 5:07 AM | Last Updated on Mon, Sep 30 2019 5:07 AM

Telangana Government Decide To Take Action On Clinical Trials Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రు ల్లో జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌పై వారంలో గా సమగ్ర తనిఖీలు చేపట్టాలని, అక్కడి రికార్డులను పరిశీలించాలని సర్కారు ఆదేశించింది. ఉల్లంఘన జరిగినట్లు తేలితే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నిబంధనల ప్రకారం క్లినికల్‌ ట్రయల్స్‌ నిలిపివేస్తామని తెలి పింది. క్లినికల్‌ ట్రయల్స్‌ల్లో రోగుల భద్రతే అత్యంత కీలకమని తెలిపింది. ఆస్పత్రికి వచ్చే సాధారణ రోగులు, అనారోగ్యంతో చేరే వారిపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరపకూడదని పేర్కొంది. నిలోఫర్‌లో ఉల్లంఘన జరిగినట్లు తేలితే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మార్గదర్శకాలతో కూడిన ఓ ప్రకటన జారీ చేశారు. స్వచ్ఛందంగా క్లినికల్‌ ట్రయల్స్‌ల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చే వారిని మాత్రమే అంగీకరించాలని స్పష్టం చేశారు. వారి సమ్మతిని తెలియజేసే పత్రాలు, ఆడియో విజువల్‌ రికార్డింగ్‌ వంటి అన్ని రకాల చట్టపరమైన విధానాలను అనుసరించడం ప్రయోగాలు చేసే వారి బాధ్యతన్నారు. అధికారులు రూపొందించిన కఠిన నిబంధనలను అనుసరించిన తర్వాతే పారదర్శకంగా ట్రయల్స్‌ నిర్వహించాలని తెలిపారు. నిలోఫర్‌పై ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ సోమవారం అన్ని రకాల పత్రాలను, రోగుల నుంచి తీసుకున్న సమ్మతి వివరాలను సేకరిస్తుందని చెప్పారు. ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

మార్గదర్శకాలిలా.. 
►క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో ఎథికల్‌ గైడ్‌లైన్స్‌ ఉన్నాయి. దాని ఆధారంగానే ఔషధ ప్రయోగాలు జరగాలి.
►ఎథిక్స్‌ కమిటీ  ప్రయోజనాలు, నష్టాలను అంచనా వేయాలి. ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశాలున్నాయా పరిశీలించాలి. అటువంటి ప్రమాదాలను తగ్గించే ప్రణాళికలను రూపొందించాకే ట్రయల్స్‌ చేయాలి.
►ప్రభుత్వ ఆస్పత్రుల్లో చట్టబద్ధంగా అనుమతించే క్లినికల్‌ ట్రయల్స్‌ మాత్రమే జరపాలి. 
►క్లినికల్‌ ట్రయల్స్‌పై వివాదాలు తలెత్తినప్పుడు విచారణ జరపడం తప్పనిసరి. నిలోఫర్‌ ఆస్పత్రిలో కూడా అటువంటి విచారణే జరుగుతుంది. క్లినికల్‌ ట్రయల్స్‌ల్లో పాల్గొనే వాలంటీర్ల భద్రత కోసం ఇలా చేస్తున్నాం.
►ఔషధ ప్రయోగాల్లో పాల్గొనేవారి నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. క్లినికల్‌ ట్రయల్స్‌ దేనిపై చేస్తున్నారో సమాచారాన్ని ఇవ్వాలి. క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనే వారు నిరక్షరాస్యులైతే, వారికి అవగాహన కల్పించి  సాక్షి సమక్షంలో సమ్మతి తీసుకోవాలి.
►క్లినికల్‌ ట్రయల్స్‌ జరపాలని కోరుకునే పరిశోధకుడు మొదట ఎథిక్స్‌ కమిటీకి, తర్వాత మెడికల్‌ సూపరింటెండెంట్‌ పైస్థాయికి పంపించాలి. ఆ తర్వాత క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ ఇండియాకు దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి మాత్రమే అనుమతి వస్తుంది.
►ట్రయల్స్‌ను ఆమోదించే ముందు పరిశోధన యోగ్యత, ప్రయోజనాన్ని నిర్ణయించాలి.
►దేశంలో నిబంధనలను ఐసీఎంఆర్‌ నిర్దేశిస్తుంది. ఒక క్లినికల్‌ ట్రయల్‌ను సమగ్రమైన వివరాలతోనే నిర్వహిస్తారు.
►ఎథిక్స్‌ కమిటీలు క్లినికల్‌ ట్రయల్స్‌కు ముందు ప్రాథమిక సమీక్ష చేయాలి.   ట్రయల్స్‌ జరుగుతున్నప్పుడు పర్యవేక్షించాలి. మానవులపై ట్రయల్స్‌ విషయంలో కఠినమై న నియంత్రణ చర్యలున్నాయి.
►ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి చెందిన ఎథిక్స్‌ కమిటీ నిలోఫర్‌లో చేసే క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతిచ్చినట్లు తేలింది.  భద్రతాచర్యల ను అనుసరిస్తున్నాయో లేదో తేల్చడానికి ముగ్గురు సభ్యుల కమిటీ వేశాం.  అది నివేదిక అందజేస్తుంది.
►క్లినికల్‌ ట్రయల్స్‌ను పర్యవేక్షించా లని అన్ని ఎథిక్స్‌ కమిటీలకు సూచించాలని నిర్ణయించాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement