డీఆర్‌డీవో గుడ్‌న్యూస్‌: కరోనా బాధితులకు కొత్త ఔషధం సిద్ధం | Emergency Approval For DRDOs Anti-Covid Drug 2-DG | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీవో గుడ్‌న్యూస్‌: కరోనా బాధితులకు కొత్త ఔషధం సిద్ధం

Published Sun, May 9 2021 2:41 AM | Last Updated on Sun, May 9 2021 2:40 PM

Emergency Approval For DRDOs Anti-Covid Drug 2-DG - Sakshi

1. పై ఫొటోలో ఆకుపచ్చ రంగువి ఆరోగ్యకరమైన కణాలు, ఎరుపురంగు చుక్కలు కరోనా వైరస్, నారింజ రంగులో మసకగా ఉన్నవి వైరస్‌ సోకి దెబ్బతిన్న కణాలు. 2–డీజీ ఇవ్వక ముందు వైరల్‌ లోడ్‌ ఎక్కువగా ఉంది. 
2. మందు ఇచ్చిన తర్వాత పరిశీలిస్తే వైరస్‌ లోడ్‌ చాలా వరకు తగ్గింది. 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో శుభవార్త చెప్పింది. కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ’ ఔషధాన్ని త్వరలో మార్కెట్లోకి తేనున్నట్టు ప్రకటించింది. కరోనా బాధితులపై నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో ‘2–డీజీ’ మంచి ఫలితాలు ఇచ్చిందని, ఈ మేరకు అత్యవసర వినియోగానికి ‘డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ)’అనుమతులు వచ్చాయని డీఆర్‌డీవో చైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి శనివారం వెల్లడించారు. డీఆర్‌డీవో అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అల్లైడ్‌ సైన్సెస్‌ (ఇన్‌మాస్‌) ఈ ‘2–డీజీ’మందును అభివృద్ధి చేసిందని.. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ కలిసి ప్రయోగాలు నిర్వహించిందని తెలిపారు. ‘2–డీజీ’ఇచ్చిన కోవిడ్‌ రోగుల్లో చాలా మందికి నాలుగైదు రోజుల్లోనే కోవిడ్‌ నెగెటివ్‌ వచ్చిందని వివరించారు. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన కోవిడ్‌ కేసులు, ఆక్సిజన్‌ కొరతతో అల్లాడుతున్న సమయంలో ‘2–డీజీ’అందుబాటులోకి వస్తుండటంతో సంతోషం వ్యక్తమవుతోంది.


ఏడాది కిందే ప్రయోగాలు మొదలు..
కరోనా వైరస్‌ పంజా విసరడం మొదలైన కొత్తలోనే.. అంటే గత ఏడాది ఏప్రిల్‌లోనే ఈ వైరస్‌కు మందు కనిపెట్టడంపై ఇన్‌మాస్‌ సంస్థ దృష్టి పెట్టింది. సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ)తో కలిసి పరిశోధనలు చేసి.. ‘2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్‌)’మందును రూపొందించింది. ఇది కరోనా వైరస్‌ పెరుగుదలను సమర్థవంతంగా అడ్డుకుంటోందని గుర్తించి.. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ‘సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌డీఓ)’కు దరఖాస్తు చేసింది. ఈ మేరకు అనుమతి రావడంతో గత ఏడాది మే నెలలోనే డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఫార్మా కంపెనీతో కలిసి.. కోవిడ్‌ రోగులపై ప్రయోగాత్మక పరిశీలన చేపట్టింది. ఈ మందు సామర్థ్యం, భద్రత ఏమేరకు ఉన్నాయనేది నిర్ధారించేందుకు ప్రయోగాలు నిర్వహించింది. 


కరోనా వైరస్‌ ఉన్న శాంపిల్స్‌.. ఇన్‌ఫెక్ట్‌ అయిన కణాలకు 2–డీజీ మందు వాడిన తర్వాత


మందు సురక్షితమే..
గత ఏడాది మే – అక్టోబరు మధ్య నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో ‘2–డీజీ’మందు సురక్షితమైనదేనని, రోగులు వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడుతోందని గుర్తించారు. తర్వాత రెండో దశలో ఫేజ్‌–2ఏ కింద ఆరు ఆస్పత్రుల్లో, ఫేజ్‌–2బీ కింద 11 ఆస్పత్రుల్లో పరిశీలన చేపట్టారు. మొత్తం 110 మంది రోగులకు 2–డీజీ మందును ఇచ్చి ఫలితాలను బేరీజు వేశారు. సాధారణ చికిత్సా పద్ధతులతో పోలిస్తే 2–డీజీ మందు ఇచ్చిన రోగులు.. కోవిడ్‌ లక్షణాల నుంచి వేగంగా బయటపడుతున్నట్టు నిర్ధారించారు. మరోలా చెప్పాలంటే 2–డీజీ తీసుకున్నవారు మూడు రోజులు ముందుగానే కోలుకుంటున్నారని తేల్చారు.


మూడో దశలోనూ సత్ఫలితాలు
తొలి, రెండు దశల ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు గత ఏడాది నవంబరులోనే డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. గతేడాది డిసెంబరు – ఈ ఏడాది మార్చి మధ్య 220 మంది రోగులకు ఈ మందును ఇచ్చి పరిశీలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 27 కోవిడ్‌ ఆస్పత్రుల్లో పేషెంట్లపై ప్రయోగాలు చేశారు. 2–డీజీ మందు ఇవ్వడం మొదలుపెట్టిన మూడో రోజు నుంచే దాదాపు 42 శాతం మంది రోగుల్లో ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. అరవై ఐదేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిలోనూ ఇదేరకమైన ఫలితాలు వచ్చాయి. మూడు దశల ఫలితాల ఆధారంగా.. మధ్యమ, తీవ్ర స్థాయి కోవిడ్‌ రోగుల చికిత్సలో 2–డీజీని ఉపయోగించేందుకు డీసీజీఐ ఈ నెల ఒకటో తేదీనే అనుమతులు జారీ చేసింది. తాజాగా ఈ మందుకు సంబంధించిన వివరాలను డీఆర్‌డీవో చైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
 

పొడి.. నీళ్లలో కలుపుకొని తాగడమే
2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔష ధం మన శరీరంలో వైరస్‌ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్‌లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్‌ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత. ఈ మందులోని అణువులు.. సాధారణ గ్లూకోజ్‌ అణువులను పోలి ఉండటం వల్ల విస్తృతంగా ఉత్పత్తి చేయడానికి వీలుందని డీఆర్‌డీవో చైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే వారం, పదిరోజుల్లోనే ఈ మందు తొలి విడత మార్కెట్లోకి వచ్చేస్తుందని.. మూడు వారాల్లో మరింత మోతాదులో అందుబాటులోకి వస్తుందని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement