‘కరోనా’పై పోరులో సీసీఎంబీ ముందడుగు | CCMB Established Stable Cultures Of Covid 19 Can Work Towards Vaccine Development | Sakshi
Sakshi News home page

‘కరోనా’పై పోరులో సీసీఎంబీ ముందడుగు

Published Fri, May 29 2020 1:34 AM | Last Updated on Fri, May 29 2020 1:34 AM

CCMB Established Stable Cultures Of Covid 19 Can Work Towards Vaccine Development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణ విషయంలో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) కీలకమైన ముందడుగు వేసింది. టీకాతో పాటు కరోనా చికిత్సకు అవసరమైన మందులను అభివృద్ధి చేసేందుకు వీలుగా వ్యాధికారక వైరస్‌ను పరిశోధనశాలలోనే తయారు చేయడంలో విజయం సాధించింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని రోగుల ద్వారా సేకరించిన వైరస్‌ను వైరాలజిస్ట్‌ డాక్టర్‌ క్రిష్ణన్‌ హెచ్‌ హర్షన్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం విజయవంతంగా వృద్ధి చేయగలిగిందని సీసీఎంబీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్వాసకోశంలోని ఉపరితల కణాలపై వైరస్‌ దాడి చేస్తుందని తెలిసిన విషయమే. ఏస్‌–2 రిసెప్టార్ల ద్వారా వైరస్‌ కణాల్లోకి చొరబడుతుంది. ఎండోసైటోసిస్‌ అని పిలిచే ఈ ప్రక్రియ తర్వాత వైరస్‌లోని ఆర్‌ఎన్‌ఏ కణాల్లోని సైటోప్లాజంలోకి విడుదలవుతుంది.

అక్కడ వైరల్‌ ప్రొటీన్ల ఉత్పత్తి జరిగిన తర్వాత ఆర్‌ఎన్‌ఏ నకళ్లు తయారవడం మొదలవుతుంది. ఇంకోలా చెప్పాలంటే వైరస్‌ నకళ్లను కృత్రిమంగా అభివృద్ధి చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఉపరితల కణాలు పరిశోధనశాలలో ఎక్కువ తరాలపాటు పెరగకపోవడం దీనికి ఓ కారణం. వైరస్‌ను సమర్థంగా పెంచాలంటే నిరంతరం విభజన చెందుతూ ఉండే కణాలు కావాలని, ఇందుకు తాము ఆఫ్రికా కోతిలోని మూత్రపిండాల కణాలను ఎంచుకున్నామని డాక్టర్‌ కృష్ణన్‌ తెలిపారు. ఈ కణాలు కూడా మన శ్వాసకోశ కణాల మాదిరిగానే ఏస్‌–2 రిసెప్టార్లను కలిగి ఉంటా యని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వైరస్‌ రకాలను తాము అభివృద్ధి చేశామని, భారీ సంఖ్యలో వైరస్‌ను వృద్ధి చేయడమే కాకుండా వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా టీకా అభివృద్ధికి ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నామని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. డీఆర్‌డీవో వంటి సంస్థలతో కలసి ఇప్పటికే కరోనా చికిత్సకు మందులపై ప్రయోగాలు మొదలుపెట్టామని చెప్పారు.

ఉపయోగాలు బోలెడు..
కరోనా వైరస్‌ను కృత్రిమంగా వృద్ధి చేయడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వీటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది టీకా తయారీ గురించి. నిర్వీర్యం చేసిన లేదా బలహీనం చేసిన వైరస్‌లతో వ్యాక్సిన్లు రూపొందించడం చాలాకాలంగా జరుగుతున్నదే. కరోనా నివారణ కోసం ఆ వైరస్‌ను నిర్వీర్యం చేసి ఉపయోగించేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక వ్యవస్థ సిద్ధం చేసే యాంటీబాడీలను ఉపయోగించడం ఒక పద్ధతి. ఇందుకు నిర్వీర్యం చేసిన వైరస్‌లను జంతువులపై ప్రయోగించి ఉత్పత్తి అయిన యాంటీబాడీలను మానవుల చికిత్సకు వాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటి నుంచి సేకరించిన యాంటీబాడీలను శుద్ధి చేసి ప్రయోగిస్తే మానవుల్లో వైరస్‌ వ్యతిరేక చర్యలు మొదలవుతాయి.

ఇవి టీకాలు కాదు గానీ.. వైరస్‌ను నియం త్రించే యంత్రాంగంగా పరిగణించవచ్చు. వైరస్‌కు స్పందనగా రోగ నిరోధక వ్యవస్థ పలు రకాల యాంటీబాడీలను తయారు చేస్తుంది. వీటిల్లో న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు ఒకటి. క్షీరదాల్లో వీటిని ఉత్పత్తి చేయడం ద్వారా అవి వైరస్‌ను ఎంత మేరకు ఎదుర్కోగలుగుతున్నాయో పరీక్షించొచ్చు. సమర్థంగా పనిచేసే వాటిని ఉపయోగించొచ్చు. వైరస్‌లను కృత్రిమంగా పెంచడం ద్వారా మాత్రమే ఈ యాంటీబాడీలను పరీక్షించొచ్చు. కరోనా చికిత్సకు ఉపయోగపడే రసాయనాలను పరీక్షించేందుకు, వేర్వేరు డిస్‌ఇన్‌ఫెక్టెంట్ల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు వైరస్‌లను కృత్రిమంగా వృద్ధి చేయడం అత్యవసరం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement