- విద్యుత్ ఉద్యోగుల విభజనపై తెలంగాణ సర్కారు
- సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై సోమవారం డివిజన్ బెంచ్‌కు అప్పీలు
- ఏపీ ఉద్యోగులను మళ్లీ విధుల్లో చేర్చుకోకూడదని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ‘స్థానికత’ కలిగిన 1151 మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునేదిలేదని నిర్ణయించింది. విద్యుత్ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు, రిలీవ్ ఆదేశాలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు సింగిల్ బెంచ్ శుక్రవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ ముందు సోమవారం అప్పీలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
మధ్యంతర ఉత్తర్వుల వచ్చిన తర్వాత ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల చెర్మైన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్‌రావు తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో చర్చలు జరిపారు. ఏపీ స్థానికత గల ఉద్యోగులందరినీ టి.ట్రాన్స్‌కో, టి.జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లు శుక్రవారం మూకుమ్మడిగా రిలీవ్ చేశాయి. ఈ పోస్టుల్లో తక్షణమే ‘పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు’(ఎఫ్‌ఏసీ) చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు ఆదేశించాయి.
దీంతో అప్పటికప్పుడు ఇన్‌చార్జీ అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ బెంచ్ నిలుపుదల చేసినా, మళ్లీ వారిని విధుల్లోకి తీసుకోకూడదని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. హైకోర్టు ఉత్తర్వులు కేవలం పిటిషన్లర్లకే వర్తిస్తాయా? లేక రిలీవైన ఉద్యోగులందరికీ వర్తిస్తాయా? అన్న అంశంపై స్పష్టత వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. స్పష్టత కోసం హైకోర్టు ఉత్తర్వుల రాతప్రతి కోసం ఎదురు చూస్తున్నామని జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ‘సాక్షి’కి తెలిపారు.
పోస్టులు తక్కువ.. వివాదం ఎక్కువ..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ పోస్టులు 75 వేలకుపైనే ఉన్నాయి. తెలంగాణలో 1151 మంది ఏపీ ఉద్యోగులు, ఏపీలో 450 మంది తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థానికత ఆధారంగా ఎవరి రాష్ట్రాలకు వారిని కేటాయిస్తే ఏపీకు అదనంగా 701 ఉద్యోగులు మాత్రమే వెళ్తారు. మంజూరు పోస్టులతో పోల్చితే ఇది కేవలం ఒక్క శాతం కూడా కాదు. అయినా, ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని కావాలని పెద్దదిగా చేస్తోందని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
జూన్ 1 కల్లా పూర్తి కావాల్సిన ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి ఉద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఏపీ ఉద్యోగులను తమ రాష్ట్రంలోకి తీసుకుని అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త కె.రఘు విజ్ఞప్తి చేశారు.
‘విద్యుత్’ విభజనకు హైకోర్టు బ్రేక్
విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని, ఇలా ఇచ్చే ఉత్తర్వులు తెలంగాణ ఉద్యోగుల పట్ల మరణశాసనం అవుతాయని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి గట్టిగా వాదించినా ప్రయోజనం లేకుండాపోయింది.
ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేస్తూ తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులకు అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా అమలును హైకోర్టు నిలిపేసింది. అంతేకాక హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యే నాటికి (9వ తేదీ) ఏ పరిస్థితి ఉందో, ఉద్యోగుల రిలీవ్ విషయంలో అదే పరిస్థితి కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి రెడ్డి కాంతారావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
వెనక్కి తగ్గేది లేదు
Published Sat, Jun 13 2015 5:11 AM | Last Updated on Wed, Sep 5 2018 4:17 PM
Advertisement
Advertisement