రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటారా లేదా స్పష్టత కావాలని, ఈ అంశంపై తర్వాత చెపుతాం అంటే కుదరదని తెలంగాణ సర్కార్ కరాఖండీగా చెబుతోంది.
తెలంగాణ సర్కార్ మళ్లీ కమలనాథన్, ఇద్దరు సీఎస్‌ల భేటీ తప్పదు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటారా లేదా స్పష్టత కావాలని, ఈ అంశంపై తర్వాత చెపుతాం అంటే కుదరదని తెలంగాణ సర్కార్ కరాఖండీగా చెబుతోంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన కమలనాథన్ మార్గదర్శకాలకు ఇప్పట్లో మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు.
రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల ఆప్షన్‌ను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని తర్వాత చెబుతామని, దాన్ని మినహాయించి ముసాయిదా మార్గదర్శకాలను జారీచేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో పదవీవిరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచడంతో రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవద్దనేది ఆ రాష్ర్టప్రభుత్వ అభిప్రాయంగా ఉంది. ఈమేరకు ఏపీ సీఎస్ ఆమోదించిన ఫైలు తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ ఆమోదానికి వెళ్లింది. ఆ ఫైలు వెళ్లి వారమైంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశంలో స్పష్టత రావాలంటే కమలనాథన్‌తో ఇద్దరు సీఎస్‌లు మళ్లీ సమావేశం కావాల్సి ఉంది.