జహీరాబాద్: గల్లీగల్లీలో గస్తీ నిర్వహిస్తూ.. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. జహీరాబాద్ పట్టణంలో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. శాంతిభద్రతలు బాగుంటేనే ప్రజలు సుఖశాంతులతో ఉండటంతో పాటు అభివృద్ధి సాధ్యమని తెలిపారు.
తెలంగాణలో శాంతిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రతీ పోలీస్ స్టేషన్‌కు ఒక కొత్త జీపును అందించనున్నట్లు చెప్పారు. రెండు నెలల్లో వీటిని సమకూరుస్తామన్నారు. వీధివీధినా తిరిగేందుకు వీలుగా 1,500 మోటారు సైకిళ్లను అందజేయనున్నట్లు వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం కోసం 1,600 ఇన్నోవాలు కొనుగోలు చేశామని తెలిపారు. నగరంలో పోలీసు కంట్రోల్ రూం నిర్మాణం కోసం మొదటి విడత కింద రూ.340 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.
8 ఎకరాల స్థలంలో అత్యాధునికంగా 8 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఇస్తామన్నారు. 10 జిల్లాలతో దీనిని అనుసంధానం చే స్తామని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని ఏ మూలన చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా రెండు నిమిషాల్లో కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోయినా కూడా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణకు ఇబ్బందులు సృష్టించేందుకు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంటు, నీళ్లను అడ్డుకుంటున్నాడని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు కూడా తెలంగాణకు రాకుండా కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. గొలుసు కట్టు చెరువులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ బడ్జెట్‌లో 9 వేల చెరువుల పునరుద్ధరణకు నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం బడ్జెట్‌లో గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి గాను రూ.20వేల కోట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.
సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జె.గీతారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్, జిల్లా కలెక్టర్ రాహూల్ బొజ్జా, వరంగల్ ఐజీ నవీన్‌చంద్, జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్యచందు పాల్గొన్నారు.
గల్లీగల్లీలో గస్తీ
Published Tue, Dec 30 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement
Advertisement