శ్రీశైలం విద్యుత్పై కొత్త వివాదం!
♦ ‘తాగునీటి’ విద్యుత్‌లో తెలంగాణకు
♦ సగం వాటా ఇచ్చేందుకు ఏపీ తిరస్కరణ
♦ న్యాయం చేయాలని కోరుతూ కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
సాక్షి , హైదరాబాద్ : తెలంగాణ, ఏపీల మధ్య మరో విద్యుత్ జగడం మొదలైంది. ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి విడుదలయ్యే నీటితో ఉత్పత్తయ్యే విద్యుత్ పంపకంలో వివాదం ముసురుకుంది. ఈ విద్యుత్‌ను చెరిసగం పంచుకోవాల్సి ఉన్నా... 50 శాతం వాటా ఇచ్చేందుకు ఏపీ నిరాకరిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం కుడి, ఎడమ కాల్వల కింద సుమారు 42 టీఎంసీల మేర నీటిని విడుదల చేసేందుకు బోర్డు అంగీకరించిన విషయం తెలిసిందే. ఆ నీటితో విద్యుదుత్పత్తి జరుగుతున్నా.. తమకు రావాల్సిన వాటా విద్యుత్‌ను ఏపీ ఇవ్వకపోవడంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లడంతోపాటు.. సోమవారం బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాసింది.
మొత్తం వాడేస్తున్న ఏపీ..
ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం కుడి, ఎడమ కాల్వల కింద నీటిని విడుదల చేసి, విద్యుదుత్పత్తి కూడా చేస్తారు. ఇలా ఉత్పత్తయ్యే విద్యుత్‌లో తెలంగాణ, ఏపీలు చెరిసగం పంచుకోవాలని కృష్ణా బోర్డు గతంలోనే ఆదేశించింది. కానీ ఇది అమలుకావడం లేదు. ఇటీవలి కృష్ణాబోర్డు భేటీ సందర్భంగా ఈ అంశాన్ని తెలంగాణ లేవనెత్తగా.. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలో ఉన్నందున ఈ అంశాన్ని బోర్డు తేల్చజాలదని ఏపీ తెగేసి చెప్పింది. నీళ్ల పంపకంలో అనుసరిస్తున్న 67ః33 నిష్పత్తి ప్రకారమే విద్యుత్‌ను ఇస్తామంది. జూరాలలో వినియోగిస్తున్న నీటిలో ఏపీకి భాగమిస్తేనే ఈ నిష్పత్తి ప్రకారం నీటిని, విద్యుత్‌ను ఇస్తామని... లేకపోతే 75ః25 పద్ధతిలో ఇస్తామని ఏపీ వాదిస్తోంది. దీంతో విద్యుత్‌ను చెరిసగం పంచాలని తెలంగాణ సోమవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. విద్యుత్ పంపకంలో అన్యాయాన్ని సవరించాలని విజ్ఞప్తి చేసింది.