సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ఇలాంటి పరిస్థితులు కనిపించవు. సర్కారీ బడిని గాడిన పెట్టేందుకు చర్యలు మొదలయ్యాయి. అటు విద్యాప్రమాణాలను, ఇటు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి సర్కారీ స్కూళ్ల ను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. బడిని సరైన బాటలో పెట్టే దిశగా ముందుకు కదులుతోంది. నగరాలు, పట్ట ణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ చక్కదిద్దేందుకు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. పాఠశాలల నిర్వహణ నుంచి మౌలిక సదుపాయాల కల్పన వరకు.. మెరుగైన విద్యా బోధన నుంచి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్పించే వరకు చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ బడుల్లో తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు మెరుగైన విద్యను అందించేలా ఉపాధ్యాయులను ప్రోత్సహించడం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్) కింద నిధులను సమీకరించి బడులను బాగుచేసే చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరించారు.
అధికారుల నుంచే మార్పునకు శ్రీకారం..
విద్యాశాఖను, పాఠశాలలను గాడిలో పెట్టే కార్యక్రమం అధికారుల నుంచే ఆరంభించాలని భావించిన విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి.. అందుకు ‘ఐ లవ్ మై జాబ్’, ‘యాక్ట్ నౌ’వంటి కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. ప్రతి అధికారి కార్యాలయంలో ఆయా బోర్డులను ఏర్పాటు చేసి, అందరూ వాటిని ఆచరించేలా చర్యలు చేపట్టారు. అనంతరం విద్యార్థుల సంఖ్యను పెంచే ప్రధాన ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం, తగిన ప్రోత్సాహం అందించడం వంటి చర్యలు తీసు కున్నారు.
హాజరు మాసోత్సవంగా ఆగస్టును పరి గణనలోకి తీసుకుని, ఆ నెలలో 100 శాతం హాజరు కలిగిన విద్యార్థులకు సైకిళ్లు అంద జేయాలని నిర్ణయించారు. అలాగే విద్యార్థుల కనీస సామర్థ్యాలైన చదవడం, రాయడం, లెక్కలు చేయడం(3 ఆర్స్)లో పురోగతి సాధించేందుకు సెప్టెంబర్‌ను కనీస సామర్థ్యాల పెంపు మాసంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు.
రిటైర్డ్.. బట్ నాట్ టైర్డ్
‘రిటైర్డ్.. బట్ నాట్ టైర్డ్’అంటూ రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులను గుర్తించి విద్యార్థులకు బోధన అందించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని పాఠశాలల పరిసరాల్లో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను గుర్తించి, లేదా పరిచయం ఉన్నవారితో మాట్లాడి టీచర్లు తక్కువగా ఉన్నచోట సాయంత్రం వేళల్లో అదనపు బోధన చేపట్టేలా వారిని ఒప్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. అలాగే విద్యాశాఖలోని ప్రతి టీచర్, ఉద్యోగి, అధికారి తమకు పరిచయం కలిగిన ఉన్నతాధికారులు, సంపన్నులు, ఎన్నారైలతో మాట్లాడి ప్రభుత్వ స్కూళ్లకు తగిన ఆర్థిక సహకారాన్ని కోరి, సర్కారీ బడుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని జనార్దన్‌రెడ్డి సూచించారు.
బడుల బలోపేతానికి తీసుకున్న కొన్ని చర్యలు..
- డీఈవోలు, ఎంఈవోలు, డిప్యూటీ ఈవోలు ప్రతిరోజు ఉదయం పాఠశాల ప్రార్థన సమయంలో ఏదో ఒక స్కూలును ఆకస్మిక తనిఖీ చేసి, ఆ నివేదికను ఉదయం 11 గంటలకల్లా ప్రభుత్వానికి పంపించాలి.
- ప్రతి అధికారి స్వీయ మదింపు చేసుకోవాలి. రోజులో ఏం చేయాలి, ఎలా చేయాలో నిర్ణయించుకున్న తర్వాతే ముందుకెళ్లాలి.
- విజ్ఞప్తులకు సంబంధించి కచ్చితంగా రిజస్టర్ నిర్వహించాలి. వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తున్నారో చూసుకోవాలి.
- అధికారులు, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు అంకిత భావంతో పని చేసేందుకు ‘ఐ లవ్ మై జాబ్’ప్రక్రియను పెంపొందించాలి.
- ప్రతి శనివారం పాఠశాలకు వీఐపీని ఆహ్వానించి మాట్లాడించాలి. కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ వంటి అధికారులు మాట్లాడితే విద్యార్థుల్లో స్ఫూర్తి కలుగుతుంది.
- ప్రతి పాఠశాలలో సమస్యలను గుర్తించి, ఆర్థికపరమైన అంశాలతో సంబంధం లేనివాటిని తొలుత పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి.
- సున్నా మార్కులు వస్తున్న విద్యార్థులను గుర్తించి, వారికి ఎందుకు అలా వచ్చాయో విశ్లేషించి తగిన పరిష్కార మార్గాలు చూడాలి.
- ప్రతిభ కలిగిన విద్యార్థులు, బాగా పనిచేసే టీచర్లకు సంబంధించిన విజయగాథలను రూపొందించాలి.
- ప్రతి పాఠశాలలో గత నెల కంటే ఈ నెల కనీసం పది శాతం విద్యుత్తు ఆదా చేసే చర్యలు తీసుకోవాలి.
బడికి రాని టీచర్లపై బెత్తం...
పాఠశాలలకు రాని టీచర్ల లెక్క సరిచేయా లని కూడా విద్యాశాఖ భావిస్తోంది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు స్కూళ్లకు హాజరుకాని ఉపాధ్యాయుల లెక్కలు ఇవ్వాలని అధికారు లను ఆదేశించింది. దీర్ఘకాలిక సెలవుల్లో ఉంటూ ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారికి తాఖీదులు ఇవ్వాలని నిర్ణయం తీసు కుంది. ఏళ్ల తరబడి అబ్‌స్కాండింగ్‌లో ఉన్న వారిని సర్వీసు నుంచి తొలగించే అవకాశా లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
- ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారి సంఖ్య ఏటా తగ్గు తోంది. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది.
- సర్కారీ స్కూళ్ల విద్యార్థులకు కనీస సామర్థ్యాలైన చదవడం, రాయడం, లెక్కలు చేయడం రావడంలేదు. తెలుగులో ఒక పేరాను ధారాళంగా చదివి అర్థం చేసుకోగలిగేవారు, సొంతంగా రాయగలిగిన వారు ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 5–10 శాతమే ఉండగా, ఉన్నత పాఠశాలల్లో అలాంటి వారు కేవలం 15–20 శాతమే ఉన్నారు.
- ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల హాజరు 75 శాతానికి మించడంలేదు. నిత్యం 25 శాతం మంది టీచర్లు గైర్హాజరు అవుతున్నారు. కొందరు గురువులైతే దీర్ఘకాలిక సెలవులు పెట్టి ప్రైవేటు స్కూళ్ల సేవలో తరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment