బయటికొచ్చిన్రో.. వీపు లాఠీల మోతే! | Telangana Government Take Serious Action on Lockdown | Sakshi
Sakshi News home page

బయటికొచ్చిన్రో.. వీపు లాఠీల మోతే!

Published Wed, Apr 22 2020 7:56 AM | Last Updated on Wed, Apr 22 2020 12:45 PM

Telangana Government Take Serious Action on Lockdown - Sakshi

కూరగాయలు తాజాగా దొరుకుతాయని ఇక్కడికి వచ్చా... ఫలానా బ్రాండ్‌ గోధుమ పిండి కోసం పరిధిని దాటా... ఇంట్లో బోర్‌ కోట్టి నగరం ఎలా ఉందో చూడాలనుకున్నా...ఆస్పత్రిలో ఉన్న బంధువుల్ని పలకరించడానికి వెళ్లా...సంటోడు పాలకేడుస్తుండు.. మా దగ్గర దొరకట్లే..అందుకే ఇంతదూరం వచ్చా..గవర్నమెంటోళ్లు ఏసిన పైసల్‌ తీసుకోకపోతే వాపస్‌ పోతాయంట..ఇక ఇలాంటి పప్పులుడకవ్‌.. కారణం చెప్పాల్సిందే.. గుర్తింపు కార్డు చూపించాల్సిందే.. లేదంటే మీ ఒళ్లు చింతపండు కావడం ఖాయం..

సాక్షి, సిటీబ్యూరో:  లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ రోడ్ల పైకి వస్తున్న అనేక మంది చెక్‌ పాయింట్ల వద్ద పోలీసులకు పొంతనలేని మాటలు చెబుతున్నారు. దీనిపై సోమవారం వరకు మామూలుగా వ్యవహరించిన పోలీసులు.. మంగళవారంలాఠీలకు పని చెప్పారు. నిర్దేశించిన పరిధిని దాటినా, లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినా కేసులతో పాటు వీపు మోత మోగిస్తున్నారు. ఫలితంగా కేసులు, వాహనాల స్వాధీనం గణనీయంగా పెరిగాయి. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించిన పోలీసు విభాగం మంగళవారం నుంచి ఆ పని ప్రారంభించింది. అకారణంగా రోడ్ల పైకి వచ్చేవారిపై కేసుల కొరడా ఝుళిపించింది. వాహనాలనూ అదే స్ధాయిలో స్వాధీనం చేసుకుంది. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన, తనిఖీల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని చక్కదిద్దిడానికి లాఠీలకు పని చెప్పింది. మంగళవారం ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు రోడ్ల పైకి వచ్చి చెక్‌ పోస్టుల వద్ద పోలీసుల పని తీరును పరిశీలించారు. నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ సైతం మదీన చౌరస్తాతో సహా అనేక చోట్ల చెక్‌ పోస్టుల్ని సందర్శించారు.

అకారణంగా బయటకు వచ్చిన వారిని తరుముతున్న పోలీసులు

నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 133 చెక్‌ పాయింట్ల వద్దా చర్యలు కట్టుదిట్టం చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ఉపశమనాలు కల్పిస్తోంది. పగటిపూట ఆంక్షల్ని సడలిస్తూ ప్రతి నగరవాసి నిత్యావసర వస్తువులు, ఔషధాలు వంటివి ఖరీదు చేసుకోవడానికి బయటకు వచ్చే అవకాశం కల్పించింది. ఈ వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అనేక ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్‌ చెప్పడానికి శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం నుంచి తనిఖీలు ముమ్మరం చేశారు.

ఓపక్క చెక్‌పోస్టులు, మరోపక్క పికెట్ల వద్ద వాహనచోదకుల్ని ఆపి.. ఆకారణంగా బయటకు వచ్చిన వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌ (టీసీసీసీ) సిబ్బంది వివిధ జంక్షన్లు, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ద్వారా ఇలాంటి ఉల్లంఘనుల్ని గుర్తించి ఈ–చలాన్లు జారీ చేస్తుండగా క్షేత్రస్థాయి అధికారులు ఆయా వాహనాలను ఆపి స్వాధీనం చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ గత నెల 23న అమలులోకి రాగా.. అప్పటి నుంచి సోమవారం వరకు హైదరాబాద్‌ పోలీసులు మొత్తం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యధికం ద్విచక్ర వాహనాలు కావడంతో యువకులే అకారణంగా రోడ్ల పైకి వస్తున్నట్లు నిర్ధారణ అవుతోందని చెప్తున్నారు. మరోపక్క ఫిజికల్‌ డిస్టెన్స్‌ను కచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ముగిసే వరకు ద్విచక్ర వాహనంపై ఒకరు, తేలికపాటి వాహనంగా పిలిచే కారులో గరిష్టంగా ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అనేక మంది ఈ ఉత్తర్వుల్నీ ఉల్లంఘిస్తూ ద్విచక్ర వాహనాలపై ఇద్దరు సంచరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు ఈ తరహా వాహనచోదకులపై కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన గత నెల 23 నుంచి సోమవారం వరకు పోలీసులు మొత్తం 71,625 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలో అత్యధికంగా ఈ నెల 15న 2745 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం దీన్ని మించి 3634 వాహనాలు సీజ్‌ చేశారు. ఈ నెల 18న అధిక సంఖ్యలో 250 తేలిక పాటి వాహనాలు సీజ్‌ చేశారు. మంగళవారం 400 తేలిక పాటి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.నిత్యావసరాలు, ఔషధాల కోసం ఓ వ్యక్తి తన నివాసం నుంచి గరిష్టంగా మూడు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే సంచరించడానికి అనుమతి ఇచ్చారు.

దీన్ని గుర్తించడానికి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ తమ వెంట గుర్తింపు కార్డు, చిరునామా గుర్తింపు ఆధారాలను కచ్చితంగా తీసుకురావాలని నిబంధన పెట్టారు. ఈ విషయంలో ఇప్పటి వరకు చూసీచూడనట్లు వదిలేసిన పోలీసులు మంగళవారం నుంచి కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఫలితంగా ఈ నిబంధన ఉల్లంఘించిన దాదాపు 9 వేల మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. ఇలా నిర్దేశించిన పరిధిని దాటి తమ వాహనాల్లో సంచరించే వారికి నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆటోమేటిక్‌ నెంబర్‌ ప్లేట్‌ రికగ్నేషన్‌ (ఏఎన్‌పీఆర్‌) సిస్టమ్‌ ద్వారా చెక్‌ చెప్తున్నారు. ఈ టెక్నాలజీని ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఐటీఎంఎస్‌) ద్వారా ట్రాఫిక్‌ కెమెరాలకు ఏర్పాటై ఉంది. సిటీలోని 250 జంక్షన్లలోని ట్రాఫిక్‌ కెమెరాల్లో ఇది అందుబాటులో ఉంది. ఏఎన్‌పీఆర్‌ సిస్టమ్‌ పూర్తి సాఫ్ట్‌వేర్‌ ఆధారితంగా పని చేసే పరిజ్ఞానం.

బాలానగర్‌ వై జంక్షన్‌ వద్ద మంగళవారం బయటకు వచ్చిన వాహనదారులను ఆపేసి పోలీసులు తనిఖీ చేశారు.

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వాహన చోదకులకు పోలీసులు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 179 కింద జరిమానా విధిస్తున్నారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి రూ.600 జరిమానా పడుతోంది. అయితే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై మాత్రం ఐపీసీలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ప్రధానంగా సెక్షన్‌ 188 (ప్రభుత్వ ఆంక్షల్ని ఉల్లంఘించడం), సెక్షన్‌ 270 (ప్రాణాంతకమైన వ్యాధి మరొకరికి సోకేలా ప్రవర్తించడం), సెక్షన్‌ 271 (క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించడం) తదితరాల కింద రిజిస్టర్‌ చేస్తున్నారు. ఇలాంటి వారిని ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నా.. శాంతిభద్రతల విభాగానికి అప్పగిస్తున్నారు. ఈ తరహాకు చెందిన కేసులు ఇప్పటి వరకు మూడు కమిషనరేట్లలో కలిపి 3428 నమోదు చేశారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత వీరికి నోటీసులు జారీ చేసి, న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేయనున్నారు. వీరిపై కోర్టులో నేరం నిరూపణ అయితే గరిష్టంగా రెండేళ్ల వరకు శిక్ష పడేందుకు ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కోర్టుకు అప్పగించనున్నారు.  


ఏ పంపిణీకైనా..
నిత్యావసర సరుకులు, వాటర్‌ బాటిళ్లు, పండ్లు, స్నాక్స్‌ తదితరాలు పంపిణీ చేయడానికి కూడా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆయా ప్రాంతాల్లో ఎవరైనా దాతలు సరుకులు పంపిణీ చేయాలంటే స్థానిక పోలీసులను సంప్రదించాలి. నిత్యావసరాల షాపుల మూసివేస్తారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులు యథావిధిగా కొనసాగుతాయని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు.   

కేసుల హడల్‌
గాంధీ/వెంగల్‌రావునగర్‌/నల్లకుంట: నగరంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో 19 కేసులు నమోదయ్యాయి. క్వారంటైన్‌ గడువు ముగిసినప్పటికీ నగరంలో ఇంకా మర్కజ్‌ మూలాలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 692 మంది చికిత్స పొందుతున్నారు. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో 30 మంది చికిత్సపొందుతున్నారు. వీరిలో 9 పాజిటివ్, 21 అనుమానిత కేసులు ఉన్నాయి. కొత్తగా నలుగురు అడ్మిట్‌ కాగా, మరో 17 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక ఆయుర్వేద ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో 149 మంది ఉన్నారు. ఇక నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో కొత్తగా 19 మంది అడ్మిట్‌ అయ్యారు. మొత్తం 38 మంది ఉన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన19 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement