సాక్షి, హైదరాబాదు : రాష్ట్రంలోని రెండవ శ్రేణి భాషా పండితులు, పీఈటీల పోస్టులను.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు భాషా పండితుల పోస్టులను అప్ గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై తెలంగాణ రాష్ట్రంలో గ్రేడ్ 2 పండిట్ల పోస్టులుండవన్నారు అధికారులు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది భాషా పండితులకు మేలు జరుగుతుందని తెలిపారు.
భాషా పండిట్లు, పీఈటీలను స్కూలు అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వుల పట్ల టీచర్ ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్థన్ రెడ్డి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ ప్రగతి భవన్‌లో మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. భాషా పండితుల చిరకాల కోరికను కేసీఆర్ నెరవేర్చారన్నారు. విద్యారంగ చరిత్రలో ఇదొక అపూర్వ నిర్ణయంగా నిలిచిపోతుందని అభిప్రాయ పడ్డారు. సీఎం కేసీఆర్‌కు తెలుగు భాషపై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment