రూ.17వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నాం: కేసీఆర్
హైదరాబాద్ : దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం 17వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. శాసనసభ సమావేశాల్లో రుణమాఫీపై జరిగిన చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఇంత భారీ రుణమాఫీ అనేది సాహసోపేతమైన నిర్ణయమన్నారు. ఖరీఫ్ లక్ష్యం 12వేల కోట్ల రుణాలకు గాను... 8100 కోట్లు రుణ వితరణ జరిగిందని చెప్పారు.
సాధారణంగా రుణమాఫీ చేసినప్పుడు ఆర్‌బీఐ రుణాలు రీ షెడ్యూల్ చేస్తుందని కేసీఆర్ తెలిపారు. కానీ ఈ దఫా ఆర్‌బీఐ రీ షెడ్యూల్‌కు అంగీకరించలేదని వెల్లడించారు. పక్క రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా మాఫీ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టో తెలుగు ప్రతిలో పంట రుణాలపై తప్పుగా అచ్చు అయిందని, ఇంగ్లీష్ కాపీలో రుణాలపై స్పష్టంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.