కల్లు దుకాణాలు తెరిపించేందుకు కమిటీ
హైదరాబాద్: కల్లు దుకాణాలు హైదరాబాద్లో ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఓ కమిటీని నియమించింది. ఎక్సైజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా, ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సభ్యుడిగా కమిటీ ఏర్పాటు చేసింది. మార్గదర్శకాలు సిద్ధం చేయాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కారు కోరింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరంలో 2004లో మూతపడ్డ కల్లు దుకాణాలను తిరిగి తెరిపించేందుకు తెలంగాణ కేబినెట్ ఇటీవల ఆమోదముద్ర వేసింది. దసరాకు కల్లు దుకాణాలు తెరుచుకునే అవకాశముంది.
నగరంలో ఈ దుకాణాలు మూతపడేనాటికి 2004లో 103 ఉండేవి. నలభై రెండు సొసైటీల ద్వారా ఈ దుకాణాల్లో అమ్మకాలు సాగేవి. ఒక్కో సొసైటీలో 300 నుంచి 1000 మంది వరకు సభ్యులు ఉండేవారు. అయితే 50 కిలోమీటర్ల పరిధిలో చెట్లులేని పట్టణాలు, నగరాల్లో కల్లు విక్రయాలు సాగించకూడదని అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ జిల్లా పరిధిలోనే దుకాణాలు మూతపడ్డాయి.