భద్రాద్రి రాముడికి భరోసా కరువు!
అందరి బంధువు.. ఆదుకునే ప్రభువు.. అయిన ఆ భద్రాద్రి రాముడికే ప్రభుత్వ ఆదరణ కరువైంది. శ్రీ రాముని కల్యాణానికి అయ్యే నిధులు నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు అందించలేదు. ప్రతి సంవత్సరం భద్రాద్రిలో శ్రీ రామనవమికి కన్నులపండువగా జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వ పెద్దలు హాజరై హడావుడి చేయడం తప్ప, ఖర్చు గురించి పట్టించుకునే వారే లేరు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడంతో కల్యాణానికి అయ్యే ఖర్చు దేవస్థానానికి తలకు మించిన భారం అవుతోంది. ఈనెల 28న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాచల దేవస్థానం అధికారులు ఎప్పటిలాగే దేవస్థానం ఖజానా నుంచే ఖర్చు చేస్తున్నారు.
రాష్ట్ర పండుగగా శ్రీరామనవమి గుర్తింపు పొంది ప్రతి గ్రామంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలు నిర్వహించడం తెలంగాణలో దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఏటా స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో హాజరయ్యే భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు వీఐపీ భక్తులకు, నేతలకు ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా స్వామివారి కల్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను పభుత్వం తరపున సమర్పించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. గోల్కొండ పాలకుడు తానీషా కాలం నుంచి ఈ ఆనవాయితీ ఉంది. పద్ధతులు, సంప్రదాయాలు నాటివే కొనసాగుతున్నా, ఇందుకయ్యే ఖర్చుకు మాత్రం ప్రభుత్వాలు పైసా కూడా విదల్చడంలేదు.
- సాక్షి ప్రతినిధి, ఖమ్మం
తడిసి మోపెడవుతున్న వసతుల కల్పన...
సీతారామ కల్యాణానికి భారీగా తరలివచ్చే భక్తుల వసతులు, శానిటేషన్ వంటి బాధ్యతలు సైతం దేవస్థానం వారే భరించాల్సి వస్తోంది. భద్రాచలంలో శ్రీ రామనవమి సందర్భంగా భక్తులకు వివిధ శాఖల ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, గోదావరి నదీ తీరంలో చేసే మరమ్మతులకు సంబంధించిన నిధులను దాదాపు 50 శాతానికి దేవస్థానమే భరిస్తూ వస్తోంది.
కల్యాణం కోసం వచ్చే భక్తులకు కనీస వసతులను ప్రభుత్వం కల్పించకపోవడం ఏమేరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో తొలిసారిగా జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవంపై ఈ ప్రభుత్వమైనా పూర్తిస్థాయి దృష్టి సారించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తొలిసారిగా సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో వీటి ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్భాటమే తప్ప నిధుల జాడే లేదు...
భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున సమర్పించే పట్టువస్త్రాలు, వంద కేజీలకు పైగా ఇచ్చే ముత్యాలు భద్రాచలం దేవస్థానం అధికారులు కొనుగోలు చేసినవి కావడం గమనార్హం. వీటినే కల్యాణం సమయంలో అత్యంత ఆర్భాటంగా ప్రభుత్వపెద్దలు ముఖ్యమంత్రి లేదా దేవాదాయ శాఖ మంత్రి సమర్పిస్తారు. అయితే, ఈ ఖర్చును తామే భరిస్తామని ఓ జీవో జారీ చేసిన ప్రభుత్వం చేతులు దులుపుకుంది తప్ప నిధులను మాత్రం ఇప్పటి వరకు విడుదల చేయలేదు.
పట్టు వస్త్రాలు, ముత్యాలకు 15 వేలే
కల్యాణ వేడుక సమయంలో సీత, రాముడుతోపాటు లక్ష్మణులకు అలంకరించే పట్టు వస్త్రాలను దేవస్థానం దాదాపు రూ. 30 వేలతో కొనుగోలు చేస్తోంది. తలంబ్రాలలో కలిపేందుకుగాను దాదాపు 100 కేజీల ముత్యాలను సైతం దేవస్థానమే సమకూరుస్తోంది. కేజీ రూ.3,000 చొప్పున 3 లక్షల రూపాయల విలువైన ముత్యాలు కొనుగోలు చేస్తోంది. పట్టువస్త్రాలు, ముత్యాలు కలిపి కేవలం 15 వేల రూపాయలు ఇవ్వాలని దాదాపు 10 సంవత్సరాల కిందట అప్పటి ప్రభుత్వాలు నిర్ణయించి జీవోలు జారీ చేశారుు. ఈ నామమాత్రపు నిధులు కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భద్రాచలం దేవస్థానం ఖాతాలో జమకాలేదు.