సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా ప్రభుత్వం పెద్ద ఎత్తున కొలువుల నియామకానికి సిద్ధమైంది. జూన్‌లోనే వివిధ శాఖల్లో 25 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీ స్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే నాలుగు నోటిఫికేషన్ల జారీకి రెడీ అయ్యింది. గ్రూప్–4 కింద 1,500 పోస్టులతోపాటు 700 వీఆర్‌వో, 450 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జూన్ మొదటి వారంలోనే వీటికి నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలున్నాయి. వీటిలో సాధారణ డిగ్రీ, ఇం టర్‌తో పోటీ పడే పోస్టులు ఎక్కువగా ఉండటంతో లక్షలాది మంది నిరుద్యోగులను ఊరిస్తున్నాయి.
మరోవైపు రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో భారీ సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 5,313 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వ ర్యంలో వీటి నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 18న టీఆర్‌ఈఐఆర్‌బీ వీటికి నోటిఫికేషన్లు జారీ చేయనుంది. అలాగే తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 18 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. వీటిలో సివిల్, ఏఆర్ ఎస్సైలు, కానిస్టేబుల్ పోస్టులున్నాయి.
జూన్ 2నే నోటిఫికేషన్ జారీకి పోలీసు శాఖ ఏర్పాట్లు చేసింది. జూన్ 2న 125 పోస్టులతో గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేయాలని టీఎస్‌పీఎస్సీ ముందుగా భావించింది. కానీ జోన్ల వ్యవస్థలో మార్పులు, కొత్తగా 7 జోన్లు, రెండు మల్టీ జోన్ల ఏర్పాటు దృష్ట్యా ఈ నోటిఫికేషన్‌కు బ్రేక్ పడింది. జోన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోరుతూ రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అప్పటివరకు గ్రూప్ వన్ పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలిపేయాలని, ప్రభుత్వం నుంచి వచ్చే తదుపరి ఆదేశాల వరకు వేచిచూడాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.
భర్తీకి అనుమతులు చకచకా
కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతూనే, పెం డింగ్ పోస్టుల భర్తీలో టీఎస్‌పీఎస్సీ వేగం పెంచింది. పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రంలో మొత్తం 1.10 లక్షల ఖాళీలున్నట్లు ప్రభుత్వం వద్ద శాఖల వారీగా గణాంకాలున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ 86 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 12 వేల పోస్టులకు గడిచిన రెండు నెలల్లోనే చకచకా ఉత్తర్వులను జారీ చేయటం గమనార్హం. 115 డిగ్రీ కాలేజీల్లో 1,384 పోస్టులు, పాలిటెక్నిక్ కాలేజీల్లో 199 లెక్చరర్ పోస్టులు, సిద్దిపేట మెడికల్ కాలేజీలో 931 పోస్టులు, వైద్య శాఖ పరిధిలో 1,224 పోస్టులు, ఆర్థిక శాఖ పరిధిలో 239 పోస్టులు, నిమ్స్‌లో 399 పోస్టులు వీటిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment