
సుంకిరెడ్డి నారాయణరెడ్డికి రంగినేని ఎల్లమ్మ పురస్కారం అందిస్తున్న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు
సిరిసిల్ల: భావప్రకటనతో సామాజిక న్యాయం జరుగుతుందని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం–2017’డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డికి సోమవారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ సాహిత్యకారులు సమాజహితాన్ని కోరుకుంటారని, వారి భావప్రకటన, భాషా ప్రయోగంతో సామాజిక న్యాయం దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం కీలకమైన పాత్ర పోషించిందన్నారు. కవులు, కళాకారులు తమ కలాలు, గళాలను ఊరూవాడా వినిపించారన్నారు.
నిజాం వ్యతిరేక పోరాటంలోనూ సాహిత్యం ప్రవాహంలా వచ్చిందన్నారు. దివంగత పీవీ నర్సింహారావు వంటి భారత ప్రధానులు ముందుగా సాహిత్యకారులని, ఆయన తన స్వీయ అనుభవాలను కథల రూపంలో ఆవిష్కరించారని వివరించారు. సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం వస్తుందన్నారు. దేశానికి విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గవర్నర్ చెప్పారు. మేకిన్ ఇండియాలో చాలా పెట్టుబడులు వచ్చాయని, మనదేశంలోని చేతివృత్తులపై, మన యువతరంపై వారికి ఉన్న అపారమైన నమ్మకమే పెట్టుబడిగా మారుతోందని వెల్లడించారు.
యువశక్తిలో ప్రపంచంలోనే ఇండి యా మొదటి స్థానంలో ఉంటుందన్నారు. రంగినేని ట్రస్ట్ సాహిత్యసేవలు, అనాథ పిల్లల సేవ, వృద్ధాశ్రమ నిర్వహణలో మానవత్వాన్ని ప్రదర్శిస్తూ.. ముందుకు సాగుతోందన్నారు. తానే స్వయంగా ఎంతోమంది అనాథ పిల్లలను ట్రస్ట్‌లో చేర్పించానని, ట్రస్ట్ ఉప్పు తిన్నందుకు ఇక్కడి దాకా వచ్చానని విద్యాసాగర్‌రావు అన్నారు. తెలంగాణ మంచి సీఎం ఉన్నారని, భాషతోనే తన దిశమారిందని కేసీఆర్ చెప్పారని గవర్నర్ గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment