
భగత్ సింగ్ కోశ్యారి వ్యాఖ్యలు మరాఠీ బిడ్డలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. హిందువులను విభజించేలా గవర్నర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.
ముంబై: మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముంబైలో డబ్బే ఉండదని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే స్పందించారు. భగత్ సింగ్ కోశ్యారి వ్యాఖ్యలు మరాఠీ బిడ్డలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. హిందువులను విభజించేలా గవర్నర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఆయనను ఇంటికి పంపుతారో లేక జైలుకు పంపుతారో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలన్నారు.
భగత్ సింగ్ కోశ్యారి గౌరవ పదవిని చూసి ఇంకా ఎంతకాలం సైలెంట్‌గా ఉండాలో తనకు అర్థం కావడం లేదని థాక్రే అన్నారు. గవర్నర్ పదవిని చేపట్టేవారు కనీసం వారు కూర్చునే కుర్చీనైనా గౌరవించాలన్నారు. అంతేకాదు కరోనా సమయంలో ఆలయాలను త్వరగా తెరవాలని గవర్నర్ తొందరపెట్టారని థాక్రే ఆరోపించారు. గతంలో ఆయన సావిత్రిబాయ్ పూలేను కూడా అవమానించారని పేర్కొన్నారు.
శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపించి వేస్తే దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో డబ్బు ఉండదని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి అన్నారు. వాళ్ల వల్లే ముంబైకి పేరు వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి.
చదవండి: మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం.. రాజీనామాకు డిమాండ్!